Wednesday, November 11, 2009

తెలుగు ' బ్రౌణ్యం'


" ప్రపంచం లోని తెలుగు పరిశోధకులు,ప్రొఫెసర్లు, సాహితీ సంస్థలు, విద్యావేత్తల సేవలన్నీ కలిపినా బ్రౌన్ చేసిన సేవల్లో పావువంతుకు కూడా సరితూగవు "
బంగోరె
( బండి గోపాలరెడ్డి ) అన్నా మాటలు అక్షర సత్యాలు

' ఆ నిష్కామ భాషాభిమాని ఆంధ్రులకు పూజాపాత్రుడు '
దేశోద్ధారక
కాశీనాధుని నాగే్శ్వరరావు పంతులుగారి వ్యాఖ్య ఇది.


తాళ పత్రాలలో శిధిలమై పోతున్న ఎన్నో విలువైన గ్రంథాలను వెలుగులోకి తీసుకువచ్చిన ఆంధ్ర భాషోద్ధారకుడు బ్రౌన్. నవ్యాంధ్ర భాషా సాహిత్య నిర్మాత. 1798 నవంబరు 10 వ తేదీన కలకత్తాలో జన్మించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తన 14 యేటనే తండ్రి మరణించటంతో ఇంగ్లండ్ వెళ్ళి పోయాడు. చదువు పూర్తి చేసుకుని 1817 లో కుంఫిణీ ఉద్యోగిగా మన దేశం వచ్చాడు. మద్రాసులో ఉద్యోగం చేస్తూ అందులో భాగంగా తెలుగు భాషను నేర్చుకున్నాడు. అయితే తెలుగు భాషనేర్చుకోవడానికి ఒక శాస్త్రీయ పద్ధతి అనేది లేకపోవడం గమనించిన బ్రౌన్ భాషను సంస్కరించడానికి పూనుకున్నాడు. ఆ ప్రయత్నంలో పట్టుదలతో తెలుగును క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. అనేక వ్రాత ప్రతులను సేకరించి వాటిని పరిష్కరించి మేలు ప్రతులను వ్రాయడానికి తన స్వంతఖర్చుతో ఎందరో పండితులను నియమించాడు. 1822 లో బందరుకు అసిస్టెంటు జడ్జిగా బదిలీ కావడం మరింత కలిసి వచ్చింది.

మద్రాసులో ఉండగా శిధిలావస్థలో ఉన్న మనుచరిత్ర, వసుచరిత్ర, భాగవత, పలనాటి వీర చరిత్ర, తారాశశాకం మొదలైన గ్రంథాలను సేకరించి మేలు ప్రతులను వ్రాయించాడు. అప్పట్లో మనుచరిత్ర సంపూర్ణ ప్రతులు ఆంధ్ర దేశంలో నాలుగు మాత్రమే ఉండేవని ఆయన రాతలను బట్టి తెలుస్తోంది. చాలా గ్రంథాలను సంస్కరించి భద్రపరచడంతో బాటు వాటిలో కొన్నిటికి ఇంగ్లీషులో అనువాదాలు కూడా చేసాడు.

1824 లో అనుకోకుండా వేమన పద్యాల గురించి తెలుసుకుని వాటిని సేకరించడానికి పూనుకున్నాడు. 1829 లో కొన్ని పద్యాలకు ఆంగ్లానువాదం చేసి ప్రచురించాడు. తర్వాత చాలా పద్యాలు సేకరించాడు. మధ్యలో 1834 నుండి 1837 వరకూ ఇంగ్లాండ్ వెళ్ళినా కూడా తెలుగు భాషా శొధన కొనసాగించాడు. తెలుగు భాషకు ఆంగ్లంలో వ్యాకరణాన్ని, తెలుగు సాహిత్యంలో చంధశాస్త్ర వివరణ గ్రంధాన్నీ బ్రౌన్ అందించాడు. ఆయనకు అజరామర కీర్తిని తెచ్చిపెట్టన గ్రంధాలు ఇంగ్లీషు తెలుగు, తెలుగు ఇంగ్లీషు నిఘంటువులు. ఈనాటికీ అవి ప్రామాణిక గ్రంధాలే ! 1852 లో వీటి్ని వెలువరించాడు. 1884 లో ఆయన చనిపోయే వరకూ కూడా ఆ నిఘంటువులను పునర్విమర్శ చేస్తూ ఆధునీకరిస్తూనే ఉన్నాడు. ఆయన చేసిన తెలుగు భాషా సారస్వత సేవ ఆయనకు శాశ్వత కీర్తి ప్రతిష్టలను అందించింది. తెలుగు భాష ఉన్నంతవరకూ బ్రౌన్ దొర గుర్తుండి పోతాడు. విదేశీయుడైనా తెలుగు వారెవరూ చెయ్యని, చెయ్యలేని భాషా సేవ బ్రౌన్ చేసాడు. ఆయన లేకపోతే వేమన పద్యాలు, పురాతన గ్రంథాలు మనకి దక్కేవి కాదేమో ! అందుకు తెలుగు జాతి మొత్తం ఆయనకు ఋణపడి ఉంది. ఉంటుంది.

( చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జన్మదిన సందర్భంగా తెలుగుజాతి తరుఫున ఘన నివాళులర్పిస్తూ ……….. )

7 comments:

Truely said...

In the recent past , C P Brown tomb was found at South Kensignton at London. All Telugu people staying at UK must pay tributes to him at this place

SRRao said...

Mady !
Thanks for your response and valuable information.

Vasu said...

బ్రౌన్ తెలుగు ప్రజలకి నిజంగా వరం. తెలుగు వాళ్ళే కనీసం ఆలోచన కూడా చెయ్యని భాషా హిత కార్యాలని , సంకల్పించి పూర్తీ చేసి, తెలుగుకు ఎనలేని సేవ చేసాడు. ఆయన జన్మ దినాన ఆయన్ని గుర్తు చేసి, స్మరించుకునేలా చేసినందుకు ధన్యవాదాలు.

SRRao said...

వాసు గారూ !
ఆ వరాన్ని మనం మర్చిపోతున్నామండీ ! అనవసరమైన చర్చలు, అర్థం లేని రంధ్రాన్వేషణలు చేస్తూ కాలక్షేపం చెయ్యకుండా బ్రౌన్ ని స్పూర్తిగా తీసుకుని నిజాయితీగా కృషి చేస్తే మన తెలుగు సాహితీ, చారిత్రిక సంపదను కాపాడడుకోగలం.

డా.ఆచార్య ఫణీంద్ర said...

ఎస్. ఆర్. రావు గారు !
తెలుగు భాషకు విశేషమైన సేవ చేసిన బ్రౌను దొరపై చక్కని వ్యాసాన్ని అందించారు. మీకు నా అభినందనలు !
ఈ సందర్భంగా ఆ మహనీయునిపై పదేళ్ళ క్రితం వ్రాసుకొన్న పద్యాలు గుర్తుకొచ్చాయి. మచ్చుకు ఒక మూడు ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆస్వాదించండి.

"క్షీణావస్థను డోలికాయ గతియౌ శీర్ణాంధ్ర సాహిత్యమున్
ప్రాణమ్మూదియు కావ బూనితివి శ్రీ " బ్రౌణ్యాఖ్య " ! ఆంధ్రావనిన్
వీణాపాణికి సేవ జేసి, ఘనతన్ విశ్వాంతరాళమ్ములో
కోణాలన్నిట వ్యాప్తి జేసితివి - మా కొండంత దీపానివో !

ఎక్కడి వాడవయ్య ? అసలేమిటి బంధము నీకు తెల్గుకున్ ?
ఇక్కడికేగుదెంచితివి - ఇచ్చితి జన్మ మరొక్కమారు - మా
తిక్కన పెద్దనాది ఘన ధీయుతులౌ కవి పుంగవాళికిన్ !
ఎక్కడొ మూల దాగిన కవీంద్రుడు వేమన సత్యశోధుకున్ !

తెలుగు సాహిత్యమునకు నీ సలిపినట్టి
సేవ, స్మరణీయమై కూర్చె చిరము యశము !
తెలుగు భాషయే జీవించి వెలుగు వరకు
తీర్చలేడు నీ ఋణము మా తెలుగు వాడు !"

SRRao said...

ఆచార్య ఫణీంద్ర గారూ !
చిరస్మరణీయుడు బ్రౌన్ దొర గురించి ఎంత చెప్పుకున్నా ఆయన తెలుగువారికి, భాషకి చేసిన సేవ ముందు తక్కువే ! ఆయన మీద అందమైన పద్యాలు అల్లారు. చాలా సంతోషంగా ఉంది.మీరు అనుమతిస్తారనే నమ్మకంతో ఈ పద్యాలు మరింతమంది చదవాలనే ఉద్దేశ్యంతో నా బ్లాగులో మీ పద్యాలను ప్రచురిస్తున్నాను. మన్నించగలరు.

Unknown said...

శ్రిరావు గారికి నమస్కారము!

బ్రౌన్ దొర వారి సాహితీ సేవ తెలుగు వారు మరచిపోలేని వారి కృషి వివరంగా తెలియజేసారు. శ్రి ఫణీంద్ర గారి పద్యాలు ముచ్చట గొలుపుతున్నాయి. మంచి వ్యాసం. కాటన్ దొర బ్రౌన్ దొర తెలుగు వారికి సూర్య చంద్రుల తో సమానం. అతిశయోక్తి కాదు సుమా! పచ్చి నిజం.

గుమ్మా రామలింగ స్వామి
25/07/2013

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం