ప్రధమాంకములో ధనుర్బాణములను చేత పట్టుకొని ఒక
లేడిని అనుసరించుచు సూతునితోసహా రధము పై దుష్యంతమహారాజు పాత్ర ప్రవేశించును.ఆ లేడిని
తరుముతూ రాజు బాణమును ఎక్కుపెట్టినంతలో
వైఖానసుడు ప్రవేశించి బాణముతో లేడిని కొట్టవద్దని రాజును వారించే
సందర్భములో కాళిదాసు ఒక అద్భుతమైన శ్లోకమును రచించినాడు. ఆ శ్లోకము--
నఖలు న ఖలు బాణ: సన్నిపాత్యో యమస్మిన్
మృదుని మృగశరీరే పుష్పరాశా వివాగ్ని:
క్వ! బత! హరిణకానాం జీవితం చాతిలోలం
క్వ చ నిశితనిపాతా: సారపుంఖా: శరా స్తే!!
అతి మృదువైన ఈ మృగశరీరము మీదికి బాణమును వేయుట
పుష్పరాశి పై అగ్నిని విసిరినట్లు
అగును. నీకిది తగదు.అతి చంచలములైన ఈ లేళ్ళ ప్రాణములు ఎక్కడ? మిక్కిలి
వేగవంతములును, పదునైనవియునగు నీ బాణముల శక్తి ఎక్కడ? నీ బాణమును ఉపసమ్హరింపుము అని వైఖానసుడు దుష్యంతుని
వారించిన ఈ శ్లోకములో రాబోవు కధనంతటినీ కాళిదాసమహాకవి సూచించినాడు.
రాజునకు చేయబడిన
ఈ ధర్మోపదేశములో నొక చమత్కారమున్నది. ముందు జరుగబోవు కధలో గాంధర్వవిధిని
దుష్యంతుడు చేపట్టిన శకుంతల భార్య హోదాలో రాజాస్థానమునకు పోగా
అగతికయై, దీనయైన ఆ ఇల్లాలిని దుష్యంతుడు (దుర్వాసుని
శాపవశమున) త్రోసిపుచ్చును. దీనురాలైన భార్యను రక్షింపవలసిన
మహారాజు నిరపరాధిని యైన యామెను శాపవశమున శిక్షింపబోవును.ఈ
కధ అంతయూ వైఖానసుని ధర్మోపదేశమున స్ఫూర్తిమంతముగా నున్నది.
పౌరవులకు సాయకములు (బాణములు) దీనజన రక్షణకు
కానీ నిరపరాధులను శిక్షించుటకు కాదు అని దుష్యంతుడు ఎక్కుపెట్టిన బాణమును వైఖానసుడు ఉపసం హరింపజేయును. ఇదంతయూ
కాళిదాసుని కళాభిజ్ఞతకు, లోకజ్ఞతకు నిదర్శనము.
- ఎర్రమిల్లి శారద
Visit web magazine at www.sirakadambam.com
No comments:
Post a Comment