" డింభకా "
" తప్పు తప్పు "
" లాహిరి లాహిరి "
" తసమదీయులు "
" గింబళి "
" హలా "
............. ఈ కొత్త కొత్త మాటలు ఎవరు పుట్టించారు ?
" ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి ? వెయ్యండి వీడికో వీరతాడు " అంటాడు మాయాబజార్ ఘటోత్కచుడు గురువు చిన్నమయ్యతో.
............ అలా ఎన్నో కొత్త మాటలు పుట్టించిన వారు, ఉన్న మాటలకు కొత్త ప్రయోగాలు నేర్పిన వారు పింగళి నాగేంద్రరావు గారు.
ఆయన రచనల్లో నాటకీయత వెనుక నాటక రచనానుభావం వుంది. బెంగాలీ నుంచి అనువదించిన ' మేవాడ్ రాజ్య పతనం ' , ' పాషాణి ' నాటకాలతో బాటు ఆయన స్వంత రచనలు ' జేబున్నీసా ', ' వింధ్యరాణి ', ' నా రాజు ' వగైరా నాటకాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఇందులో ' వింధ్యరాణి ' ఆయన చలనచిత్ర రంగానికి రావడానికి కారణమైంది. ప్రముఖ రంగస్థల నటులు డి. వి. సుబ్బారావు గారి ఇండియన్ డ్రమటిక్ కంపెనీలో పనిచేసిన అనుభవం పింగళి గారిది. అందుకే ఆయన రచన చేసిన చిత్రాల్లో కథలో డ్రామా వుంటుంది గానీ సన్నివేశాల్లో ప్రత్యక్షంగా వుండదు. అవి సహజంగా కనిపిస్తూనే డ్రామా అంతర్లీనంగా వుంటుంది.
ఇక పాటల గురించి విశ్లేషించ పూనుకోవడం సాహసమే అవుతుంది. ఎందుకంటే ఆంధ్ర దేశంలో పింగళి వారి సాహిత్యాన్ని తెలియని వారు, ఆస్వాదించని వారు దాదాపుగా లేరు. అందుకని కొత్తగా చెప్పవలసింది ఏమీ వుండదు. వారి మాటల కూర్పు, పదాల సౌందర్యం, సాహితీ సౌరభం మరోసారి విని, తల్చుకుని ఆనందించడం తప్ప ప్రత్యేకంగా విశ్లేషించడం అనవసరం. కనుక ఒకసారి విహంగ వీక్షణం చేసి వీనుల విందు చేసుకుందాం.
మాటల బ్రహ్మ పింగళి నాగేంద్రరావు గారి జన్మదినం సందర్భంగా స్మృత్యంజలి
Vol. No. 02 Pub. No. 102
No comments:
Post a Comment