తోలుబొమ్మలాట - తెలుగు వారికి ప్రత్యేకమైన కళ. సినిమాలు అందుబాటులో లేని రోజుల్లో జానపదులకు అదే ఒక సినిమా. రామాయణ, భారత, భాగవత కథలను వారికర్థమయ్యే రీతిలో, భాషలో వినోదాన్ని మిళితం చేస్తూ సాగే కళారూపం.
మొదట్లో బాగా బిగించి కట్టిన తెల్లని తెర వెనుక ఆముదం దీపాలు, ఇలాయి బుడ్డి ( కిరోసిన్ దీపం ) సాయంతో ప్రదర్శించేవారు. మేక, జింక లాంటి జంతువుల తోలును బాగా ఎండబెట్టి పారదర్శకంగా చేసి వాటితో బొమ్మలు తయారు చేసి సహజంగా లభించే రంగులు అద్దేవారు. తెర వెనుక భాగం మీద ఉంచిన ఆ బొమ్మలు పారదర్శకంగా వుండడం వలన వాటి వెనుకనున్న దీపం వెలుతురు వాటిలోనుంచి ప్రసరించి చాలా ఆక్షర్షణీయంగా కనిపించేవి. ఒక రకంగా కలర్ సినిమా చూస్తున్నట్లే ఉండేది.
తర్వాత కాలంలో పెట్రోమాక్స్ దీపాలు వాడేవారు. ఆ తర్వాత కరెంట్ దీపాలు వాడటం వరకూ వచ్చి అప్పటికి సినిమాల ప్రభావం బాగా పెరగడం వలన క్షీణించడం ప్రారంభమైన ఆదరణ, తర్వాత టీవీల ప్రభావంతో పూర్తిగా ఈ కళారూపం కనుమరుగై పోయే పరిస్థితి దాపురించింది. అయితే అప్పట్లో సినిమాలకోసం దూరాలు వెళ్ళవలసి రావడం, సంప్రదాయకళ అనే ఉద్దేశ్యం ప్రజల్లో వుండడం వలన అన్ని ఉత్సవాలలోను ఇతర కళారూపాలతో బాటు, తోలుబొమ్మలాటను కూడాను తప్పనిసరిగా ప్రదర్శించేవారు. మేం కూడా గతంలో ఎన్నోసార్లు అలా తోలుబొమ్మలాట ప్రదర్శనలను ఏర్పాటు చేసాం అప్పట్లో ప్రజలు కూడా ఆసక్తిగా తిలకించేవారు. టీవీ ప్రభావం మాత్రం చాలా వాటితో బాటు ఈ కళకు కూడా సమాధి కట్టేసింది.
ఈ తోలుబొమ్మలాట కళాకారులకు కాకినాడ దగ్గరున్న మాధవపట్నం ప్రసిద్ధి. అలాగే అనంతపురం జిల్లాలో, ఇంకా కొన్ని చోట్ల కూడా ఈ కళాకారులు వున్నారు. వీరిలో ఎక్కువగా మరాఠా ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారే. వీరు చెప్పే కథల్లో ముఖ్యంగా ' లంకాదహనం ' ప్రసిద్ధి చెందింది. ముగ్గురు, నలుగురు కళాకారులు తెర వెనుక బొమ్మల్ని ఆడిస్తూ ఆయా పాత్రల సంభాషణలు, పద్యాలు, పాటలు పలకడం మాత్రమే కాకుండా ఆయా సన్నివేశాలను బట్టి అవసరమైన శబ్దాలను కూడా నోటితో పలికించేవారు. మరికొంతమంది వాయిద్యాలు వాయించేవారు. సాధారణంగా ఈ బృందమంతా ఒకే కుటుంబ సభ్యులతో ఏర్పడి ఉండేది. ఇక తెర మీద ఆయా కథలననుసరించి పాత్రల బొమ్మలతో బాటు వినోదం కోసం కేతిగాడు, జుట్టుపోలిగాడు, బంగారక్క లాంటి హాస్య పాత్రలుండేవి. ఇవి కథతో సంబంధం లేకుండా మధ్య మధ్యలో తెర మీదకు వచ్చి సందర్భం లేని, ముఖ్యంగా సమకాలీన అంశాల మీద చమత్కారాలతో కూడిన సంభాషణలతో ప్రేక్షకులను వినోదపరిచేవి. ఒక్కోసారి కొన్ని మోటు సంభాషణలు కూడా వాడేవారు. ఇప్పుడు ఆ కళకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. ఆ కళాకారులు ఇతర వృత్తులు వెదుక్కోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం శిల్పారామం పేరుతో ఈ కళలను అప్పుడప్పుడైనా ఆదరిస్తుండకపోతే ఈ మాత్రమైనా జీవించి ఉండేది కాదేమో !
అలాంటి తోలుబొమ్మలాట ను ఇక్కడ చూడండి.
టీన్ ఏజ్ ప్రేమ కథతో, కథకు తగ్గ నటీనటులతో, అదీ క్రొత్త వారితో చేసిన ప్రయోగం... జంధ్యాల దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ' ముద్దమందారం '. ప్రదీప్, పూర్ణిమ నాయికనాయకులుగా పరిచయం చేసిన ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది.
నీలాలు కారేనా ?
కూచిపూడి నాట్య వైభవాన్ని నేపథ్యంగా తీసుకుని, ఒక జిప్సీ పిల్లను అద్భుతమైన కళాకారుడిగా తీర్చిదిద్దిన నాట్యాచార్యుని ప్రథానమైన అంశంగా తయారుచేసిన కథతో జంధ్యాల సృష్టించిన చిత్రం ' ఆనందభైరవి '. జాతీయ స్థాయి నటుడు గిరీష్ కర్నాడ్ ప్రథాన పాత్రలో, అప్పటికే ఉత్తరాదిన నాట్య కళాకారిణిగా ప్రసిద్ధి చెందిన మాళవిక సరుక్కాయి కథానాయికగా, ఇంకా ఎంతోమంది రంగస్థల, ఆకాశవాణి కళాకారులతో ఆ చిత్రం నిర్మించారు. ఆ చిత్రం జంధ్యాల కీర్తి కిరీటంలో కలికి తురాయి.
కొలువైతివా... రంగశాయి !
మనదేశంలో అతి సున్నితమైన వివాస్పద అంశం హిందూ ముస్లిం ఘర్షణ. ఆ అంశం ఆధారంగా చిత్రం నిర్మించడానికి పూనుకోవడం ఒక రకంగా సాహసమే ! జంధ్యాల గారు ఆ సాహసానికి పూనుకొని నిర్మించిన చిత్రం ' నెలవంక '. సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే కోరికతో నిర్మించిన ' నెలవంక ' నేలవంక చూసిందని జంధ్యాల గారే మేం ఒకసారి నిర్వహించిన అభినందన సభలో తన సహజ ధోరణిలో అన్నారు. నిజానికి అందులో చమత్కారం కంటే బాధే ఎక్కువగా కనిపించింది. హిందూ జమిందారీ కుటుంబానికి చెందిన అమ్మాయి, ఒక పేద ముస్లిం కుటుంబానికి చెందిన అబ్బాయిల మధ్య ప్రేమ నేపథ్యంలో గ్రామాలలో హిందూ ముస్లిం సంబంధాలు, సోదర భావంతో మెలుగుతున్న వారి మధ్య చిచ్చుపెట్టే స్వార్థపరుల పన్నాగాలు మొదలైన వాటితో అల్లిన కథ ' నెలవంక '. హిందువులకు, ముస్లిములకు కూడా పవిత్రమైనది నెలవంక. ఆ కథ వివాదాస్పదం కాకపోయినా ఇతర కారణాలవల్ల ఆ చిత్రం పరాజయం పాలయింది. కానీ అందులో కొన్ని మంచి ప్రయోగాలున్నాయి. హిందువులు ముస్లిములు కలసి పాల్గొనే ఖవ్వాలీ లాంటి వాటితో బాటు ముస్లిములు ఆడించే ' లంకాదహనం ' తోలుబొమ్మలాట కూడా ఒకటి. పైన ఇచ్చిన తోలుబొమ్మలాట నెలవంక చిత్రంలోనిదే !
ఈరోజు జంధ్యాల గారి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయనలోని మరో కోణాన్ని స్పృశించే ప్రయత్నమిది.
Vol. No. 02 Pub. No. 262
2 comments:
chaala vishayalu trlipinandulaku meeku aneka dhanyavaadaalu
Tolubommalaata oka mahaakala, diinini malli pradarsinchinaa daani pramkhyam taggadu. sahaja siddamayina ii kalanu bratikinchu kovadam telike. Aa kalaakaarulanu prtshisth manci drusyaalu uupisthaaru. neanu oka bamk managr gaa 20 sam. krindata ii prayogam chesi cputunnaanu. Pddalu pdda manassuto prayatnichaali.
Gumma Ramaling Swamu
Post a Comment