దేశానికి తిండి పెట్టేది ఒకరు
దేశాన్ని కాపాడేది మరొకరు
ఆరుగాలం శ్రమించి జాతి ప్రాణాలు నిలిపే ఆహారాన్ని అందించేది ఒకరు
అన్ని కాలాల్లో ఎన్నో కష్టాలకోర్చి ప్రజల ప్రాణాలు కాపాడేది మరొకరు
స్వార్థ ప్రయోజనాలకోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాయకులకు వారి త్యాగం కనబడదు
వారి కష్టాన్నిఅర్థం చేసుకుని జై జవాన్ అన్నా
వీరి త్యాగాన్ని గమనించి జై కిసాన్ అన్నా
......... అది లాల్ బహదూర్ శాస్త్రి కే చెల్లు
పేదరికంలో పుట్టి, పేదరికాన్ని అనుభవించిన వ్యక్తి ఆయన
పడవ ప్రయాణం చేసే స్థోమత లేక చదువు కోసం గంగను ఈదిన పట్టుదల ఆయనది
ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యతగా మంత్రి పదవికి రాజీనామా చేసిన నిబద్ధత ఆయనది
రాజీనామా అనే మాటనే అపహాస్యం పాలు చేసిన ఈనాటి నాయకులకు అర్థం కాని త్యాగం ఆయనది
ఎందుకు ఎన్నుకుంటున్నామో తెలియక నాయకులను ఎన్నుకునే ప్రజలకీ అర్థం కాని వ్యక్తిత్వం ఆయనది
రాజకీయాలంటే తన ఇల్లు చక్కబెట్టుకునేవి కావని నిరూపించిన నాయకుడు ఆయన
పదవి అంటే ప్రజలకు సేవ చెయ్యడానికి లభించిన సదవకాశంగా భావించిన ప్రధాని ఆయన
నాయకుడికి కావాల్సింది డబ్బు, వారసత్వం, ఆకర్షణ కాదని......
ప్రజాసేవ చెయ్యాలనే నిబద్ధత, నిజాయితీ అని నిరూపించిన నాయకుడాయన
మనం తయారుచేసే బొమ్మకి అందమైన ఆకారం రావాలంటే అందమైన నమూనా ఎంచుకోవాలి
మనకి సేవ చేసే నాయకులు కావాలంటే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వారిని నమూనాగా తీసుకోవాలి
లాల్ బహదూర్ లాంటి నాయకులు దొరకరు.... మనమే ఎంచుకోవాలి లేదా తయారు చేసుకోవాలి
మరో మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ.......
లాల్ బహదూర్ పై గతంలో రాసిన టపా... అరుదైన వీడియోలతో........
2 comments:
బాగా చెప్పారండి.
ధన్యవాదాలు
Post a Comment