Friday, April 30, 2010

కల కానిది... విలువైనది

 కల కానిది... విలువైనది బ్రతుకు 
కన్నీటి ధారలలోనే బలి చేయకు 

అంటూ జీవిత సత్యాన్ని ఆవిష్కరించిన మహాకవి

గాలి వీచి పూవులా తీగ నేల రాలిపోగా 
జాలివీడి అటులేదాని వదలివైతువా 
చేరదీసి నీరుపోసి చిగురించనీయవా !!

అంటాడు. మానవనైజంలో చెడుతో బాటు మంచి కూడా అంతే పాళ్ళలో వుంటుంది. ఆ మంచితనాన్ని గుర్తు చేస్తారు శ్రీశ్రీ.

అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
కలతలకే లొంగిపోయి కలవరించనేలా
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో !!

అని నిరాశలో మునిగిపోయిన వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తాడు మహాకవి .

అగాధమౌ జలనిధిలోన ఆణిముత్య మున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే 
ఏదీ తనంతతానై నీ దరికిరాదు
శోధించి సాధించాలి, అదియే ధీర గుణం !!

అంటూ ధైర్యం చెబుతూ కర్తవ్య బోధ చేస్తారు శ్రీశ్రీ.

అతి తేలికైన పదాల్లో, సరళమైన భాషలో అంతులేని జీవిత సత్యాలను ప్రబోధిస్తారు శ్రీశ్రీ.
సాహిత్యానికి కావలసింది పదాడంబరం కాదు భావ ప్రకటన అని ప్రకటించారు శ్రీశ్రీ.
సినిమా సాహిత్య ప్రక్రియ మరే ఇతర ప్రక్రియకు తీసిపోనిదని ఋజువు చేశారు శ్రీశ్రీ.
మహాప్రస్థానంలాంటి రచనలతో మహోన్నతాలకెదిగిన ఆయన
సినిమా సాహిత్యాన్ని కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళచ్చని  నిరూపించారు
ఏం రాసినా, ఏది రాసినా ఆయనకే చెల్లు
ఎవరెన్ని అన్నా, ఎవరేం అనుకున్నా
ఆయన పథం ఆయనది.. ఆయన విధానం ఆయనది
అందుకే ఆయన మహాకవి  అయ్యారు, ప్రజల కవి అయ్యారు.

కల కానిది.... పాట పూర్వాపరాల గురించి ' పాడవోయి భారతీయుడా ' సంకలనంలోని శ్రీశ్రీ గారి మాటల్లో...............
**************************************************************************
అన్నపూర్ణా పిక్చర్స్ వారి ' వెలుగు నీడలు ' లోని ఈ పాటకు ట్యూన్ వెదకడానికి సంగీత దర్శకుడు పెండ్యాల 15 రోజులు కృషి చేశారు. ట్యూన్ ఓకే అయిన తరువాత తెలుగు పాట నేను, తమిళ పాట నారాయణ కవి రాశాము. సాధారణంగా అన్నపూర్ణా సంస్థలో ముందుగా ట్యూన్ నిర్ణయించడం జరుగుతుంది. సంగీతం విషయంలో మధుసూదనరావు గారికి మంచి అభిరుచి వుంది. హిందీలో రాజ్ కపూర్ కి ఉన్నట్లు. అందుకే వీరుద్దరి చిత్రాలలోని పాటలు నాలుగు కాలాలపాటు నిలిచేవిగా వుంటాయి.
ఎంతవరకూ నిజమో నాకు తెలియదుగానీ ఆత్మహత్య చేసుకోబోయిన ఒక వ్యక్తి ' కలకానిది, విలువైనది ' అన్న పాటను విని ఆ ప్రయత్నం విరమించుకున్న ఉదంతం ఎవరో చెప్పగా విన్నాను. 
 ******************************* ******************************************

' అగాధమౌ జలనిధిలోన ఆణిముత్య మున్నటులే ' అన్న వాక్యం నారాయణకవిదని శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా నేనెక్కడో చదివినట్లు బాగా గుర్తు. తనది కాని విషయాన్ని నిజాయితీగా అంగీకరించే సంస్కారం మహాకవి శ్రీశ్రీది. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఆయన ప్రభావం తెలుగు కవిత్వం మీద ఇప్పటికీ వుంది. ఎప్పటికీ వుంటుంది.

మహాకవి శ్రీశ్రీ శతజయంతి వేడుకలు నేటితో ( ఏప్రిల్ 30 )  ముగుస్తున్నాయి. ఆయన్ని స్మరించుకోవడమంటే తెలుగు కవిత్వాన్ని, సినీ కవిత్వాన్ని మరోసారి సమీక్షించుకోవడమే ! ఆ మహాకవికి కవితాంజలులు.




సామ్యవాద కవితా దర్సనం-మహాప్రస్థానం
శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం మొదలైన గీతాలు
శ్రీశ్రీ కవితాప్రస్థానం

Vol. No. 01 Pub. No. 277

3 comments:

తృష్ణ said...

పొద్దున్న టివీలో శ్రీ శ్రీగారి సతిమణి సరోజగారి ఇంటర్వ్యూ,ఆ తరువాత పుస్తకావిష్కరణ సభా కార్యక్రమం అవీ చూస్తూ అనుకున్నానండి మీరు ఏదన్నా రాస్తారని.బాగుందండీ... !వీలుండి ఉంటే నేనూ కాస్తంత రాద్దును...

Unknown said...

మీ బ్లాగులు చాలా బాగుంటాయి కాని, బ్లాగు చుట్టూ ఉన్న ads కొన్ని ఆఫీసు లొ చూడడానికి (ఇంట్లోకూడా) అనువుగా ఉండటం లేదు. దానికి పరిష్కారం ఏమైనా ఉందా/చెయ్యగలరా?

SRRao said...

* తృష్ణ గారూ !
* కొత్తపాళీ గారూ !
ధన్యవాదాలు.

* కే.కే.గారూ !
ముందుగా ధన్యవాదాలు. ప్రకటనల గురించి ఇటీవలే సహృదయులైన మిత్రులు నా దృష్టికి తీసుకొచ్చారు. నా సిస్టంలో అభ్యంతరకరమైనవి, అసభ్యకరమైనవి కనిపించకపోవడంతో నేను వాటి గురించి పట్టించుకోలేదు. నా సిస్టంలో కనబడకుండా మీకు ( సందర్శకులకు ) మాత్రమే కనిపించే ఏర్పాటు ఏమైనా ఈ ప్రకటనలనందించేవాళ్ళు చేసారేమో తెలీదు. నిన్ననే సీనియర్ బ్లాగర్ మిత్రులొకరు మెయిల్ ద్వారా తెలియజేశారు. నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా నా బ్లాగు ద్వారా సందర్శకులకు, బ్లాగు మిత్రులకు కలిగిన అసౌకర్యానికి క్షమించమని కోరుకుంటూ గూగుల్ వారివి తప్ప ఇతరుల ప్రకటనలన్నిటినీ ఈ రోజే తొలగిస్తాను. మిగిలిన బ్లాగర్లు కూడా ఈ అనుభవాన్ని గుర్తుంచుకుని జాగ్రత్త పడతారని ఆశిస్తాను. ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చిన మీకు కృతజ్ఞతలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం