Friday, December 3, 2010

మన తొలి రాష్ట్రపతి

కాలం పరుగులు పెడుతోంది. తరాలు మారుతున్నాయి. రాబోయే తరాలు మన స్వాతంత్ర్య సమరం గురించి ఇక పుస్తకాలలో, అంతర్జాలంలో మాత్రమే చదువుకునే పరిస్థితి వస్తోంది. ఎందుకంటే అప్పటి చిహ్నాలు, ఆ సమరంలో పాల్గొన్న మనుష్యులు క్రమంగా కనుమరుగవుతున్నారు. గాంధీజీ, నెహ్రుజీ లాంటి వాళ్ళను తప్ప స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న మిగిలిన ప్రముఖులను గురించి తెలియని పరిస్థితి ఎదురవబోతోంది. ఇప్పటికే వాళ్ళు చేసిన త్యాగాలను మరచిపోయాం ! కనీసం మరచిపోయినట్లు నటిస్తున్నాం ! మన తర్వాతి తరాలకు వారి గుర్తులు కూడా మిగలకుండా చేసే పరిస్థితి ఏర్పడబోతోంది. ఆ మధ్య గాంధీ చిత్రం రాకపోతే ఇప్పటి తరంలోనే ఆ ప్రమాదం ఏర్పడేదేమో ! అటెంబరో ఒక రకంగా ఆ ప్రమాదం నుంచి మనల్ని రక్షించాడు. అలా మరుగున పడుతున్న మహనీయుల్లో ఒకరు బాబూ రాజేంద్ర ప్రసాద్.

స్వాతంత్ర్య సమర యోధుడు, సమాజ సేవకుడు, విద్యావేత్త, రాజ్యాంగ రచనా సంఘ ప్రముఖుడు, భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్. 1884 లో  బీహార్ లోని ఒక గ్రామంలో జన్మించిన రాజేంద్రప్రసాద్ పాట్నాలోను, కలకత్తా లోనూ పై చదువులు చదివారు. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో సైన్సు విద్యార్థిగా జగదీశ్ చంద్ర బోస్, ప్రఫుల్ల చంద్ర రాయ్ లాంటి ఉద్దండుల దగ్గర శిష్యరికం చేశారు. అక్కడే ఆయనలోని నాయకత్వ లక్షణాలు విద్యార్థి సంఘాల నిర్వహణ ద్వారా బయిట కొచ్చాయి. తర్వాత ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన కొంతకాలం ముజఫర్ పూర్ లో అధ్యాపకునిగా పనిచేశారు. తన సోదరుని సూచనతో ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి న్యాయశాస్త్రం చదివి పట్టా పుచ్చుకున్నారు. లాయర్ వృత్తిలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ప్రో. అశుతోష్ ముఖర్జీ గారి ఆహ్వానం మీద కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు.

దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం అనే ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించి భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ పిలుపుకు ప్రభావితులై స్వాతంత్ర్య సమరంలో ప్రవేశించారు రాజేంద్రప్రసాద్. ప్రముఖ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ సాహచర్యంలో స్వాతంత్ర్యోద్యమం గురించి పత్రికలలో అనేక వ్యాసాలూ రాసారు. ఉద్యమ ప్రచారం కోసం అనేక ప్రాంతాలు పర్యటించారు. ఆ ఉద్యమంలో పూర్తి సమయం పనిచెయ్యడం కోసం బంగారు బాతు లాంటి న్యాయవాద వృత్తిని త్యజించారు. 1934 లో బొంబాయి లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1939 లో సుభాస్ చంద్ర బోస్ రాజీనామాతో మరోసారి కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. బీహార్, బెంగాల్ లలో సంభవించిన వరదలు, భూకంపాలు లాంటి విపత్తులలో భారీ ఎత్తున విరాళాలు సేకరించి అప్పటి ప్రభుత్వం కంటే బాధితులకు మెరుగైన సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్ర్యోద్యమంలో జైలు శిక్ష కూడా అనుభవించారు.

1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించగా 1950 లో సర్వసత్తాక రాజ్యంగా ( రిపబ్లిక్ గా ) మారింది. ఆ సమయంలోనే కొద్దికాలం ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. రాజ్యాంగ రచనా సంఘంలో బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ పాత్ర పోషించారు. సర్వసత్తాక రాజ్యంగా అవతరించిన భారదేశానికి తొలి రాష్ట్రపతి గా రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. అప్పటినుంచి పన్నెండు సంవత్సరాలు భారత రాష్ట్రపతిగా పనిచేసిన ఆయన 1962 లో స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు. 

ఈరోజు ( డిసెంబర్ 3 వ తేదీ ) మన తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఆయన్ని గుర్తుచేసుకుంటూ........

Vol. No. 02 Pub. No. 073

7 comments:

Dr.Suryanarayana Vulimiri said...

రావుగారు, మనం మరచిపోతున్న మన ప్రియనేతలను గుర్తుకు తెస్తూ విలువైన గతచరిత్రను గుర్తుకు తెచ్చారు. రాజేంద్రప్రసాద్ గారు అందరికీ చిరస్మరణీయులు. చాలబాగుంది మీవ్యాసం.

Anonymous said...

రావు గారు నమస్తే ! మీరు కుశలమని తలుస్తాను

Vinay Datta said...

Yes, we need to know about all great freedom fighters. Ofcourse, Every freedom fighter is great.

SRRao said...

* స్వగతం గారూ !
* మాధురి గారూ !
ధన్యవాదాలు
* లలితా గారూ !
చిరకాల దర్శనం. నేను కుశలమే ! మీరు కూడా కుశలమే అని తలుస్తాను. మీ తాజా టపా కోసం ఎదురు చూస్తుంటాను.

Shakthi said...

నమస్తే రావ్ గారు __/\__

మీ Blog ఉన్న వ్యాసాలు,చరిత్రలూ,ఒక్కటేమిటి

అబ్భా అన్నీ చాలా బాగున్నాయి ..

సినీ హిరోయిన్ " లక్ష్మి " గురించి చాలా బాగా రాసారు

సువర్ణసుందరి,పాతాళబైరవి, లాంటి సినిమాలు మళ్ళి వస్తాయా?

అవన్ని మరపురాని మధుర సినిమాలు ఎన్నిమార్లు చూసినా తనివితీరనివి

"గోవుమాలక్ష్మికి కోటిదండాలు "చాలాబాగా రాసారు చదవాలంటే ఒక్కరోజు

పట్టదండీ మళ్ళి మళ్ళి మీ సైట్ కి రావాల్సిందే...రాజేద్రగారు చెప్పారు

అత్యాసేమో అని ఆశ వుండటంలో తప్పులేదుగా ?

మళ్ళి అలాంటి సినిమాలు రావాలంటే..మనకు అదృష్టం వుండాలి మరి :)

Shakthi said...

ఒక్కసారి నా BLOG ను సందర్శించండి Please

http://www.animutyaalu.blogspot.com/

SRRao said...

శక్తి గారూ !

మీకు నా బ్లాగు, రాతలు నచ్చినందుకు చాలా సంతోషం. మీరు చాలా టపాల వ్యాఖ్యలు ఇక్కడే రాసేసారు. వేటి గురించి ఆయా టపాల్లో రాస్తే బాగుంటుందేమో !
మీ బ్లాగు చూసాను. మంచి అభిరుచితో మంచి పాటల్ని పరిచయం చేస్తున్నారు. అభినందనలు. మీ బ్లాగు గతంలో కూడా కొన్నిసార్లు చూసాను. కొనసాగించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం