"ఊరు పోమ్మంటోంది కాడు రమ్మంటోంది ". జవసత్వాలుడిగి వయసుమళ్ళిన వయోవృద్దుల్ని ఉద్దేశించిన సామెత ఇది. కానీ ప్రకృతి విలయతాండవంలో చిక్కుకున్న వారందరికీ ప్రస్తుతం ఇది వర్తిస్తుందేమో ! కృష్ణానది వరద భాధితులకు చేస్తున్న సహాయాన్ని కూడా వ్యాపారంగా మార్చిన కొంతమంది స్వార్థపరుల విశ్వరూపం చూస్తుంటే నిజంగానే వయోబేధం లేకుండా వారందర్నీ ఊరు పోమ్మంటోందేమోననే అనుమానం వస్తోంది. వరద భీభత్సంలో చిక్కుకుని ప్రాణాలని రక్షించుకోవాలనే ఆత్రుతలో ఉన్న అభాగ్యుల్ని బ్లాకు మెయిల్ చేసి డబ్బు వసూలుకి దిగే వాళ్ళని ఏమనాలి ? సమస్తం పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలిన వాళ్ల దగ్గర బియ్యం వగైరా సరుకుల ధరల్ని భారీగా పెంచి వసూలుచేసేవారినేమనాలి ? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయాలు మాట్లాడే వాళ్ళనేమనాలి ? శవాల్ని పీక్కుతినే రాబందులకైనా ఒక నీతి ఉంటుందేమో ! తమకి ఆకలి వేసినప్పుడు మాత్రమే అది కూడా ఆచేతనమైపోయిన శవాల్ని మాత్రమే తింటాయి ? కానీ వీళ్ళు బ్రతికుండగానే పీక్కు తింటున్నారు, అది కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు !! సమాజంలో మానవత్వం చచ్సిపోయిందా ? దీనికి పరిష్కారం లేదా ? మళ్ళీ మానవత్వాన్ని పునరుద్ధిరించలేమా ? ఇది అర్థం లేని ఆలోచనేమో ? ఏమో ! తెలియదు.
మరో ప్రక్క ఆపన్నులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ముందుకొస్తున్న వాళ్ళను చూస్తుంటే మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని అనిపిస్తోంది. అయితే ఇక్కడో కొత్త పరిణామం చోటుచేసుకోవడం విశేషం. గతంలో ఇలాంటి ఉపద్రవాలు జరిగినపుడు విరాళాలన్నీ ప్రభుత్వ సహాయ నిధికే పంపేవారు. కానీ ఇప్పుడు ప్రైవేటు టీవీ చానల్స్ కి అందించడమే ఈ కొత్త పరిణామం. దీనికి కారణాలేమిటి ? ప్రభుత్వం మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద విశ్వాసం తగ్గిపోయిందా ? లేక పబ్లిసిటీ వస్తుందనా ? ఏదైనా కావచ్చు. కారణం ఏదైనా ప్రజల్లో మానవత్వాన్ని మేల్కొల్పడంలో మీడియా ప్రభావం బాగా కనిపిస్తోంది. విరాళాలకోసం పభుత్వ మిచ్చిన పిలుపుకంటే ఈ చానల్స్ పిలుపుకే ఎక్కువ స్పందన వచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే చానల్స్ మధ్య పోటీలో అక్కడక్కడా అత్యుత్సాహం కనబడినా మొత్తం మీద భాధ్యతాయుతంగానే ప్రవర్తించినట్లు కనిపిస్తుంది. దీన్నిబట్టి చూస్తే మనలో మానవత్వానికి వచ్చిన లోటేమీ లేదనీ వ్యవస్థలోని లోపాలే అప్పుడప్పుడు దాన్ని తాత్కాలికంగా అణిచివేస్తాయని అనిపిస్తోంది. అడుగడునా పేరుకుపోయిన అవినీతి కబంధ హస్తాల్లోంచి మానవత్వం బయిటపడేటట్లు చెయ్యగలిగితే బాగుంటుంది. పిల్లి మెడలో గంట ఎవరు కడతారు ? ఇంకెవరు ? మనమే !! ఈ పని చెయ్యడానికి పైనుంచి ఎవరూ దిగి రారు. మనమే ఆ పని చెయ్యాలి. బహుశా ఇది పేరాశ కావచ్చు. ఎందుకంటే ఎవరైనా మొదలు పెట్టాక మనం కలవచ్చులే అనేది సహజంగా మానవనైజం. దేనికైనా మొదలు కావాలి. ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. ఆ ఒకరు మనమే ఎందుకు కాకూడదు అని అందరూ ఆలోచించడం ప్రారంభించాలి అన్నిటికంటే ఇలాంటి అక్రమాలను, అవినీతిని ఎదిరించి ఎదుర్కొవాలనుకునే వారిని నిరాశపరచడం, ఎగతాళి చెయ్యడం లాంటివి చెయ్యకుండా ఉంటే చాలు. లేకపోతే వయసులో ఉన్నా అన్ని శక్తిసామర్త్యాలున్నా మనల్ని ఊరు పొమ్మంటుంది .
Monday, October 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
2 comments:
బాగా చెప్పారు....పదండి ముందుకు కలసికట్టిగా!!
కష్టాలు ఒచ్హినప్పుడే కదండి మనిషికి మనిషి తోడు. కష్టాలు మనిషికి కాక మానుకు ఒస్తాయా అన్నట్లు, ప్రకృతి విళయతాండవం నుంచి ఒకరికి ఒకరు చేదోడుగా ఉండి, మానవత్వపు విలువలను కాపాడుకోవాలి.
Post a Comment