Monday, December 20, 2010

మంచి చిత్రాల ' వేదిక '

కొంతకాలం క్రితం వరకూ దేశ విదేశాలలోని మంచి చిత్రాలను ప్రదర్శించడానికి తగిన వేదికలుండేవి కాదు. ఇప్పుడు విదేశీ చిత్రాలను అందించే టీవీ చానల్స్, వెబ్ సైట్లు ఎన్నో వున్నా వాటిలో కూడా వ్యాపారాత్మక మసాలాలున్న చిత్రాలే ఎక్కువగా దొరుకుతున్నాయి. కనుక మంచి చిత్రాలు కోరుకునే ప్రేక్షకులకు ఇప్పటికి కూడా వెదుకులాట, ఎదురు చూపులు తప్పదేమో !

తమ అభిరుచికి తగ్గ చిత్రాలను సేకరించి ప్రదర్శించుకోవడానికి తమతో పాటు తమ స్నేహితులు, సహచరులలో మంచి సినిమాలపై అభిరుచి పెరిగేటట్లు చెయ్యడానికి ఫిలిం సొసైటీలు అనేవి ఏర్పడ్డాయి. ఉత్తమ చిత్రాభిరుచిగలిగిన వారంతా కలసి ఏర్పాటు చేసుకున్న వేదికే ఫిలిం సొసైటీ. కొంతకాలం క్రితం వరకూ ఇదొక ఉద్యమంలాగ సాగింది. తర్వాత కాలంలో వచ్చిన టీవీ, వీడియో ఈ ఉద్యమాన్ని నీరు కార్చాయి.

సాంకేతికత పెరిగినంతగా విలువలు పెరగలేదు...సరికదా మరింత దిగజారుతున్నాయి. తద్వారా మసాలా, మూస ఫార్ములా చిత్రాలే విజయం సాదిస్తాయనే దురభిప్రాయం నిర్మాతల్లో ఏర్పడిపోయింది. మంచి చిత్రాలు నిర్మించే సాహసం చెయ్యడానికి వారు ప్రయత్నించడం లేదు. కానీ చరిత్రలో మంచి సినిమాలకు ఎప్పుడూ చోటు వుంటుంది. ఒక మసాలా సినిమా విజయం సాధించినంత మాత్రాన అందరూ ఆ దోవన నడవడం అంత మంచి పరిణామం కాదు. చిత్రాలు సందేశాలివ్వనక్కరలేదు. సంస్కరణలు చెయ్యనక్కరలేదు. వినోదం పేరుతో విపరీత ధోరణులకు పోకుండా వుంటే చాలు. మన సంస్కృతిని ప్రతిబింబించే శంకరాభరణం లాంటి చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించిన గుండమ్మ కథ లాంటి కుటుంబ కథా చిత్రాలు దశాబ్దాలు గడిచినా, తరాలు గడిచినా ఈనాటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా వున్నాయి. మనసు వికలంగా వున్నపుడు జంధ్యాల గారి ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలను చూస్తూ రీచార్జ్  అయ్యే తెలుగు వారెందరున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ సినిమాల్లో ఏ ఐటెం పాటలున్నాయి ? ఏ రక్త పాతాలున్నాయి ? ఏ సుదీర్ఘ పోరాటాలున్నాయి ? ఇంకా మసాలాలని చెప్పుకునేవి ఏమున్నాయి ? అవన్నీ పుష్కలంగా వున్న చిత్రాలు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలబడినవి ఎన్ని ?

ఒక మసాలా చిత్రం హిట్ అయితే అలాంటి చిత్రాలు మరెన్నో అదే మూసలో తయారుచేసి  ప్రేక్షకుల మీద రుద్దుతారు. వాటిలో చాలా భాగం పరాజయం పాలవుతాయి. కానీ పైన ఉదాహరించిన చిత్రాల్లాంటివి విజయవంతమైనా, నిర్మాణ వ్యయం తక్కువ వల్లా, మినిమం గారంటీ వున్నా, విజయాల శాతం చాలా ఎక్కువ వున్నా అలాంటి చిత్రాలు నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాతలు ఎంతమంది ? మసాలుంటేనే చిత్రం విజయవంతమవుతుందని, మంచి చిత్రాలు ప్రేక్షకులు ఆదరించరనే నిర్మాతల పలాయనవాదం, ఆత్మవంచన దీనికి కారణం.  వాళ్ళకీ తెలుసు.... ఏవి తక్కువ వ్యయంలో తయారవుతాయో, ఏవి ఎక్కువ శాతం విజయాలు సాధిస్తున్నాయో ! కానీ ఒప్పుకోలేరు. ఒప్పుకోరు. గొర్రె కసాయి వాణ్ణి నమ్ముతుందన్నట్లు మసాలా ఫార్ములానే నమ్ముకుంటారు. ప్రేక్షకులు అలాంటి సినిమాలే చూస్తారనే భ్రమలో వున్న వాళ్ళను మార్చడం సాధ్యం కాదు. కనుక ప్రేక్షకులే మారాలి. 

ఈ పరిస్థితుల్లో మంచి చిత్రాలను చూడడం, ఆదరించడం అలవాటు ప్రేక్షకుల్లో పెంచే ఫిలిం సొసైటీల ఆవశ్యకత ఈ రోజుల్లో కూడా ఎంతైనా ఉందనిపిస్తోంది. ఈ ఫిలిం సొసైటీల పుట్టు పూర్వోత్తరాలు, వాటి పరిణామం, మన దేశంలో వాటి గమనం, ప్రభావం గురించిన నా వ్యాస మాలిక   ' చిత్ర మాలిక ' ఇ - పత్రిక లో  ప్రారంభమైంది. మొదటి వ్యాసాన్ని ఈ క్రింద లింక్ లో చదవండి.

http://wp.me/p1cJWt-dD 





Vol. No. 02 Pub. No. 90

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం