సినిమాలు, వాటిలోని పాత్రలు, ఆ పాత్రలు పలికే కొన్ని ప్రత్యేకమైన పదాలు జన బాహుళ్యంలోకి ఎలా చొచ్చుకుపోతాయో చెప్పడానికి విజయ వారి చిత్రాల్లో పింగళి నాగేంద్రరావు గారు సృష్టించిన ' డింగరి ', ' గురూ ' లాంటి పదాలు ఉదాహరణగా చెబుతుంటాం ! ఆ తర్వాత అలాంటి విచిత్రమైన, కొత్తరకమైన పదాల్ని సృష్టించడంతో బాటు కొన్ని పదాల్ని,,,, వాటి అసలు అర్థమే మారిపోయేలా చేసిన రచయిత జంధ్యాల. అంతేకాదు. మన చుట్టూ కనిపించే కొన్ని విచిత్రమైన, ప్రత్యేకమైన మనస్తత్వం గల వ్యక్తులను తన చిత్రాల్లో పాత్రలుగా మలచిన దర్శకుడు కూడా జంధ్యాలే ! ఆయన సృష్టించిన వాటిల్లో ఇప్పటికీ, ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయిన, నిలిచిపోయే పదం ' సుత్తి ' . నిజానికి సుత్తి అనే పదానికి మనకు తెలిసిన అర్థం కాకుండా మరో అర్థాన్ని జంధ్యాలగారు ఆపాదిస్తే ఆ పాత్రలో జీవించి, ఆ పాత్రకు శాశ్వతత్వాన్ని కల్పించడమే కాకుండా ' సుత్తినే ఇంటి పేరుగా మార్చేసుకున్న నటుడు వీరభద్రరావు.
మామిడిపల్లి వీరభద్రరావుగా కోనసీమలోని అయినాపురం గ్రామంలో జన్మించిన ఈయన చిన్నతనంలోనే తండ్రి ఉద్యోగ రీత్యా విజయవాడ చేరారు. చదువు, ఉద్యోగం, నాటకాలు వగైరా అన్నీ విజయవాడలోనే ! ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రసిద్ధుడవడంతో బాటు రంగస్థలం మీద కూడా లబ్దప్రతిష్టులైన కళాకారులతో పనిచేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
జంధ్యాల సహచరునిగా ఆయన ప్రోత్సాహంతో చిత్రరంగంలో అడుగుపెట్టి ఆయన మార్క్ కామెడీని అద్భుతంగా పండించి ప్రేక్షకులను నవ్వులజడిలో తడిపారు. తెలుగులో ఎన్ని రకాల తిట్లు వున్నాయో అన్నీ జంధ్యాల తన చిత్రాల్లో వాడుకున్నారు. అంతే కాదు అదే ఒరవడిలో కొత్త కొత్త తిట్లు కూడా కనిపెట్టి మరీ వాడారు. వాటిని తెర మీదకు ఒలికించింది జంధ్యాల అయినా పలికింది మాత్రం వీరభద్రరావు గారే ! జంధ్యాల సృష్టించిన పాత్రలకు, సంభాషణలకు అంత బాగా న్యాయం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరేమో !
వీరభద్రరావు గారు సంభాషణలు పలికే తీరులో, ఆయన ప్రదర్శించే హావభావాలలో కృత్రిమత్వం ఎక్కడా కనబడదు. మన మధ్యన నిత్యం తిరిగే సగటు మధ్యతరగతి వ్యక్తి ఆయన నటనలో కనిపిస్తాడు. అందుకే ఆయన ఆలస్యంగా చిత్రరంగానికి వచ్చినా అచిరకాలంలోనే తెలుగు ప్రేక్షకుల మనస్సులను చూరగొన్నాడు.
వీరభద్రరావు గారు కేవలం హాస్య పాత్రలే కాక కరుణ రసాత్మకమైన పాత్రలు, దుష్ట పాత్రలు లాంటివి కూడా ప్రతిభావంతంగా పోషించి తన నటనా సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.
ఈరోజు ఆయన జన్మదినం, .ఆ సందర్భంగా ఆయన్ని , ఆయన నటనను స్మరించుకుంటూ......
అంతకుముందు కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేసినా ఆయనలోని నటుడిని ప్రేక్షకుల మనోఫలకంపై సుత్తి పెట్టి కొట్టిన చిత్రం ' నాలుగుస్థంబాలాట '. రక రకాల వేషాలు వేసి ప్రేక్షకులను రంజింపజేసిన వీరభద్రరావు గారి పయనం ' చూపులు కలసిన శుభవేళ ' లోని సుదీర్ఘ నడకతో 1988 జూన్ 30 న అంతమైంది. ఆ సుత్తిని, ఈ నడకనీ ఓసారి వీక్షించి వీరభద్రరావు గారికి నివాళులు అర్పిద్దాం ..........................
No comments:
Post a Comment