శిఖిపింఛమౌళి శ్రీకృష్ణుడు నుంచి శకుని దాకా
ఎదిగిన వైనమే చిలకలపూడి సీతారామంజనేయుల నటజీవిత ప్రస్తానం. ఆయనే మనందరికీ
తెలిసిన సీయస్సార్.
అపర శకుని
సి.యస్.ఆర్.హస్తసాముద్రికం
తండ్రి ప్రోత్సాహంతో ఎదిగిన
సీతారామాంజనేయులు తన పదిహేడవ యేట ' రాధాకృష్ణ ' నాటకంలో శ్రీకృష్ణ పాత్రతో
నటజీవితానికి శ్రీకారం చుట్టాడు. నిండిన విగ్రహం, స్పురద్రూపం, ధారాళంగా
సంభాషణలు చెప్పగల, అంతకు మించి కమ్మగా పాడగల కంఠం ఆయన స్వంతం కావడంతో
రంగస్థలం మీద దూసుకెళ్లాడు. మహానటుడు స్థానం నరసింహారావు గారి దృష్టిలో
పడ్డాడు. ఫలితంగా ఆయన చేలికాడుగా ఎన్నో నాటకాల్లో నటించే అవకాశం వచ్చింది.
స్థానం వారు సత్యభామ అయితే... రఘురామయ్య రుక్మిణి అయితే రామాంజనేయులు
శ్రీకృష్ణుడు. తెలుగు నాటక స్వర్ణ యుగాన్ని స్వంతం చేసుకున్న వారిలో ఈయన
కూడా ఒకరు.
1933 లో రామదాసు చలన
చిత్రంలో శ్రీరాముడి పాత్ర పోషించే అవకాశం వచ్చినా అది వెలుగు చూడలేదు.
తర్వాత హెచ్. యమ్. రెడ్డి గారు శ్రీకృష్ణ రాయబారం చిత్రంలో శ్రీకృష్ణ
పాత్రకు అడిగితే పద్యానికి అయిదు వందల పారితోషికం అడిగారట సీయస్సార్. దాంతో
ఆ అవకాశం కూడా జారిపోయింది.
1936
లో సరస్వతీ టాకీసు వారు తీసిన ' ద్రౌపదీ వస్త్రాపహరణం ' లో శ్రీకృష్ణ
పాత్రతో వెండితెరపై అడుగుపెట్టారు సీయస్సార్. బళ్ళారి రాఘవ, బందా ల వంటి
ఉద్దండుల పోటీని ' ద్రౌపదీ మానసంరక్షణ ' చిత్రం ద్వారా ఎదుర్కొని విజయఢంకా
మ్రోగించడంతో చిత్రసీమలో కూడా స్థిరపడ్డారు సీయస్సార్.
మరాఠీ భక్తుడైన తుకారం ని తెలుగు వారికి పరిచయం చేసింది సీయస్సార్.
తుకారం నాటకం రాయించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అదే నాటకం ఆధారంగా 1938
లో తుకారం చిత్రాన్ని నిర్మించారు. తానూ రంగస్థలంపై నటించిన నాటకాలలో
మరికొన్నింటిని చలనచిత్రాలుగా మలిచారు సీయస్సార్.
ఆయన చలనచిత్ర జీవితంలో చెప్పుకోదగ్గ విశేషం 1935
లో నిర్మించిన ' శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం ' చిత్రం. అందులో శ్రీ
వేంకటేశ్వరుడిగా ఆయన నటన అందర్నీ ఆకట్టుకుంది. దురదృష్టవశాత్తూ ఆ చిత్రం
నెగటివ్ తరవాత కాలంలో కాలిపోయింది.
సీయస్సార్ నటించిన భీష్మ, చూడామణి, వాల్మీకి మొదలైన చిత్రాలు ఆయనకు
పేరు తెచ్చాయి. సారధి వారి ' గృహప్రవేశం ' చిత్రం ఆయనలోని సునిశితమైన
హాస్యాన్ని వెలుగులోకి తెచ్చింది. అందులో ఆయన పాడిన పాటలు, పద్యాలు తెలుగు
చిత్ర ప్రేక్షకులను రంజింపజేసాయి. భక్త శిరియాళ, వాలిసుగ్రీవ, మాయరంభ వంటి
చిత్రాలు కూడా ఆయనలోని గాయకుడి ప్రతిభను ప్రదర్శించాయి.
పరమానందయ్య
శిష్యుల కథ, నిత్యకళ్యాణం పచ్చతోరణం, కన్యాదానం, కన్యాశుల్కం, తల్లిప్రేమ,
సురభి, మాయాలోకం, అంతమనవాళ్ళే, రోజులు మారాయి, రత్నమాల, లైలామజ్ఞు,
చక్రపాణి, దేవదాసు, పాతాళభైరవి, అప్పుచేసి పప్పుకూడు వంటి చిత్రాల్లో తన
నటనా వైదుష్యాన్ని ప్రదర్శించారు సీయస్సార్.
భక్త
కుచేల చిత్రంలో కుచేలుడి పాత్ర ఆయన నటనకు పరాకాష్ట. ఏ ఇతర భాష చిత్రాల్లో
నటించకపోయినా ఈ చిత్రాన్ని మలయాళంలో పునర్నిర్మించినపుడు ఆయనే కుచేలుడి
పాత్ర పోషించి ఉత్తమ నటుడి బహుమతినందుకున్నారు. ఆ చిత్రం తెలుగులోకి డబ్
చెయ్యబడింది. కాకపోతే సీయస్సార్ గారు అప్పటికే మరణించడంతో ఆయనకు మద్దాలి
కృష్ణమూర్తి గారు స్వరం ఇచ్చారు.
ఇన్ని
చెప్పి ఆయన ' మాయాబజార్ ' శకుని గురించి ప్రస్తావించకపోవడం సమంజసం కాదు.
శకునిలో ఉండే విభిన్న కోణాల్ని ఆయన వెండితెరపై ఆవిష్కరించిన తీరు అమోఘం.
అడుగడుగునా కుటిలత నిండి వున్నా, పగ ప్రతీకారాలు నిండి వున్నా, పైకి మాత్రం
ఆప్యాయత, బంధుజన పక్షపాతం నటించే శకుని పాత్రను అవలీలగా పోషించడమే కాదు...
వెండితెర శకునిగా శాశ్వత కీర్తిని ఆర్జించారు. ఈ పాత్రలో సీయస్సార్ నటన
గురించి ఎంత చెప్పినా తక్కువే !
అలా శిఖిపింఛమౌళి శ్రీకృష్ణుని పాత్రతో ప్రారంభించి శకునిగా తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వత స్థానం కల్పించుకున్న సీయస్సార్ 1963 లో ఆయన నటరాజులో ఐక్యమైపోయారు.
సీయస్సార్ వర్థంతి సందర్భంగా ఆయనకు కళా నీరాజనాలు సమర్పిస్తూ.............
సీయస్సార్ గారి గురించి గతంలో రాసిన టపాలు...........
అపర శకుని
సి.యస్.ఆర్.హస్తసాముద్రికం
Vol. No. 03 Pub. No. 054
5 comments:
ఈ పోస్ట్ ని సీయెస్సార్ గారి తమ్ముడి కుమారుడికి పంపించాను. ఆయన చెన్నైలో ఉంటారు.
మాధురి.
సియెస్సార్ తమ్ముడి కొడుకును నేను. నా పేరు చిలకలపూడి సత్యనారాయణ. చెన్నైలో ఉంటాను. "మీకోసం" అనే బ్లాగు రాస్తున్నాను. మా పెద్దనాన్న గారిని నా చిన్నప్పుడు చూసేను. ఆయన నటించిన సినిమాలు మాత్రం చాలా చూసేను. ఆయన గురించి మీరు రాసినది చదివిన తరువాత నాకు ఆయన గురించి తెలిసింది చాలా తక్కువని గ్రహించేను. ఆయన గురించి అన్ని విషయాలు తెలిపినందుకూ, ఆయన మీద మీరు చూపిన గౌరవం నాలో కన్నీరు తెప్పించేయి. మీకూ మరియూ వినయ్ దత్తు కు నా హ్రుదయ పూర్వక ధన్యవాదాలు.
మీకోసం,
http://meeandarikoasam.blogspot.com
* మాధురి గారూ !
మీకు చాలా చాలా కృతజ్ఞతలు
* సత్యనారాయణ గారూ !
మిమ్మల్ని ఇలా కలవడం చాలా ఆనందంగా వుంది. నిజానికి ఆయన గురించి నాకు తెలిసినది కూడా తక్కువే ! నాకు ఊహ తెలిసే సరికి ఆయన మాయబజార్ తప్ప మరేమీ తెలియదు. కానీ శకుని పాత్ర ఆ చిన్నతనంలోనే నా మనసులో ముద్ర వేసుకుంది. ఆ తర్వాత ఆయన సినిమాలు చాలా చూశాను. ఆయన గురించి పత్రికలలో వచ్చిన విషయాలను సేకరించి పెట్టుకున్నాను. అందులోనుంచి కొన్నిటిని ఇందులో రాశాను. ఆ మహానటుడికి ఇంతకంటే బాగా నివాళి నేను ఏమివ్వగలను ?
మీ బ్లాగ్ అప్పుడప్పుడు చూస్తూ వుంటాను.
మీకు నా ధన్యవాదాలు.
great
అజ్ఞాత గారూ !
ధన్యవాదాలు
Post a Comment