ఏటికి ఎదురీదమంటే ఆయనకు బహు ప్రీతి పాత్రమైన విషయం.
సంఘంలో పేరుకుపోయిన దురాచారాల్ని దిక్కరించారు.
సాంప్రదాయ వాదుల్ని ఎదిరించారు.
అప్పటికే సమాజంలో పేరుకుపోయిన ఎన్నో మూఢ విశ్వాసాలని రూపు మాపడానికి తన జీవితాంతం శ్రమించారు.
ఆయనే ఆంధ్రుల్లో ఆణిముత్యం కందుకూరి వీరేశలింగం పంతులుగారు.
ఆయన కవి, పండితుడు, పాత్రికేయుడు... వీటన్నిటికీ మించి సంఘ సంస్కర్త.
ఆయన చేపట్టి విజయం సాధించిన వాటిలో ముఖ్యమైన సంస్కరణ విధవాపునర్వివాహం.
భర్త చనిపోయిన స్త్రీ బొట్టు, గాజులు, పువ్వులు, మంచి చీరలు చివరికి ఆడువారికి అందాన్నిచ్చే శిరోజాలు వదులుకుని జీవితాంతం జీవచ్చవంలా బ్రతకాలనే దుష్టసాంప్రదాయం ఎవరు, ఏకాలంలో ప్రవేశపెట్టారో గానీ... చాలాకాలం స్త్రీలను శాపంలా పట్టుకుని పీడించింది. దాన్ని ఎదిరించడానికి గానీ, ఆ దురాచారాన్ని రూపుమాపడానికి గానీ ఎవరికీ ధైర్యం ఉండేదికాదు. ఎదిరిస్తే... కనీసం మాట్లాడితే మతాధికారుల ఆగ్రహానికి గురవుతామని, సంఘ బహిష్కరణకు గురవుతామనే భయం చాలా ఎక్కువగా ఉండేది. అసలు ఆ విషయం మాట్లాడడమే మహాపాపం అనుకునే పరిస్థితి. ప్రజల్లో ఈ విషయంలో మూఢత్వాన్ని పోగొట్టడానికి సమాజాన్ని ఎదిరించి ఎన్నో తిరస్కారాలు, చీత్కారాలు, బెదిరింపులు ఎదుర్కొని చివరకు విజయాన్ని సాధించి... వీరేశలింగం గారు తొలి విధవా పునర్వివాహం జరిపించిన రోజు 1881 వ సంవత్సరం డిసెంబర్ 11 .
దేశంలో చాలా చోట్ల అప్పటికే కొంతమంది సంస్కరణాభిలాషులు ప్రయత్నాలు ప్రారంభించినా అవి విజయవంతం కాలేదు. ఆ సమయంలోనే మద్రాస్ లో కూడా కొంతమంది ఒక సమాజాన్ని ఏర్పాటు చేశారు. ఇది దురాచారమని అందరికీ తెలిసినా బయిటకు వెల్లడించే ధైర్యం చాలామందికి లేకపోవడం వల్ల ఆ సమాజ కార్యకలాపాలు మందగించాయి. స్థాపకుల ఆశయం నీరు కారిపోయింది. అయితే ఇక్కడ రాజమహేంద్రిలో వీరేశలింగం గారు అలా ఊరుకోలేకపోయారు. ఎందరు నిరుత్సాహపరిచినా ఆయన తన ఆశయం నెరవేర్చుకోవాలనే పట్టుదల పెంచుకున్నారు.
అప్పట్లో వేద వేదాంగాలను ఔపోసన పట్టిన పండితులు కూడా ఈ మూఢత్వానికి లోనయ్యారు. ఎవరైనా విధవా పునర్వివాహం గురించి మాట్లాడితే వారికి సంఘ బహిష్కరణ శిక్ష విధించేవారు. కందుకూరి వారు తమ వివేకవర్ధని పత్రిక ద్వారా ఇలాంటి దురాచారాలను గురించి చైతన్య పరిచే రచనలు చేసేవారు. అయితే దానివలన వాళ్ళ ఆలోచనలలో మార్పు తీసుకురాగలిగినా, ఆచరణ దాకా తీసుకురాలేకపోయాననే వేదన ఆయనలో వుండేది. అందుకే ఎంతమంది ఆయన్ని నిరుత్సాహపరచినా ప్రియ మిత్రుడు చల్లపల్లి బాపయ్య గారి ప్రోత్సాహంతో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. స్త్రీ పునర్వివాహ విషయంలో మొట్ట మొదటి మహాసభ 1879 వ సంవత్సరం ఆగష్టు 3 వ తేదీన విజయనగరంలో జరిగింది. ఆ సభకు హాజరైన సామాన్య జనం ఆలోచనలో పడినా పండితోత్తములు మాత్రం వీరేశలింగం గారిని పలు రకాలుగా దూషించి ఆయన ప్రతిపాదించిన విషయాలను తోసిపుచ్చారు. తర్వాత జరిగిన కొన్ని సభల్లో ఆయనపై దాడులకు కూడా ప్రయత్నించారు.
ఇంత వ్యతిరేకత ఎదురవుతున్నా చలించక కొంతమంది మిత్రులతో స్త్రీ పునర్వివాహ సమాజం పేరుతో ఒక సంస్థను స్థాపించి ఊరూరా తిరిగి ప్రచారం చేసేవారు. ఆ సమయంలో కూడా అనేక చోట్ల ఆయనకు ఎక్కువగా వ్యతిరేకత ఎదురయ్యేది. కాకినాడకు చెందిన పైడా రామకృష్ణయ్య గారు వారికి ఆర్థిక సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చారు. మెల్లగా అనేకమంది అభ్యుదయవాదులు వీరేశలింగం గారితో కలిశారు. అంతేకాక అనేకమంది ప్రభుత్వోద్యోగులు కూడా ఆయన కార్యక్రమాలకు మద్దతిచ్చారు. దాంతో ప్రతిపక్షం పరోక్ష దాడికి పథక రచన ప్రారంభించాల్సి వచ్చింది. ఎంతోమంది యువకులు, విద్యార్థులు వీరేశలింగంగారి కార్యక్రమాలకు ప్రభావితులయ్యారు. ఆయనకు మద్దతిచ్చారు.
కృష్ణా జిల్లా తిరువూరు తాసిల్దారుగా పనిజేసిన దర్భా బ్రహ్మానందంగారు వీరేశలింగం గారి ప్రభావంతో ఒక విధవ బాలికకు వివాహం జరిపించడానికి ఆమె తల్లిని ఒప్పించి ఆ విషయంలో సహాయం చెయ్యాల్సిందిగా వీరేశలింగం గారిని కోరారు. కొంతమంది నమ్మకస్తులను పంపితే తల్లిని ఒప్పించి ఆ బాలికను వారి వెంట పంపగలనని కూడా తెలిపారు. అయితే వారి గ్రామంలో వారికి గల పలుకుబడి కారణంగా ఈ పని అత్యంత రహస్యంగా జరగాలని ఆమె కోరినట్లుగా ఉత్తరం రాశారు. బ్రహ్మానందంగారి కోరిక మేరకు వీరేశలింగంగారు ఇద్దరు మనుష్యుల్ని పంపారు. అయితే వీరు అక్కడికి చేరేలోగా బ్రహ్మానందం గారికి బదిలీ అయినట్లు తెలిసింది. అప్పటికే తిరువూరు చేరుకున్న ఆ వ్యక్తులు విషయం తెలుసుకుని దగ్గరలోనే వున్న ఆ గ్రామానికి రహస్యంగా వెళ్ళి ఆ బాలిక తల్లిని కలుసుకుని ఆమెను ఒప్పించి తమతో రాజమహేంద్రి తీసుకెళ్లారు. తమ ఇంట వుండి చదువుకుని పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్న గోగులపాటి శ్రీరాములుని వరునిగా ఒప్పించారు పంతులుగారు. అప్పటికే అతనికి వివాహమై భార్య చనిపోవడం జరిగింది. ముహూర్త సమయానికి అతనికి అధికారులు సెలవు మంజూరు చెయ్యలేదు. వీరేశలింగంగారు ఉన్నతాధికారుల సిఫార్సుతో అతనికి సెలవు మంజూరు చేయించడమే కాక పెళ్ళికి ఎవ్వరూ విఘాతం కలిగించకుండా పోలీసు రక్షణ కూడా తీసుకున్నారు. వీరేశలింగం గారికి ఊరిలోని వ్యతిరేకులందరూ సహాయ నిరాకరణ ప్రారంభించారు. ఎవరూ ఆ పెళ్ళికి హాజరుకాకుండా వుండేందుకు, పనివాళ్ళెవరూ పని చేయకుండా వుండేందుకు ప్రయత్నాలు చెయ్యసాగారు. అయితే వాటన్నిటినీ వీరేశలింగంగారు తిప్పికొట్టి పెళ్లి నిర్విఘ్నంగా జరిగేటట్లు ఏర్పాట్లు చేశారు.
ప్రభుత్వాధికారులు ముఖ్యంగా పోలీసు వారు ఆయనకు రక్షణగా నిలిచారు. ఊరంతా నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. వరుని ఇంట్లో కూడా అనేక రకాల బుజ్జగింపులు, బెదిరింపులు సాగాయి. అయినా అతను ఏమాత్రం జంకలేదు. ఫలితంగా అటువంటి మహాసంక్షోభంలో కూడా 1881 వ సంవత్సరం డిసెంబర్ 11 వ తేదీ రాత్రి రాజమహేంద్రి లోని కందుకూరి వీరేశలింగం గారి యింట మొదటి.. స్త్రీ పునర్వివాహం జరిగింది.
వీరేశలింగంగారి సంకల్పం, పట్టుదల, దీక్ష ముందు మూర్ఖ సాంప్రదాయాలు నిలబడలేకపోయాయి. ఆయనంత కష్టానష్టాలకోర్చి అయిన వాళ్లందర్నీ దూరం చేసుకోవడానికి కూడా సిద్ధపడి ఈ సంస్కరణలకు పూనుకొని మహానుభావుడయ్యాడు. ఇప్పుడు స్త్రీ పునర్వివాహాన్ని సహజమైన ప్రక్రియగా చూస్తున్నారు గానీ వీరేశలింగంగారు చేసిన మొదటి స్త్రీ పునర్వివాహం తర్వాత కూడా సమాజం నుండి అంత త్వరగా ఆయనకు మద్దతు రాలేదు. పూర్తిగా మార్పు రావడానికి సుమారు ఒక శతాబ్దం పట్టింది. ఇంకా ఇప్పటికీ మన సమాజంలో అనేక దురాచారాలు, దుష్ట సాంప్రదాయాలు పాతుకుపోయాయి. అందులో ఒకటి అవినీతి. ఇది ప్రస్తుతం సాంప్రదాయమై కూర్చుంది. వీరేశలింగంగారు సంఘసంస్కర్త మాత్రమే కాదు ... పాత్రికేయుడు కూడా ! ఆయన తన వివేకవర్ధని పత్రిక ద్వారా సంఘంలోని, అధికారుల్లోని అవినీతిని ప్రక్షాళన చెయ్యడానికి కూడా ప్రయత్నించేవారు. తన పత్రికను చూసి అవినీతిపరులందరూ భయపడాలనుకునేవారు. ఇప్పటి సంఘంలో పెరుగుతున్న అవినీతిని ముఖ్యంగా మీడియా రంగంలో కూడా అడుగుపెట్టిన అవినీతిని పెళ్లగించడానికి మళ్ళీ వీరేశలింగం గారు పుట్టాలేమో !
తొలిసారిగా స్త్రీ పునర్వివాహం జరిగిన రోజును... వీరేశలింగం గారి ఆశయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ...
Vol. No. 02 Pub. No. 080
Saturday, December 11, 2010
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
3 comments:
ఎంతో విలువైన సమాచారాన్ని పరిశోధించి, వెలికి తీసి అందించారు. మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు.
Nice that you are reminding the readers the dates of all such events.
* ఆచార్య ఫణీంద్ర గారూ !
* మాధురి గారూ !
మనం మహానీయులం కాకపోయినా మహనీయులైన వారిని అప్పుడప్పుడైనా స్మరించుకోవడం మన ధర్మమని నా ఉద్దేశ్యం. తద్వారా మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకునే అవకాశం కలుగుతుందనే చిన్న ఆశ. మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.
Post a Comment