Thursday, October 29, 2009

ప్రముఖుల హాస్యం

* షెర్లాక్ హోమ్స్ అంటే ఆంగ్ల సాహిత్యంతో సంబంధం లేని వారికి కూడా తెలిసి ఉంటుంది. అపరాధ పరిశోధనలో అజరామయమైన పాత్ర. ఆ పాత్ర సృష్టికర్త కానన్ డయాల్. ఎంత గొప్పవారైనా కొన్ని భయాలకు, బలహీనతలకు అతీతులు కారు. కానన్ దయాల్ కి తనకు ఆత్మలతో సంభాషించలిగే శక్తి ఉందనే భావన ఉండేది. అది నిజమో, భ్రమో తెలియదు.
ఒకసారి ఒకాయన ఆయన్ని కలిసి " మొన్న మీ మిత్రుడు చనిపోయాడుగా ! అతని ఆత్మతో మాట్లాడేరా ? " అని అడిగాడు. దానికి కానన్ " లేదు. ఎవరి ఆత్మతోనైనా మాట్లాడతాను గానీ వాడి ఆత్మతో మాత్రం మాట్లాడను " అన్నాడు. కారణమేంటన్నాడాయన. " ఆ ! ఏముందీ ! ఆ మధ్య మా ఇద్దరి మధ్య గొడవోచ్చింది. మాటలు లేవు. ఇంకెలా మాట్లాడతాను ? " అన్నాడు కానన్ డయాల్ .
* స్టాలిన్ సోవియట్ రష్యా నియంత. సాధారణంగా నియంతలకు అభద్రతా భావం అధికంగా ఉంటుంది. అందుకే వాళ్లు గూఢచారి వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఒకసారి ఆయన తన గూఢచారి వ్యవస్థ పనితీరు ఎలా ఉందో పరీక్షించాలనుకున్నాడు. ' స్టాలిన్ స్వార్ధపరుడు. అతను మన జాతిని నాశనం చెయ్యడానికి కంకణం కట్టుకున్నాడు. అతని ఆకృత్యాలను అడ్డుకోవాలి ' ఇలా విప్లవ ధోరణిలో ఒక కరపత్రం రహస్యంగా విడుదల చేయించాడు. స్వామి భక్తులైన గూఢచారులు ఆ కరపత్రాన్ని స్టాలిన్ దగ్గరకు పట్టుకొచ్చారు. అది చూసి ఆయన గూఢచార విభాగాదిపతిని " ఇందులో ఎవరి హస్తం ఉందో కనుక్కున్నారా ? " అని అడిగాడు. అందుకతను " మీ గురించి మీ కంటే బాగా తెలిసున్న వారెవరూ లేరుగా ? అలాంటప్పుడు వేరొకరి హస్తం ఎలా ఉంటుంది ? మీ హస్తం తప్ప ! " అన్నాడు.

*
ప్రముఖ ఆంగ్ల రచయిత మార్క్ ట్వేన్ ఒకసారి ఒక ఊళ్ళో హాస్య ప్రసంగ కార్యక్రమానికి వెళ్ళాడు. అక్కడి ప్రజలు తన ప్రసంగం పట్ల ఎంత ఆసక్తితో ఉన్నారో తెలుసుకోవాలనిపించింది. సామాన్యుడిలాగా ఒక షాప్ కి వెళ్ళాడు. షాపతనితో ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ " ఈ ఊరికి కొత్తగా వచ్చాను. సాయంత్రం కాలక్షేపానికి ఏదైనా కార్యక్రమం ఉందా ? " అని అడిగాడు. అందుకా షాపతను " ఆ ! ఉంది. మార్క్ ట్విన్ అని ఒకాయన ఉపన్యాసం ఉంది " అన్నాడు. అంతే ! మార్క్ కి సామాన్య ప్రజల్లో కూడా తనకు పలుకుబడి ఉన్నందుకు చాలా ఆనందం కలిగింది. " ఆయన ఉపన్యాసం అంత బాగుంటుందా ? నీకేలా తెలుసు ? " అని అడిగాడు. దానికా షాపతను " ఎందుకు తెలియదూ ? ఇవాళ నా షాపులో కోడిగుడ్లన్నీ ఇట్టే అమ్ముడయిపోయాయి కదా ! " అన్నాడు.

* ప్రముఖ ఆంగ్ల కవి జాన్ మిల్టన్ భార్య చాలా అందగత్తె. అదే విషయాన్ని అతని మిత్రుడొకరు చెప్పబోతూ కవికి కవితా ధోరణిలోనే చెప్పాలనుకున్నాడేమో " నీ భార్య గులాబీ పువ్వంత అందంగా ఉంది. నిజంగా నువ్వు అదృష్టవంతుడివి " అని పొగిడాడు.
దానికి మిల్టన్ " నిజమేనేమో కానీ ఆ గులాబీ అందం, సొగసూ ఆస్వాదించలేక పోతున్నాను. అయితే దాని చుట్టూ ఉన్న ముళ్ళ కాఠిన్యం మాత్రం అనుభవిస్తున్నాను " అన్నాడు. మిల్టన్ అంధుడు. ఆయన భార్య గయ్యాళి.

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం