Monday, April 16, 2012

ఇద్దరు మహనీయులు

 మనిషి ఎప్పుడూ నిలకడగా ఉండడేమో ! ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉంటేనే గానీ తోచదనుకుంటాను. ఈ కాలంలో అవినీతి, స్వార్థపరత్వం, పరపీడనం లాంటి దురాచారాలు పాటిస్తుంటే, గత కాలంలో మన సమాజం ఆదిశక్తిగా కొలుచుకునే స్త్రీలను అణిచి వెయ్యడానికి అనేక దురాచారాలు పాటించేవారు. అయితే ప్రతీ దురాచారాన్ని ఖండించడానికి, వ్యతిరేకించడానికి, దానికి బలవుతున్న అభాగ్యుల్ని రక్షించడానికి ఎవరో ఒక సంస్కర్త పుడుతూనే వుంటారు.

అలా సుమారు నూట అరవై నాలుగు సంవత్సరాల క్రితమే ( 1848  లో ) జన్మించి ఎన్నో సంఘ సంస్కరణ కార్యక్రమములు చేపట్టి, మరెన్నో దురాచారాలను రూపు మాపడానికి కంకణం కట్టుకుని.... నవయుగ వైతాళికుడు అనిపించుకున్న మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. 

పత్రికలున్నవి ప్రజల బలహీనతలతో ఆడుకోవడానికి, ఆర్థిక ప్రయోజనాన్నో, రాజకీయ ప్రయోజనాన్నో ఆశించి ఎవరో ఒక వ్యక్తికో, ఏదో ఒక వర్గానికో, పార్టీకో కొమ్ము కాయడానికో కాదని,,,, అసలు మీడియా సమాజానికి అవసరం ఏమిటో, బాధ్యత ఏమిటో తెలుసుకోవాలంటే వీరేశలింగం గారి ' వివేక వర్ధని '  పత్రిక గురించి తెలుసుకోవాలి. సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలని, మూఢాచారాలని ఖండించడానికి, ప్రజల్ని చైతన్యవంతుల్ని చెయ్యడానికి ఆయన పత్రికను ఆలంబనగా చేసుకున్నారు. పత్రికా విలువలేమిటో తెలుసుకోవాలంటే వీరేశలింగం గారి ' వివేక వర్ధని ' గురించి తెలుసుకోవాలి.

 ఆ నవయుగ వైతాళికుని జన్మదినం సందర్భంగా నివాళులు అర్పిస్తూ......... 

వీరేశలింగం గారి మీద గతంలోని టపాలు........ 

తెలుగు తేజం కందుకూరి

*****************************************************************************

ఒక్కొక్క వ్యక్తి జన్మించి ఆ యుగం తనదనిపించుకుంటాడు. ఆ యుగాన్ని శాసిస్తాడు. ప్రజల మీద, ప్రపంచం మీద తనదైన ముద్ర వేసుకుంటాడు.
కొంతమంది కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతారు. దానికి భాష కూడా కొంత కారణమవుతుంది. కానీ కొంతమంది విషయంలో ఇవేవీ అవసరం లేదు. వారికి భాషతో పని లేదు. ఆచార వ్యవహారాలతో పని లేదు. ప్రపంచమంతా వారిదే !  
హాస్యం, నటన అనగానే ప్రపంచంలో అందరూ ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తు పెట్టుకునే పేరు చార్లీ చాప్లిన్.
భాష అవసరం లేని మూకీల కాలం నుంచి భాష నేర్చుకున్న టాకీల కాలం దాకా వున్న చాప్లిన్ సినిమాలకు భాషతో సంబంధం లేదు. ఆయన హావ భావాలే ఆయన భాష.
ఆయన చిత్రాలు భాష కారణంగా ప్రపంచంలో ఎవరికైనా అర్థం కాకపోవడం ఉంటుందా ?
ఆయన చిత్రాల్లో వుండేది వినోదమా ! విషాదమా !
వినోదంలోనుంచి విషాదం.... విషాదంలో నుంచి వినోదం పుట్టించగల దిట్ట.
దృశ్య మాధ్యమమైన సినిమాకు మాటల ప్రాధాన్యం అవసరమా ?
ఆయన కళ్ళు మాట్లాడతాయి. ఆయన నడక మాట్లాడుతుంది. ఆయన నటన మాట్లాడుతుంది. కానీ ఆయన మాట్లాడడు.
కేవలం మూకీ సినిమాల్లోనే కాదు. సాంకేతికాభివృద్ధి జరిగి టాకీ లొచ్చినా ఆయన సినిమాలు చాలాకాలం మాట్లాడలేదు. తర్వాత మాట్లాడినా అవసరమైన చోట్ల, అవసరమైనంత వరకే !
సాంకేతికాభివృద్ధి వెర్రి తలలు వేస్తున్న ఈరోజుల్లో ఇది చాదస్తంగా అనిపించవచ్చు కానీ, ఎవరైనా చాప్లిన్ శైలిని అర్థం చేసుకుని కొద్దిగానైనా అనుసరించడానికి ప్రయత్నిస్తే ఆ మాధ్యమానికి, ప్రజలకి న్యాయం జరుగుతుంది.

  ఆ విశ్వనటచక్రవర్తి జన్మదినం సందర్భంగా నివాళులు అర్పిస్తూ...........    

చార్లీ చాప్లిన్ పైన గతంలోని టపాలు...........  

విషాదంలోనూ వినోదమే !
నవ్వుల విషాదం
నవ్వుల గని 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 133

2 comments:

ఆ.సౌమ్య said...

Salute to great souls!

SRRao said...

సౌమ్య గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం