Tuesday, October 4, 2011

పౌరాణిక చిత్రబ్రహ్మ

1936 లో ఒకే ఇతివృత్తంతో రెండు చిత్రాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. తెలుగు టాకీల పితామహుడు హెచ్. యం. రెడ్డి గారి అల్లుడు హెచ్. వి. బాబు దర్శకత్వంలో ' ద్రౌపదీ వస్త్రాపహరణం ' ఒకటి, ఎస్. జగన్నాథ్ దర్శకత్వంలో ' ద్రౌపదీ మానసంరక్షణ ' మరొకటి. బాబు కంటే జగన్నాథ్ సినిమా కళలో అప్పటికే నిష్ణాతుడు. కానీ ' ద్రౌపదీ వస్త్రాపరహణం ' బాక్సాఫీసు దగ్గర ఘన విజయం సాధించగా ' ద్రౌపదీ మానసంరక్షణ ' పరాజయం పాలైంది. అయితే జగన్నాథ్ చిత్రంలోనే దర్శకత్వ విలువలు పుష్కలంగా వున్నాయని అప్పటి ప్రముఖ పత్రిక ' కృష్ణాపత్రిక ' తన సమీక్షలో ప్రశసించింది. బాబు దర్శకత్వంలోని లోపాలు ఎత్తిచూపుతూ రాసిన ఆ సమీక్ష హెచ్. యం. రెడ్డి గారిని ఆకర్షించింది. వెంటనే ఆ సమీక్షకుడిని మద్రాస్ కు పిలిపించారు.

ఆ సమీక్షకుడు ఎవరో కాదు. తర్వాత కాలంలో భారత సినిమారంగానికి పౌరాణిక చిత్ర పథ నిర్దేశకుడిగా పేరు తెచ్చుకున్న కమలాకర కామేశ్వరరావు గారు. 

ఆయన నిష్పక్షపాతంగా ఆ సమీక్ష రాస్తే... ఆ సమీక్షలోని విమర్శలను సహృదయంతో స్వీకరించి హెచ్. యం. రెడ్డి తెలుగు చిత్రరంగానికి ఓ మాణిక్యాన్ని అందించారు.  తాను నిర్మిస్తున్న ' గృహలక్ష్మి ' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచెయ్యడానికి కామేశ్వరరావు గారిని ఆహ్వానించారు. అలా పత్రికా రంగం నుంచి చిత్రసీమలో అడుగు పెట్టిన కమలాకర కామేశ్వరావు గారు వాహినీ సంస్థలో చేరి బి. ఎన్. రెడ్డి, కే. వి. రెడ్డి ల శిష్యరికంలో తన ప్రతిభకు మెరుగు పెట్టుకున్నారు. అయితే ఆయన తొలి చిత్రం ' చంద్రహారం ' పరాజయం పాలైంది. మలి చిత్రం ' పెంకి పెళ్ళాం '  కూడా అంతంత మాత్రంగానే నడిచింది. సాధారణంగా ఏ దర్శకుడికైనా భవిష్యత్తు ప్రశ్నార్థకమే ! కానీ కామేశ్వరరావు గారికి అలా కాలేదు. తర్వాత కాలంలో ఆయన దర్శకత్వం వహించిన ' పాండురంగ మహాత్మ్యం ' అఖండ విజయం ఆయన్ని పౌరాణిక బ్రహ్మను చేసింది. 

పురాణాల మీద ఆయకున్న పరిజ్ఞానం, సినీ కళలో ఆయన సాధించిన పరిజ్ఞానం కలసి ఆయన్ని సినీ వ్యాసుణ్ణి చేసాయి. ఆ పురాణ కథల్ని కామేశ్వరరావు గారు సెల్యులాయిడ్ మీద లిఖించిన తీరు న భూతో న భవిష్యతి. దర్శకుడికి విషయ పరిజ్ఞానం, సాంకేతికాంశాలలో అనుభవం.... రెండూ ఎంత అవసరమో కామేశ్వరరావు గారి సినిమాలు చూస్తే తెలుస్తుంది. అందుకే ఆయన పౌరాణిక చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో ఎలా శాశ్వత స్థానం సంపాదించాయో, సాంఘిక ఇతివృత్తంతో ఆయన దర్శకత్వంలో వచ్చిన ' గుండమ్మ కథ ' అంతకంటే ఎక్కువ స్థానం సంపాదించింది. ఆయన వందల సంఖ్యలో చిత్రాలకు దర్శకత్వం వహించి రికార్డులు సృష్టించలేదు. ఆయన చిత్రాలు యాభైకి మించలేదు. అయినా ఆయన పేరు తెలుగు చిత్రసీమ చరిత్రలో ప్రథమ స్థానంలో కనిపిస్తుంది. 

' శ్రీకృష్ణావతారం' , ' శ్రీకృష్ణతులాభారం ', ' పాండవనవాసం ', ' వీరాంజనేయ ', ' బాలభారతం ', ' కురుక్షేత్రం ' లాంటి పౌరాణిక చిత్రాలతో బాటు అచ్చమైన తెలుగు చారిత్రాత్మకం ' మహామంత్రి తిమ్మరుసు '  అద్భుతమైన కళాఖండంగా తెలుగు చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే ఆయన సినీ వ్యాసుడు. కర్మయోగి. మన పురాణాలకి సినిమాల్లో శాశ్వత ముద్ర వేసి తెలుగు భాషకు, జాతికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన కమలాకర కామేశ్వరరావు సినీ జీవితం ఎంత వున్నతమైనదో వ్యక్తిగత జీవితం అంతకంటే ఉన్నతమైనది. సినిమా వాళ్ళందరూ అనేక ప్రలోభాలకు లోనవుతారనే భావం అందరిలోనూ వుంది. అది పూర్తిగా నిజం కాదనడానికి నిలువెత్తు నిదర్శనం ఆయన వ్యక్తిత్వం. దేనికోసం ఆశపడలేదు. ఆయన జీవితకాలంలో ఎలాంటి ప్రలోభాలకు, ఆవేశకావేశాలకు లోనయిన దాఖలాలు లేవు. అభిమానం, దురభిమానం అనే మాటలకు ఆయన జీవితంలో చోటు లేదు. తాను నమ్మిన బాటలో ఎన్ని అడ్డంకులు, వివాదాలు ఎదురయినా చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. 

పౌరాణిక చిత్రబ్రహ్మ కమలాకర కామేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఆయన్ని సంస్మరించుకుంటూ....

డ్రీం గర్ల్ హేమమాలిని నర్తించిన " శ్రీకృష్ణ విజయం " చిత్రంలో జోహారు శిఖిపింఛ మౌళీ ......



Vol. No. 03 Pub. No. 050

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం