మధ్యతరగతి మిధ్యా జీవుల నెత్తిన పిడుగు మీద పిడుగు పడుతోంది. ధరలు అదుపు లేకుండా పెరుగుతోనే ఉన్నాయి. మళ్ళీ పంచ'ధర' మరింత పెరుగుతుందని తాజా వార్త. విజయా డైరీ వారు విజయవంతంగా పాల ధర మళ్ళీ పెంచారు. కేంద్ర ప్రభుత్వం వారు ఎరువుల సబ్సిడీ తగ్గిస్తున్నట్లు ప్రకటించి రైతన్నల నడ్డి విరిచారు. తెల్లవారి ఇంకా ఎన్ని పెరుగుతాయోనని బడుగుజీవి బిక్కు బిక్కుమని చూస్తునే ఉన్నాడు.
ఆర్ధిక మాంద్యం మన దేశంలో మందగమనంతోనే ఉందని అధినేతలు చెబుతున్నారు. పైగా పురోగమనంలో ఉందంటున్నారు. ఆ పరిజ్ఞానం లేని సామాన్యుడు అయోమయంగా ఆకాశంకేసి చూస్తున్నాడు. అక్కడ అప్పుడప్పుడు మబ్బులే తప్ప ధరలు కనబడడం లేదు. కిందికి దిగుతున్నాయేమోననే అతని ఆశ అడియాశ చేస్తూ అవి చంద్రయాన్ తో పోటీపడి అంతరిక్షంలోనే కంట్రోల్ తప్పిపోయాయి. పోనీ ఆదాయాలేమైనా పెరుగుతాయేమోనని అనుకుంటే తాజావార్త ఈ నెలలో పెన్షనర్ల కీ, వచ్చే నెలనుంచి ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని ఆర్థికనిపుణులు సెలవిచ్చారు. అదేమీ లేదని రోశయ్యగారు మొహమాటంగా చెబుతున్నా పరిస్తితి మాత్రం అలాగే కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే ఇక చిన్నా చితకా పనులు, వ్యాపారాలు చేసుకునే వారి పరిస్థితి ఏమిటి ?
ఏది ఏమైనా కడుపు నిండిన రాజకీయాలు మాత్రం ఈ సమస్యలన్నీ తుంగలో త్రొక్కి ముఖ్యమంత్రి పీఠం గురించి రభస చేస్తూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు అధికార పక్షం లోని లుకలుకలు భారీగా పెరిగి మధ్యంతర ఎన్నికలొస్తే బాగుండునని కాచుక్కూర్చున్నాయి. అదే జరిగితే అంచున ఉన్న బడుగుజీవి బతుకు అడుగుజారి లోయలో పడుతుంది. సామాన్యుల ఆకలి తీర్చలేని ఆర్ధిక వ్యవస్థ పురోగమిస్తోందా ? తిరోగమిస్తోందా ?? ఏమో ! పాలకులే చెప్పాలి !! అన్నట్లు వారేం చెబుతారు ? ప్రస్తుతం వారంతా అధికారపీఠం గొడవలో బిజీ ! ఇప్పుడు మనమేమైనా అంటే ఎవరో ఒకరికి వ్యతిరేకులమని ముద్ర వేసేస్తారేమో !! లేనిపోనిది మన తలకు చుట్టుకుంటుంది. ఎందుకొచ్చిన గొడవ. ఎన్నికలోస్తే కళ్లు మూసుకుని ఎవరో ఒకరికి ఓటు గుద్దేద్దాం !! కనీసం వాళ్లైనా బాగుపడతారు. మనం ఎప్పటిలాగే ముడుచుకొని పడుకుందాం !! అప్పుడు ఒకటో తారీకుకి భయపడనక్కరలేదు. ఎందుకంటే నెమ్మదిగా పస్తులుండటం అలవాటైపోతుంది.
సరేగానీ.. ఈ సామాన్యుడికి ఒక ధర్మ సందేహం. ఘనత వహించిన కాంగ్రెస్ పెద్దల్ని రాజశేఖర రెడ్డి ఇంతకాలం ఎలా అదుపు చేసాడో ?? ఆ రహస్యం తెలిస్తే బాగుండును.
Thursday, October 1, 2009
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
No comments:
Post a Comment