Monday, April 17, 2017

భర్తృహరి సుభాషితాలు 01


పద్మాకరం దినకరో వికచం కరోతి
 చంద్రో వికాసయతి కైరవచక్రవాలం,
నాభ్యర్ధితో జలధరోపి జలం దదాతి,
సంత: స్వయం పరహితే విహితాభియోగా:

ద్యుమణి పద్మాకరము విక చముగ చేయు
కుముదహర్షంబు గావించు నమృతసూతి,
యర్ధితుడు గాక జలమిచ్చు నంబుధరుడు;
సజ్జనులు కారె పరహితా చరణమతులు.
తామరకొలను అడుగకముందే సూర్యుడు తామరకొలనును వికసింపజేయుచున్నాడు.
తెల్లకలువల సముదాయమును చంద్రుడు తానే విరియించుచున్నాడు.
ఎవరిచేతనూ యాచింపబడకనే మేఘుడు నీటిని ఇచ్చుచున్నాడు. అదే విధముగా సత్పురుషులెప్పుడూ ఇతరులకు హితము కూర్చుటకే ఇష్టపడుట లోక సహజము.
********************************************
ఏతే సత్పురుషా: పరార్ధఘటకా స్స్వార్ధాన్ పరిత్యజ్య యే
సామాన్యాస్తు పరార్ధ ముద్యమభృత: స్వార్ధావిరోధేన యే,
తేZమీ మానుషరాక్షసా: పరహితం స్వార్ధాయ నిఘ్నంతి యే
 యే తు ఘ్నంతి నిరర్ధకం పరహితం తే కే న జానీమహే.

తమకార్యంబు పరిత్యజించియు పరార్ధప్రాపకుల్ సజ్జనుల్,
తమకార్యంబు ఘటించుచున్ పరహితార్ధవ్యాపౄతుల్ మధ్యముల్,
తమకైయన్యహితార్ధ ఘాతుకజనుల్ దైత్యుల్,వౄధాన్యార్ధభం
గము గావించెడువార లెవ్వరొ యెరుం గన్ శక్యమే యేరికిన్?

స్వకార్యములను విడిచి పరులకార్యములను చేయువారు సత్పురుషులు. తమ కార్యములకు భంగము లేకుండా పరుల కార్యములను చేయువారు మధ్యములు అనబడతారు. స్వప్రయోజన నిమిత్తమై పరులకార్యములను చెడగొట్టువారు మనుష్యులలో రాక్షసులు. తమకు ఏమాత్రమూ ప్రయోజనము లేకున్నాపరులకు నష్టము చేయువారికి ఏపేరు పెట్టవలెనో ఎవరికీ ఎరుంగ శక్యము కాదు.
********************************************
పాపాన్నివారయతి,యోజయతే హితాయ,
గుహ్యం నిగూహతి,గుణాన్ ప్రకటీకరోతి ,
ఆపద్గతం చ న జహాతి,దదాతి కాలే;
సన్మిత్రలక్షణ మిదం ప్రపదంతి సంత:
అఘమువలన మరల్చు,హి తార్ధకలితు
జేయు, గోప్యంబు దాచు, పో షించు గుణము,
విడువ డాపన్ను,లేవడి వేళ నిచ్చు;
మితృ డీ లక్షణంబుల మెలంగుచుండు.
పాపకార్యములనుండి తప్పించుచు
ధర్మోపదేశము చేయుచు మంచిపనులను చేయుటకు ప్రేరేపించుచు రహస్యములను కాపాడుచు సద్గుణములను ప్రకటించుచూ ఆపద సమయమున విడువక అవసరమైన సమయమున ఆర్ధిక సహాయము చేయుచు, క్షీరనీర న్యాయమున మంచి మిత్రుడు మెలగవలెను.
- ఎర్రమిల్లి శారద



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 015

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం