Tuesday, April 27, 2010

సినిమాల్లో పాటల గురించి శ్రీశ్రీ

బొమ్మలు మాట్లాడటం ప్రారంభించాక హాలీవుడ్లో  తయారైన మొట్టమొదటి టాకీ చిత్రం సంగీత ప్రధానమైనది. అప్పుడే సాహిత్యంతో కూడిన పాటలు స్వరబద్ధమైన సంగీతంతో బాటు సినిమా రంగ ప్రవేశం చేశాయి. అలాగే ఇండియాలో తయారైన మొదటి హిందీ చిత్రం ' ఆలం ఆరా ' గానరస ప్రధానమైనదే. దీన్ని మద్రాసులో ప్రదర్శించినప్పుడు నేనూ చూసాను. ఏం చూసాను, ఏం విన్నానో ఇప్పుడు జ్ఞాపకం లేదు గానీ బ్లాకులో టికెట్లు కొనలేదని మాత్రం జ్ఞాపకంగా చెప్పగలను. అప్పటికింకా మనదేశం అంత అభివృద్ధి సాధించలేదు. కనీసం అప్పటికింకా మనకి స్వరాజ్యమైనా రాలేదు.

నేను మొదటే చెప్పాను. సినిమాకి పాటల అవసరాన్ని సందేహిస్తున్నానని. ( ఆ అవసరం లేకపోతే నేను నిరుద్యోగినై పోతానేమో అన్నది వేరే సంగతి ! ) ఒక్క పాటలే అన్న మాటేమిటి ? సినిమాకు అక్కరలేనిదంటూ ఏమైనా వుందా అనేది నా ధర్మ సందేహం. ఈ రెండో దానికి నా మొదటి సందేహం తీరిపోయింది. అవును మన సినిమాల్లో పాటలుండాలి. తెలుగు పుస్తకాల్లో అచ్చుతప్పుల్లా.

నా మొదటి పాట ' కాలచక్రం ' అనే చిత్రంలో మొదటి నిమిషాలలోనే వచ్చింది. అదే నా ' మహాప్రస్థానం ' పాట. అప్పటికే కొంత చప్పుడు చేసిన ఆ పాటను వాళ్ళు కావాలన్నారు. నేను సరేనన్నాను. దానికిగాను నాకు ముట్టిన పారితోషికం సినిమా హాల్లోకి ఉచిత ప్రవేశం. బందా కనకలింగేశ్వరరావు, ముంజులూరి కృష్ణారావు, కపిల కాశీపతి, లక్ష్మీరాజ్యం మొదలైనవారు నటించిన ' కాలచక్రం ' కాలగర్భంలో కలసిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు దాన్ని స్మరించేవాళ్ళే లేరు.

ఆ తర్వాత చాలా కాలానికి ' ఆహుతి ' అనే చిత్రంతో నేను సినిమారంగంలోకి స్థిరప్రవేశం చేసాను. ' ఆహుతి ' చిత్రం కూడా కాలానికి ఆహుతి అయిపోయింది. కానీ తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ చిత్రంగా ఆది చరిత్ర సృష్టించింది. అందులోని ' ప్రేమయే జనన మరణ లీల ' అనే పాట ఇప్పటికీ తరచుగా మన రేడియోలలో వినబడుతూ వుంటుంది. ఆ పాట ప్రజాదరణ పొందటానికి అందులోని సాహిత్య పుష్టికన్నా సాలూరి రాజేశ్వరరావు సొంత బాణీ, ఘంటసాల కమనీయ కంఠం ముఖ్య కారణాలని నేననుకుంటున్నాను. సాహిత్య విలువలకైతే ' హంసవలె ఊగుచు రావే ' అనే పాటను నేనెక్కువ లైక్ చేస్తాను.

' ఆహుతి ' చిత్రం విడుదలైంది 1950 లో. అదే సంవత్సరం నా ' మహాప్రస్థానం ' గీతాలు గ్రంథరూపం దాల్చాయి. 
                                      
                                                                                   ................. మహాకవి శ్రీశ్రీ             



Vol. No. 01 Pub. No. 270

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం