Wednesday, December 1, 2010

పూలమ్మిన చోట....

 పూలమ్మిన చోట కట్టెలమ్మాల్సిన పరిస్థితి వస్తే .......... ఉహించడం కష్టం.
 అప్పుడప్పుడు కొందరి జీవితాల్లోనైనా ఈ అనుభవం ఎదురవుతూ వుంటుంది  బళ్ళు ఓడలవుతాయి. ఓడలు బళ్ళవుతాయి. ఈ సృష్టిలో ఇది సహజం. విధి ఆడే ఆటలో అందరూ పావులే !

చలన చిత్రసీమలో ఇలాంటి చిత్రవిచిత్రాలెన్నో కనిపిస్తాయి. తళుకు బెళుకులతో మురిపించే చలన చిత్రరంగంలో కొందరు ప్రముఖులకు ఇది అనుభవైకవేద్యమే ! భారత దేశంలో చలన చిత్ర రంగ పితామహుడు ఎవరు అనడిగితే వెంటనే దాదా సాహెబ్ ఫాల్కే అని చెప్పలేని వారెవరూ వుండరేమో ! ఆయన ఎంతటి కీర్తిప్రతిష్టలు ఆర్జించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ చలన చిత్ర పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే పేరనే వుంది. ఈ మధ్యనే మన తెలుగు మూవీ మొఘల్ రామానాయుడు గారు ఆ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలుగు వారందరికీ తెలుసు.
అంతటి గొప్ప వ్యక్తి ఆర్జించి తన వారసులకు ఇచ్చినవి కీర్తి ప్రతిష్టలే కానీ ధన ధాన్యరాశులు కావు. దానికి తార్కాణం దాదా సాహెబ్ ఫాల్కే గారి ఏకైక కుమారుడు కొంతకాలం క్రితం వరకూ ముంబై వీధుల్లో తిరుగుతూ బ్రతుకుతెరువు కోసం అగరుబత్తిలు అమ్ముకుంటూ జీవనం సాగించారు. ఈ విషయం చాలామందికి తెలియదు కూడా !

మన తెలుగు చిత్రసీమలో హాస్య నటులకు స్టార్ డం తెచ్చిపెట్టిన నటుడు కస్తూరి శివరావు. ఆయన చిత్రసీమలో ప్రవేశించక ముందు హార్మోనియం, తబలా మొదలైన సంగీత వాయిద్యాలు వాయించేవారు. మూకీ సినిమాలకు అప్పట్లో ప్రతీ థియేటర్ లోను వ్యాఖ్యాతలుండేవారు. శివరావు గారు కూడా అలా చాలా మూకీ సినిమాలకు వ్యాఖ్యానం చెప్పేవారు. సినిమా  ప్రొజెక్టర్ ఆపరేటర్ గా కూడా పని చేశారు. చిత్రరంగంలో ప్రవేశించి ' గుణసుందరి కథ ' చిత్రంతో తారాపథానికి చేరారు. ఒక వెలుగు వెలిగారు. ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా రాణించారు. ఆ రోజుల్లో సమాజంలో బాగా ధనవంతుల వద్ద మాత్రమే ఉండే ' బ్యూక్ ' కారు ఆయన దగ్గర ఉండేది. దాన్ని బట్టి ఆయన అప్పట్లో ఎంతటి ఉచ్చ స్థాయిలో వుండేవారో అర్థం చేసుకోవచ్చు.
అయితే రోజులేప్పుడూ ఒకేలా వుండవు. అంతటి స్థాయి నుంచి ఆయన పతనం ప్రారంభమై చివరిరోజుల్లో దుర్భర దారిద్యం అనుభవించారు. అంత్యక్రియలకు చందాలు వేసుకోవాల్సిన పరిస్థితి.
ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన ' పరమానందయ్య శిష్యుల కథ ' చిత్రం నిర్మాణ దశలో వుండగా జరిగిన ఓ తమాషా సంఘటన. ఓ రోజు ఓ సన్నివేశంలో నటించడానికి గాడిద కావాల్సి వచ్చింది. సరే .... గాడిదను తీసుకొచ్చారు. సరిగ్గా ' టేక్ ' చేసే సమయానికి ఆది కాస్తా హాయిగా పడుకుంది. దాని శిక్షకుడు ఎన్ని రకాల ప్రయత్నించినా లేవలేదు. యూనిట్ లోని వారందరూ కూడా తమ యథాశక్తి దాన్ని లేపడానికి ప్రయత్నించారు. ఫలితం శూన్యం. చివరగా కస్తూరి శివరావు గారు లేచి దాని దగ్గరకు వెళ్ళి చెవిలో ఏదో చెప్పారు. అంతే ... ఆది వెంటనే చెంగున లేచి కూర్చుంది. అందరికీ ఆశ్చర్యమేసింది. గాడిద చెవిలో ఏం చెప్పారని శివరావు గారిని అడిగారు. దానికాయన
" నేనేం ప్రత్యేకంగా చెప్పలేదు. ' లే బాబూ ! నీకు పుణ్యముంటుంది ' అన్నానంతే ! దానిక్కూడా డబ్బులిచ్చేది నేనేనని తెలిసిపోయినట్లుంది. అందుకే నా మాట విని లేచింది " అన్నారు.  

కస్తూరి శివరావు నటనా జీవితాన్ని మలుపుతిప్పిన ' గుణసుందరి కథ ' లోని ఆయన నటన / నాట్య విన్యాసం .....



Vol. No. 02 Pub. No. 070

7 comments:

Rao S Lakkaraju said...

వాళ్ళ శ్రమ ఊర్కేనే పోలేదు. తరతరాలూ తలుచుకునే పని చేశారు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

Vinay Datta said...

what happened to Phalke's son later? what is he doing now?

SRRao said...

@ రావు గారూ !
ధన్యవాదాలు

@ మాధురి గారూ !
రెండు దశాబ్దాల క్రితం సమాచారం ఇది. తర్వాత ఆయన పరిస్థితి, ఉనికి గురించి ఎక్కడా సమాచారం లేదు. ధన్యవాదాలు.

vishnu Sharma said...

vinadanike badha karanga unna.. Prapancham lo talli tandrulu pillalaki evalasindi bataka daniki avasaramaina shakti matrame. dada saheb palke gari putrudu agaruvatulu ammukunna adi migata andariki gauravame..

SRRao said...

* విష్ణుశర్మ గారూ !
ధన్యవాదాలు

buddhamurali said...

ss rao గారు ఆనాటి తారల గురించి ఆసక్తి కరమైన విషయాలు చెబుతున్నారు బాగున్నాయి. వీరి జీవితాలను చూశాక ఆ తరువాత తరం వారు బాగానే గడించారు అయితే ఇలాంటి వారిని ఆదు కుందాముఅనే మంచి మనసు మాత్రం వారికి లేకుండా పోయింది .

SRRao said...

మురళి గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం