ఆంధ్రులకు ప్రత్యేకమైన సాహితీ ప్రక్రియ అవధానం. ఇది పూర్తిగా ధారణ మీద ఆధారపడి ఉంది. అందులొ అప్రస్తుత ప్రసంగం విలక్షణమైనది. అవధాని ఏకాగ్రతను భంగం చెయ్యడమే దాని లక్ష్యం. అలాంటి అప్రస్తుత ప్రసంగానికి
అవధానులిచ్చిన చమత్కారమైన సమాధానాలు కొన్ని చూడండి.
* ఓ అవధానిగారికి నెత్తి మీద జుట్టు పల్చగా ఉంటుంది. ఆయనకు దాన్ని మాటి మాటికీ దువ్వుకోవడం అలవాటు.
అది చూసిన అప్రస్తుత ప్రసంగం వారు ఆ అవధానిని ఆట పట్టిస్తూ ' ఆ వున్న నాలుగు పుంజీల వెంట్రుకలు మాటి మాటికీ దువ్వాలేమిటి ? ' అని ఆక్షేపించాడు.
దానికా అవధాని గారు " నీకేం తెలుస్తుంది నాయనా నా బాధ ! నలభై ఎకరాలున్న వాడు ఎలా ఖర్చు పెట్టుకున్నా ఫర్వాలేదు. నాలుగు ఎకరాలే ఉన్నవాడు కొంచెం వెనుకా ముందూ ఆలోచించి జాగ్రత్తగా ఆ ఉన్న వాటిని కాపాడుకోవాలి. నా పరిస్థితీ అంతే ! " అన్నారు.
* " అయ్యా ! నాకో శుభలేఖ వచ్చింది. కీర్తిశేషులిద్దరు పెళ్ళి చేసుకుంటున్నారు. నన్ను రమ్మని ఆహ్వానించారు. వెళ్ళమంటారా ? " అని అడిగాడొక పృచ్చకుడు ఒక అవధానంలో .
దానికి సమాధానంగా అవధానిగారు " తప్పకుండా వెళ్ళండి" అని ఆగారు. అందరూ ఆశ్చర్య పోయారు. ఏమిటీయన
కీర్తిశేషుల పెళ్ళీ అంటే వెళ్ళమంటాడు. స్వర్గానికి వెళ్ళమనా అని అందరూ అనుకుంటుండగా ' అమ్మాయి పేరు కీర్తి. అబ్బాయి పేరు శేషు. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటుంటే వెళ్ళడానికి మీకభ్యంతరం ఏమిటి ? "
అనగానే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.
( ప్రముఖ అవధాని డా. గరికపాటి నరసింహారావు గారు చెప్పిన సంగతులివి )
No comments:
Post a Comment