ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా పేరుపొందాడు రాక్ ఫెల్లర్. ఆయనకి అనేక వ్యాపారాలు వుండేవి. ఒకరోజు తన ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి బయిల్దేరాడాయన. కారు ఎక్కబోతూ వుండగా ఒక కొత్త వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు.
" నేను మిమ్మల్ని కలవాలని ఇరవై మైళ్ల దూరం నుండి నడచి వచ్చాను. దారిలో అందరూ న్యూయార్క్ నగరం మొత్తానికి మీరొక్కరే ధర్మదాతలని చెప్పారు " అన్నాడు.
రాక్ ఫెల్లర్ కొంచెం ఆలోచించి " మీరిప్పుడు వచ్చిన దారిలోనే వెనక్కి వెడతారా ? " అని అడిగాడు. దానికా వ్యక్తి...
" అవునండి. ఆ దారినే వెడతాను " అన్నాడు.
" అయితే మీరు నాకో సహాయం చెయ్యగలరా " అనడిగాడు రాక్ ఫెల్లర్.
" అదెంత మాట. చెప్పండి. తప్పకుండా చేస్తాను " అన్నాడు మహదానందంగా ఆ వ్యక్తి.
" ఎవరైతే మీకు నా గురించి గొప్పగా చెప్పారో వారందరికీ మీరు విన్నది నిజం కాదని చెప్పగలరా ? " అనడిగాడు రాక్ ఫెల్లర్.
ఆ వ్యక్తి తెల్లబోయాడు.
" మీరు ఇలా ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదు " అని అడిగాడు.
" మీకు అర్థమయ్యేటట్లు వివరంగా చెబుతాను. వినండి. నేను కుంటివారికి, గుడ్డివారికి, ఏ పనీ చేయలేని అశక్తతలో వున్న వృద్ధులకు మాత్రమే సహాయం చేస్తాను. కానీ పని చేసుకోగల శక్తి వుండి, ఎంతో కొంత సంపాదించుకోగల అవకాశం వుండి అందుకు తగ్గ ప్రయత్నం చేయకుండా వుండే మీలాంటి వాళ్ళకి నేను సహాయం చెయ్యను. క్షమించండి. అపాత్రదానం చేయలేను " అని కారెక్కి వెళ్ళి పోయాడు రాక్ ఫెల్లర్.
Vol. No. 02 Pub. No. 310
No comments:
Post a Comment