Monday, January 24, 2011

అలనాటి అభిరాముడు

తొలుత భోగి
పిదప విరాగి
ఆపైన యోగి
...... ఇలా పరివర్తన చెంది లోకానికి అమూల్యమైన సూక్తులు చెప్పి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు వేమన యోగి.
ఆ మహనీయునికి........................................

తొలుత స్నేహితునిగా
పిదప అనుచరునిగా
ఆపైన శిష్యునిగా 

జీవిత చరమాంకం వరకూ తోడుగా, నీడగా అనుసరించిన వాడు అభిరాముడు. వేమన జీవితంలోనే భాగమైపోయాడు. అందుకే వేమన ' విశ్వదాభిరామ వినుర వేమా ! ' అన్నాడు. తెలుగు వారి హృదయాల్లో వేమన ఉన్నంత కాలం అభిరాముడు ఉంటాడు.

వేమనను చూడని, చూడలేని వారికి ఆయన నాగయ్య గారి రూపంలో సాక్షాత్కారిస్తే లింగమూర్తి రూపంలో అభిరాముడు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడు.

వేమన యోగి, అభిరాముల అనుబంధాన్ని చరిత్ర ద్వారా, కథల ద్వారా, యోగి వేమన చిత్రం ద్వారా మనం విన్నాం.... చూసాం. కానీ అదే అనుబంధానికి ఒకప్పటి సజీవ ఉదాహరణ నాగయ్య - లింగమూర్తి ల స్నేహానుబంధం.

1937 లో ' తుకారాం ' చిత్రం ద్వారా రంగస్థలం నుండి చలన చిత్ర రంగానికి వచ్చిన ఆణిముత్యం ముదిగొండ లింగమూర్తి.  వాహినీ వారి ‘ వందేమాతరం ‘ , ‘ సుమంగళి ‘, ‘ దేవత ‘ , ' స్వర్గసీమ ', ‘ యోగి వేమన ‘, ‘ పెద్దమనుష్యులు ‘లాంటి చిత్రాలన్నిటిలో ఆయన నటించారు. ఇవేకాక నాగయ్య గారితో కలసి ' త్యాగయ్య ', ' పోతన ' లాంటి చిత్రాలలో నటించి వారితో అనుబంధాన్ని చిత్రాలలోనే కాదు.... నిజజీవితంలో కూడా పెంచుకున్నారు.

వారి అనుబంధం విడదీయలేనిది. ' బావా ! ' అన్న పిలుపు వారి మధ్య ఆత్మీయతకు, ఆప్యాయతకు చిహ్నం. లింగమూర్తి గారు నిర్మొహమాటి. ముక్కుకు సూటిగా మాట్లాడడం ఆయన నైజం. కొన్ని సందర్భాలలో ఆ స్వభావం కొంతమంది మిత్రులతో, సన్నిహితులు, ఇతరులతో ఇబ్బందులు కల్పించిందని చెబుతారు. కానీ వీరిద్దరి మధ్య మాత్రం ఎప్పుడూ విబేధాలు వచ్చిన దాఖలాలు లేవు. నిష్కల్మషమైన స్నేహానికి ప్రతిరూపం నాగయ్య, లింగమూర్తి గార్లు.

**************************************************************

 వేమన అద్భుతమైన జీవిత సత్యాలతో కూడిన సాహితీ సంపదను లోకానికి అందించి తన జన్మను సార్థకం చేసుకుని భౌతిక కాయం చాలించి అనంత లోకాలకు పయనమయ్యే సమయం ఆసన్నమైంది. ఆయన అనుచరులు, శిష్యులు శోకతప్త హృదయాలతో అంతిమ వీడ్కోలు చెబుతున్నారు. వేమన యోగికి బాల్య స్నేహితుడు, తదనంతరకాలంలో ప్రధాన శిష్యుడిగా సేవలందించిన అభిరాముని పరిస్థితి వర్ణించనలవి కాదు. 


' వేదాతీతుడు వేమననుండీ.... అంతా చేరుట అచటేనండీ...... ' అని పాడుతూ అభిరాముడు వేమన యోగికి వీడ్కోలు పలికే సన్నివేశంలో మనకు అభిరాముడే కనిపిస్తాడు. లింగమూర్తి కనిపించడు. 

*************************************************************

ఈ సన్నివేశ చిత్రీకరణ ముగిసాక ఇద్దరూ వేషం తీసేస్తూ వుండగా లింగమూర్తి గారితో నాగయ్య గారు " బావా ! ఈ సన్నివేశంలో లాగే మనిద్దరిలో ఒకరు ఈ జీవితకాలపు కాల్ షీట్ పూర్తి చేసుకుని భౌతికకాయం వదిలే ముందు అతని చెవిలో రెండవ వారు నారాయణ మంత్రం జపిస్తూ వీడ్కోలు ఇవ్వాలి. అలాగని నాకు మాటివ్వు. " అని ఆయన చేత తన చేతిలో చెయ్యి వేయించుకున్నారు. చివరికి ఆ భాగ్యం లింగమూర్తి గారికి దక్కింది. నాగయ్య గారి అంతిమ ఘడియల్లో లింగమూర్తి గారు తన స్నేహితునికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అదీ వారి స్నేహానుబంధం. విలువలు పాటించే వారెప్పుడూ లోకంలో శాశ్వత స్థానం సంపాదించుకుంటారు. తెలుగు చలన చిత్ర రంగంలో ఎంతకాలమైనా, ఎంతమంది వచ్చి వెళ్ళినా నాగయ్య గారి స్థానాన్ని భర్తీ చేసిన వారు లేరు.... ఉండరు. అలాగే ఆయనకు అత్యంత సన్నిహితునిగా, నవరసాలు పోషించిన నటునిగా లింగమూర్తి గారి స్థానాన్ని కూడా ఎవరూ భర్తీ చెయ్యలేరు. ముఖ్యంగా వారిద్దరూ పాటించిన విలువలు ఇంకెవరూ పాటించలేరేమో !

లింగమూర్తి గారు షష్టి పూర్తి జరిగాక నటనా జీవితం నుండి విశ్రాంతి తీసుకున్నారు. చివరి రోజుల్లో తక్కువ పారితోషికంతో వచ్చిన ఆఫర్లను అంగీకరించలేదు. తనకు వేషాలు తగ్గాయేమో గానీ, తన ప్రతిభ మాత్రం తగ్గలేదు కనుక తన విలువను తానే తగ్గించుకోవాల్సిన అవసరం లేదనేవారు. అంతటి ఆత్మాభిమానం ఆయనది.

 ఈరోజు ( జనవరి 24 ) ముదిగొండ లింగమూర్తి గారి వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.............. 

లింగమూర్తి గారికి కళా నీరాజనాలు అర్పించే నా వ్యాసం ..................................
లో ఈ లింకు లో చదవండి.


నాగయ్య - లింగమూర్తి గారల జంట యొక్క వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించే ' యోగి వేమన ' చిత్రంలోని అంతిమ ఘట్టం మీకోసం .............. 




Vol. No. 02 Pub. No. 128

3 comments:

KESHAV.KEERTHANA said...

We are very lucky to hear such things about the great personalities.

Thanks.

Regards

D.Keshav

SRRao said...

కేశవ్ గారూ !
ధన్యవాదాలు

Unknown said...

caala manci vishayaalu vinnaanu. inttati uttama samskaaramunna patrikaadhineta mitrulanu nenu cuudaka povadam naa duradrstham. aalasyam gaa nayinaa ii vishayaalu telusukunnanduku manassu nidugaa undi.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం