ఆంద్రప్రదేశ్ లోని ఉత్తమ శ్రేణికి చెందిన సంపాదకులలో మణి కిరీటం వంటివారు శ్రీ ముట్నూరి
కృష్ణారావు పంతులు గారు. వేదాంతము, దేశభక్తి, సాహిత్యము
త్రివేణి సంగమం ఆయన సంపాదకీయాలలో ఉరికెత్తుతూ తెలుగువారిని
ముంచెత్తుతూ ఉండేవి. హిమవన్నారము
వంటి ఆయన రూపం, మంచు వంటి తెల్లని దుస్తులు
ధరించి, తెల్లని తలపాగా చుట్టి ఆయన ఠీవిగా నడుస్తుంటే
బందరులో ప్రజలు దారి లో తప్పుకోనేవారుట.
కృష్ణా జిల్లా తరఫున వెలువడే కృష్ణా పత్రికకు 1903 లో సహాయ
సంపాదకులుగా పని చేశారు. 1905
లో గుంటూరు మండలం విడిపోయిన
సందర్భంలో కొండా వెంకటప్పయ్యగారు గుంటూరు వెళ్లిపోవడంతో ఆనాటి
నుంచి కృష్ణారావు గారు కృష్ణాపత్రికకు సంపాదకులయారు.
దేశానికి స్వాతంత్ర్యం రాని రోజుల్లో కృష్ణారావు
గారు ప్రజలను ఉత్తేజపరుస్తూ భావ స్ఫోరకమైన సంపాదకీయాలు వ్రాసేవారు.
ఆయన పత్రికలో సాహిత్యానికి, నాటకానికి, చిత్రకళలకు, ఆధ్యాత్మికతకు
ప్రముఖ స్థానం ఇచ్చి కృష్ణాపత్రికను ఉన్నత
శిఖరంపై అధిష్టింపచేసారు. కృష్ణాపత్రికలో ఒక
వ్యాసం గాని, ఒక కధ గాని, ఒక గేయం కాని
ప్రచురితమైతే రచయితలకు ఎంతో గర్వకారణం గా వుండేది.
కృష్ణారావు గారు చాలా గంభీరమైన వ్యక్తి. కాని హాస్యోక్తులు విసురుతూ
వుండేవారు. వారి గంభీరత గురించి ఒక సంఘటన వివరిస్తాను.
కాంగ్రెసు ప్రచారం
ఊళ్ళల్లో విరివిగా సాగుతున్న రోజులవి.
డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు, చెరుకువాడ నరసింహం
పంతులుగారు, గురుజాడ రాఘవ శర్మ గారు, గొట్టిపాటి
బ్రహ్మయ్య గారు వూళ్ళకు వెడుతూ కృష్ణారావు గారిని కూడా ఆహ్వానించేవారు.
వారు వెళ్లి ఉపన్యాసాలివ్వడానికి అంగీకరించే వారు కాదు."
పోనీ మా వెంట రండి..... కొంత గౌరవం ఏర్పడుతుంది " అని వారు
బలవంతం చేసి తీసుకు వెడుతూ వుండేవారట.
ఒకసారి అలా వెళ్ళినపుడు పట్టాభి గారు " కృష్ణారావూ వేదిక మీద
కూర్చో. అధ్యక్షుడు గానూ ఉంటావు....... అందరికి కనిపిస్తావు అన్నారుట. సభా ప్రారంభంలో కృష్ణారావు గారు
పక్కనున్న వ్యక్తిని వేలితో సౌజ్ఞ చేసారుట, సభ
ప్రారంభించమన్నట్లు.
తరువాత వారిని అంటే –
మౌనం గానే ఆజ్ఞాపించారట. అలా అందరూ అయిన తరువాత సభ
పూర్తి అయింది అంతా లేవవచ్చు అన్నట్లు చేతితోనే చెప్పారట.
సభకు వచ్చిన ఒక రైతు " పాపం ! ఏమిచేస్తాం
! మనిషి చూస్తే మహారాజులా
వున్నాడు. మాట మాత్రం లేదు.... భగవంతుడలా పుట్టించాడు గావున్ను...... ఆ
రూపానికి మాట కూడా వుంటే
ఎంత గొప్పవాడయ్యే వాడో ! అని ఎంతో విచార పడ్డాడట.
- తటవర్తి జ్ఞానప్రసూన
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 08 Pub. No. 016
No comments:
Post a Comment