హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసు గారికి, విజయనగరం రాజా ఆనంద గజపతి మహారాజు గారికి స్నేహం మెండు.
ఓసారి ఇద్దరూ ఢంకా పలాస్ ఆడుతున్నారు. నారాయణదాసు గారికి మూడు రాజులు పడ్డాయి. ఆయనకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. రెచ్చిపోయి పందెం కాస్తున్నారు. అయితే రాజుగారికి మూడు ఆసులు పడ్డాయి. కానీ ఆ విషయం ఆయన బయిట పెట్టలేదు. దాసు గారి ఉత్సాహాన్ని అడ్డుకోవడం ఇష్టం లేక ఆయనా పందెం కాస్తున్నారు. రసవత్తరంగా పందెం సాగుతోంది. కొంతసేపటికి ఆదిభట్ల వారి దగ్గర డబ్బులు నిండుకున్నాయి. ఆ విషయం గ్రహించి రాజు గారు ఉదారంగా దాసు గారినే ముందుగా ముక్కలు తిప్పమన్నారు. ఆయన తన దగ్గరున్న మూడు రాజుల్ని తిప్పారు గర్వంగా ! రాజు గారు చిరునవ్వుతో తన దగ్గరున్న మూడు ఆసుల్ని చూపించారు. ఆదిభట్ల వారు తెల్లబోయారు.
పందెం డబ్బు రాజుగారు స్వంతం చేసుకుంటుండగా దాసుగారు అమాయకంగా మొహం పెట్టి
" అయితే రాజా వారూ ! రాజులకంటే ఆసులే గొప్పవన్నమాట !! "
అన్నారు. దాసుగారి మాటల్లో చతురతని గ్రహించిన రాజు గారు ఫకాలున నవ్వుతూ పందెం డబ్బంతా దాసు గారికి ఇవ్వడమే కాకుండా మంచి బహుమతితో సత్కరించారట.
Vol. No. 03 Pub. No. 056
No comments:
Post a Comment