Friday, October 7, 2011

అధికారికి ప్రేమలేఖ

  డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు బందరు జాతీయ కళాశాల పాలకమండలి కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఓ రోజు ఆయనకో లేఖ అందింది. అందులో ...........

" ప్రాణేశ్వరీ ! అనుకోకుండా ఊరికి వెడుతున్నాను. కనుక ఈ మూడురోజులూ మనకి వియోగం, విరహవేదన తప్పవు...... " అంటూ ఇంకా ఏదేదో రాసి వుంది. అది ప్రేమ లేఖ అని పట్టాభి గారికి అర్థమయింది గానీ ఎవరు రాసారో, తనకెందుకు వచ్చిందో మాత్రం అర్థం కాలేదు.  సాధారణంగా ప్రేమలేఖల్లో వుండేటట్లే సంభోదనలో గానీ, సంతకంలో గానీ కొసరు పేర్లే గానీ అసలు పేర్లు లేవు. అందుకనే ఆయనకేమీ అర్థం కాలేదు.

ఎటూ పాలుపోక తన మిత్రుడు కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు గారికి ఆ ఉత్తరం చూపించారు పట్టాభిగారు. అది చదివిన కృష్ణారావు ఆ చేతివ్రాత నిశితంగా పరిశీలించి ఆ రాత ప్రముఖ సాహితీకారుడు, చిత్రకారుడు అయిన అడవి బాపిరాజు గారిదని గుర్తుపట్టారు. కానీ బాపిరాజు గారు రాసిన ప్రేమలేఖ పట్టాభి గారికెలా వచ్చిందో అర్థం కాలేదు. ఆ విషయమే ఆయన్ని అడిగారు కృష్ణారావు గారు. అప్పుడు ఆలోచిస్తే ఇద్దరికీ విషయం బోధపడింది. ఏమిటంటే............


అప్పట్లో అడవి బాపిరాజు గారు జాతీయ కళాశాలకు ప్రధానాచార్యులుగా వుండేవారు. ఆయన ఆ సమయంలో స్వంత పని మీద ఊరికి వెళ్ళారు. బహుశః ఆ విషయం తెలియజేయ్యడానికి సమయం లేక ఆయన భార్యకు ఈ లేఖ రాసి ఉంటారని... పట్టాభి గారికి సెలవు మంజూరు కోరుతూ సెలవు చీటీ రాసి ఉంటారని... అయితే కవరు మీద చిరునామాలు తారుమారు అయి ఉంటాయని నిర్థారణకు వచ్చి నవ్వుకున్నారు పట్టాభి గారు, కృష్ణారావు గారు.


Vol. No. 03 Pub. No. 053

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం