ఒక్కోసారి మన జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలు అద్భుతాలుగా కనిపించి మన జీవితాలనే మలుపు తిప్పుతాయి. అలాంటి ఓ సంఘటన సంగీత జ్ఞానిగా అందరికీ తెలిసున్న ఇళయరాజాను ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళించింది. అదెలాగంటే.........
ఒకసారి ఇళయరాజా మైసూరులో కచేరీ చెయ్యడానికి తన బృందంతో వెళ్ళారు. కచేరీ అయిపొయింది. బృందమంతా బృందావన్ గార్డెన్స్ చూడ్డానికి బయిల్దేరారు. ఇళయరాజాకు హఠాత్తుగా చలి జ్వరం ముంచుకొచ్చింది. విశ్రాంతి కోసమని ఆయన్ని హోటల్ గదిలోనే వుంచి బయిట తాళం వేసుకుని అందరూ వెళ్ళిపోయారు. సమయం గడుస్తున్నకొద్దీ జ్వరం తగ్గడానికి బదులు పెరిగిపోతోంది. అంతకంతకూ ఓపిక తగ్గిపోతోంది. పిలవడానికి ఎవరూ లేరు . లేవడానికి శక్తి లేదు. నరకయాతన అనుభవించారు. అంతిమ ఘడియలు సమీపించాయన్న భయం ఏర్పడింది. తల్లిని, భార్యాపిల్లల్ని తలచుకున్నారు .
మైసూరు దగ్గరున్న మూకాంబిక చాలా మహిమ గల దేవత అని, జీవితంలో ఒకసారైనా ఆ దేవాలయాన్ని దర్శించుకోవాలని ఆయన తల్లి గారు చెప్పేవారు. ఆ విషయం గుర్తుకొచ్చింది. వెంటనే తనకు ఈరోజు జ్వరం తగ్గితే ఆ తల్లి దర్శనం చేసుకుంటానని అనుకున్నారు. అంతే ! మరుక్షణం ఆయనకు చెమటలు పట్టి జ్వరం తగ్గడం ప్రారంభించింది. జ్వరం పూర్తిగా తగ్గగానే ఆయన మూకాంబికను దర్శించుకున్నారు. అప్పటినుండి ఆమెకు పరమ భక్తుడిగా మారారు. ఫాంట్, షర్టు మానేసి పంచె, జుబ్బా ధరించడం ప్రారంభించారు. మాంసాహారం నిషేధించారు. అలా ఆ సంగీత జ్ఞాని ఆధ్యాత్మిక జ్ఞాని కూడా అయ్యారు.
ఆ సంగీత జ్ఞాని, ఆధ్యాత్మిక జ్ఞాని, లయరాజా ఇళయరాజా గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలతో.............
Vol. No. 02 Pub. No. 247
No comments:
Post a Comment