Monday, April 17, 2017

ఏ కాలేజీకేగినా....

చెన్నై నగరంలో కొన్ని తెలుగు సాహితీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
వేద విఙ్ఞాన వేదిక, చెన్నై పాత్రికేయ మిత్రుల సంఘం అనే రెండు సంస్థలు ప్రతి నెలా క్రమం తప్పకుండా సాహిత్యాంశాలు, సాహితీవేత్తలను గూర్చిన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి కార్యక్రమానికీ తెలుగువారు చెప్పుకోదగ్గ సంఖ్యలో హాజరౌతారు.
వేద విఙ్ఞాన వేదికను మధు కందనూరు గారు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ గతంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రముఖ రచయిత, పరిశోధకులు, ఉపన్యాసకులు ద్వానా శాస్త్రి గారు పాల్గొని రాయప్రోలు సుబ్బారావు గారిని గురించి ప్రసంగించారు. ఆద్యంతం ఆసక్తికరంగా చేసిన ప్రసంగంలో సందర్భానుసారం చెణుకులను కూడా చొప్పించారు.
"ఏ దేశమేగినా... " గేయాన్ని వివరించిన తరువాత తాను విశాఖపట్టణంలో కళాశాలలో ఉపన్యాసకుడిగా ఉన్న రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. ఒక సందర్భాన్ని వివరించి ప్రేక్షకులను నవ్వించారు. రోజూ అల్లరి చేస్తూ విద్యార్థులు పాఠాలు జరగనిచ్చేవారు కాదట. ఇలా కాదని ఒక రోజు "దేశమును ప్రేమించుమన్నా" కి పేరడీని వ్రాసి తీసుకెళ్ళారట ద్వానా శాస్త్రి గారు. ఆ రోజు పాఠానికి బదులు ఈ పేరడీని వినిపించారట. ఆ దెబ్బకి "రోజూ ఇలాగే మా మీద ఏవో ఒకటి వ్రాసుకొస్తారేమో....మేము పాఠమే వింటాంలెండి" అంటూ విద్యార్థులు దారికొచ్చారట. ఇంతకీ ఆ పేరడీ చదవాలని మీకూ ఆసక్తిగా ఉంది కదా! ఆయన వినిపించిన అందులోని భాగం ఆయన వినిపించారు. ఇదుగో....

" ఏ కాలేజీకేగినా ఏ మేష్టరొచ్చినా
   ఏ క్లాసు అయినా ఎవ్వరేమనినా
   చేయరా అల్లరి నిర్భయముగాను
   నిలుపరా నీ జాతి వానరతనంబును.

 " ఏ పూర్వ పాపమో ఏ రోగ బలమో
   జనియించినాడవీ విద్యార్థిగాను
   లేరురా నీవంటి రౌడీలు
   ఇంకెందు లేరురా నీవంటి ఆకతాయిలింకెందు"

- మాధురీకృష్ణ

Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 08 Pub. No. 014

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం