Sunday, June 19, 2011

నాన్నగారు - మూర్తీభవించిన వ్యక్తిత్వం

నాన్నగారు -  ఈ పదం ఊహ తెలిసిన దగ్గర్నుంచి ప్రతి ఒక్కరికీ తెలిసిన పదమే ! ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి అనుబంధం అమ్మతోనైతే రెండవ అనుబంధం తప్పనిసరిగా నాన్నతోనే ! మన జీవితాన్ని తీర్చిదిద్దడంలో ఇద్దరి పాత్రా సమానమైనదే ! నవమాసాలు మోసి జన్మనిచ్చేది అమ్మ అయితే ఆ జన్మకు పరిపూర్ణమైన రూపమిచ్చేది నాన్న. అయితే చాలామందికి ఆమ్మ దగ్గరున్న చనువు నాన్న దగ్గర వుండదు. ముఖ్యంగా మగపిల్లలకి. నిజానికి వాళ్లకి తండ్రి ఒక రోల్ మోడల్. ఆయన్ని అనుకరించాలని చిన్నతనంలో ప్రయత్నిస్తారు కూడా !

మా నాన్న దగ్గర మాకంత చనువు ఉండేది కాదు.  ఆయనంటే కొంచెం భయం కూడా ఉండేది. అలాగని ఆయనేమీ కర్కోటకుడు కాదు కానీ కొంచెం సీరియస్ గానే ఉండేవారు. అధ్యాపక వృత్తిలో వుండడం వల్లనో, అభిరుచి వుండడం వల్లనో ఎక్కువ సమయం చదువుకే కేటాయించేవారు. మాతో గడపడానికి కేటాయించిన సమయం తక్కువ కావడమే మాకు అంత చనువు ఏర్పడకపోవడానికి కారణం. కొన్ని నియమాలకి, సిద్ధాంతాలకి కట్టుబడి ఉండేవారు.

ఆయన పాఠం చెబుతుంటే ఆ తరగతిలో సూది పడినా శబ్దం వినిపించేటంత నిశ్శబ్దంగా ఉండేది. ఏరోజూ ఆయన క్లాసుకి ఆలస్యంగా వెళ్ళేవారు కాదు. ఏ విద్యార్ధి అయినా ఆలస్యంగా వచ్చినా సహించేవారు కాదు. క్రమశిక్షణను ఖచ్చితంగా పాటించేవారు. పాఠం చెబుతుంటే అదొక గంగా ప్రవాహం. అంతరాయం కలిగించడానికి, ఆపడానికి ఎవరూ ప్రయత్నించేవారు కాదు. ఆంగ్ల మాధ్యమంలో బోధించేటపుడు మొత్తంమంతా ఆంగ్లంలోనే చెప్పేవారు. తెలుగు మాధ్యమంలో చెప్పేటపుడు సాధ్యమైనంత వరకూ అంటే అనువాదం చెయ్యలేని సాంకేతిక పదాల లాంటివి తప్ప ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండా తెలుగులోనే చెప్పేవారు. ఇవన్నీ చిన్నప్పటినుంచీ అందరూ చెబుతుంటే వినడం జరిగినా ఈ విషయాలు నాకు డిగ్రీ చదువుతుండగా అనుభవంలోకి వచ్చాయి. బీకాం రెండవ , మూడవ సంవత్సరాల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివిన మాకు కొన్ని సబ్జెక్టులు నాన్న చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో మూడవ సంవత్సరంలో ఆఫీసు ఆర్గనైజేషన్ అండ్ సూపర్ విజన్ అనే ఐచ్చిక సబ్జెక్టు తెలుగు మాధ్యమంలోనే ఉండేది. దాన్ని బోధించేటపుడు ఈ తేడా స్పష్టంగా గమనించాను. అలాగే సబ్జెక్టులో పరిపూర్ణత కోసం, ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఆయన నిరంతరం కొత్త పుస్తకాలు, ఆర్టికల్స్ కొనడమో, సేకరించడమో చేసి చదవుతూండేవారు. అందుకే విషయ పరిజ్ఞానం విషయంలో ఎప్పుడూ ముందంజలో ఉండేవారు. 

మా చిన్నప్పుడు మా ముందు గది ట్యూషన్ కోసం వచ్చే విద్యార్థులతో నిండిపోయి ఉండేది. అయితే అందులో దాదాపు అందరూ మొహమాటానికి వచ్చేవారే ! డబ్బు కోసం మాత్రమే చదువు చెప్పేవారు కాదు. అలాగే ప్రతిభ కల విద్యార్థులకు కాక కొంచెం చదువులో వెనుకబడిన విద్యార్థులకు ట్యూషన్ చెప్పడానికి ఎక్కువ ఆసక్తి చూపేవారు. తర్వాత కాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా మంచి హోదాల్లో వున్న శిష్యులు వెదుక్కుంటూ వచ్చేవారు. వారిలో చాలామంది తమకు చదువు మీద లేని శ్రద్ధను ఆయన ఎలా కలిగించారో, అల్లరి చిల్లరిగా తిరిగే తమను ఎలా దారిలో పెట్టారో కథలు కథలుగా చెప్పేవారు. 

కొంతకాలానికి ఆయన అధ్యాపక సంఘ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం మొదలయ్యాక ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా ట్యూషన్లు చెప్పడం సరైన పధ్ధతి కాదు అనే నైతిక సూత్రానికి కట్టుబడి చెప్పడం పూర్తిగా మానేశారు. అక్కడనుంచి ప్రిన్సిపాల్ గా బాధ్యత చేపట్టేదాకా తన స్వార్థాన్ని చూసుకోకుండా అధ్యాపకుల సంక్షేమ కార్యకలాపాలకే అంకితమయ్యారు. 

ప్రిన్సిపాల్ గా కూడా ప్రతీదీ నియమ నిబంధనల ప్రకారం జరగాలనే పద్ధతికి కట్టుబడి పనిచేశారు. అడ్మిషన్ల విషయంలో సిఫార్సులకు తలొగ్గకుండా, కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే చేసి పాలకమండలితో విరోధం తెచ్చుకున్నారు. సుమారు సంవత్సరం పాటు జరిగిన ఆ పోరాటానికి విద్యార్థులు , ఊరిపెద్దలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ మద్దతునిచ్చారు. విచిత్రమేమిటంటే మెరిట్ లేని కారణంగా సీట్ ఇవ్వని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆయనకు తమ మద్దతునందించారు. అధికారం, డబ్బు ఒకవైపు, కేవలం నైతికత మరోవైపు జరిగిన పోరాటంలో నాన్న విజయం సాధించడం, ప్రభుత్వ మద్దతుతో ( పాలకమండలిలో చాలామంది అప్పటి అధికార పార్టీ మద్దతుదారులైనా కూడా ) మళ్ళీ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టడం ఒక అపూర్వమైన ఘట్టం. 


ఆ సమయంలో పాలకమండలి బెదిరింపుతో అధ్యాపకేతర సిబ్బంది సహకరించడానికి భయపడితే విద్యార్థులు, అధ్యాపకులలో కొందరు, పట్టణ ప్రజల్లో కొందరు ఆ బాధ్యతలను స్వచ్చందంగా నిర్వహించడం  ( బెల్ కొట్టడం దగ్గర్నుంచి అన్నీ ) మరిచిపోలేని విషయాలు. ఇంకా విశేషమేమిటంటే పాలకమండలిలో ముఖ్యులైన కొందరు బహిరంగంగా మద్దతివ్వగా మరికొందరి కుటుంబసభ్యులు తమ వారి చర్యలకు అసంతృప్తిని నా దగ్గర వ్యక్తపరచడం. బహుశా ఏ కళాశాల చరిత్రలోనూ ఇలాంటి సంఘటనలు జరుగలేదేమో ! ఆర్ధికబలం ఏమాత్రం లేకపోయినా ఆయన క్రమశిక్షణ, నియమ నిబంధనలు పాటించే విషయంలో ఎంతటివారినైనా లెక్కచెయ్యని తత్త్వం, నిజాయితీ, నిబద్ధత, అంతులేని పరిజ్ఞానం, అధ్యాపకుడంటే ఇలాగే వుండాలి అనిపించే వ్యక్తిత్వం అన్ని వర్గాల మద్దతునూ చేకూర్చి, కొండను పొట్టేలు ఢీకొన్నట్లుగా జరిగిన ఆ పోరాటంలో అంతటి ఘన విజయాన్ని దక్కించాయి. 

వృత్తిపరంగా కామర్సు బోధించినా వైద్యం, సాంకేతికాంశాలు, సాహిత్యం, కళలు లాంటి అనేక విషయాల మీద ఆసక్తి, అభిరుచి ఉండేవి. వాటికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో కొని చదివేవారు. ఇప్పటికీ ఆయనకు గుర్తుగా వాటిని భద్రంగా దాచుకున్నాను. నాన్న నాకిచ్చిన సంపద అదే ! ఆయన ఉన్నంత కాలం చిన్న చిన్న విషయాలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం మాకు ఉండేది కాదు. మా బంధువర్గంలో కూడా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే సలహా కోసం మొదట నాన్న దగ్గరికి వచ్చేవారు. కాలేజీకి వెళ్లి వచ్చాక దొరికే ఖాళీ సమయాన్ని చదవడంలోనూ, తోట పనిలోనూ, తోటి అధ్యాపకుల సమస్యలకు పరిష్కారాలు వెదకడంలోను గడిపేవారు. 

నాన్నదొక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. ఆయనకున్న చదువు, పరిజ్ఞానం నాకు రాకపోయినా, ఆయన ఆసక్తులలో కొన్ని వచ్చాయని మాత్రం చెప్పగలను, ఆయన వ్యక్తిత్వానికి సరితూగలేకపోయినా నియమ నిబంధనలను పాటించే విషయంలో రాజీ పడలేకపోవడం, నిజాయితీ... నిబద్ధతలను పాటించడం లాంటి కొన్ని లక్షణాలు మాత్రం తెలియకుండానే వచ్చాయేమో ! ఇవి నాకు జీవితంలో ఆర్థిక బలాన్ని ఇవ్వలేదు కానీ నైతిక బలాన్ని ఇస్తున్నాయి. నేను తప్పు చేయడంలేదు...ఎవరినీ మోసగించడం లేదు, నన్ను నమ్మి ఉపయోగించుకున్న వాళ్లకి న్యాయం చేస్తున్నాను ( కొన్ని సార్లు నాకు అన్యాయం జరిగినా ) అనే కొండంత తృప్తిని కలిగిస్తున్నాయి. ఇవన్నీ నాకు తెలియకుండానే నాన్న ద్వారా సంక్రమించినవే ! అప్పుడప్పుడు కొందరు మిత్రులు అంటూ వుంటారు... నాకు బ్రతకటం చేతకాదని. అంటే వారి అర్థం డబ్బు, ఆస్తులు సంపాదించడం చేతకాదని. వ్యక్తిత్వాన్ని చంపుకుని సంపాదించే అంతులేని సంపద కలిగిన వారికి లేని మనశ్శాంతి నాకు వుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఆస్తులేమీ ఇవ్వకపోయినా అంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని వారసత్వంగా ఇచ్చిన నాన్నను స్మరించుకుంటూ ......

అంతర్జాతీయ పితృ దినోత్సవం సందర్భంగా తండ్రులకూ, వారిని గౌరవించే పిల్లలకూ శుభాకాంక్షలు

Vol. No. 02 Pub. No. 261

9 comments:

సుధామ said...

అప్పుడప్పుడు కొందరు మిత్రులు అంటూ వుంటారు... నాకు బ్రతకటం చేతకాదని. అంటే వారి అర్థం డబ్బు, ఆస్తులు సంపాదించడం చేతకాదని. వ్యక్తిత్వాన్ని చంపుకుని సంపాదించే అంతులేని సంపద కలిగిన వారికి లేని మనశ్శాంతి నాకు వుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

-నాదీ ఇదే భావన రావు గారూ! కానీ ఈ సంస్కారం మాత్రం నాన్నగారినుండి సంక్రమించిఉందే అన్న మాత సత్యం.

జాన్‌హైడ్ కనుమూరి said...

this post taken to Naanna eSankalanam

abinaMdanalu

మాలా కుమార్ said...

మీ నాన్నగారి గురించి విషయాలు స్పూర్తికరముగా వున్నాయండి .
happy fathers day .

Tejaswi said...

నాన్నగారికి మీ నివాళి బాగుంది. శుభాభినందనలు.

SRRao said...

* సుధామ గారూ !
ధన్యవాదాలు. మీక్కూడా శుభాకాంక్షలు.

* జాన్ గారూ !
మీరు eసంకలనం లోకి నా టపాను చేర్చినందుకు ధన్యవాదాలు.

* మాలాకుమార్ గారూ !
* తేజస్వి గారూ !

ధన్యవాదాలు. మీక్కూడా శుభాకాంక్షలు.

పల్లా కొండల రావు said...

ఆలస్యంగా చూశాను. అయినా అభినందించాలనిపించింది. సమయోచితమైన మంచి పోస్టు.

SRRao said...

కొండలరావు గారూ !
మంచి విషయానికి స్పందించి అభినందించే మీ మంచి హృదయానికి నమోవాకాలు.
.... ధన్యవాదాలు.

buddhamurali said...

s r rao garu baga rashru . kanisa avasralu tirina taruvata dabbu anthaga santrupthini ivvadu

SRRao said...

మురళి గారూ !
నిజమేనండీ ! ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం