అనంతమైన కీర్తి సంపాదించాలని, తమ పేరు దశదిశలా మార్మోగిపోవాలని, ఆ కీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచివుండాలని ఎవరికుండదు చెప్పండి ? అందుకే అందరూ ఆ కీర్తి కోసం తహతహలాడిపోతారు.
కొందరు ఈ విషయాన్ని నేరుగా వప్పుకోరు. ' అబ్బే ! నాకలాంటి కొరికలేమీ లేవండీ ! ఏదో నా జీవనం సాఫీగా గడిస్తే చాలు. మా పిల్లలు చక్కగా స్థిర పడితే అంతకంటే కావాల్సిందేముంటుంది. శేష జీవితాన్ని కృష్ణా, రామా అంటూ గడిపేస్తాను ' అంటూంటారు. వాళ్ళనే మీ గొప్పతనానికి మెచ్చి మీకు సన్మానం చెయ్యాలనుకుంటున్నాం అని చెప్పండి. ' అబ్బే ! సన్మానం చేయించుకునేంత గొప్పతనం నాలో ఏముంది చెప్పండి. ఏదో నా విధి నేను నిర్వర్తించాను. అంతే కదా ! ' అంటూనే పక్కవాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో నాకు సన్మానం చేస్తారట. వద్దన్నా వినడం లేదు అని చెబుతారు. ' పోనీలే ఆయన మొహమాట పడుతున్నాడు. ఈసారికి మరొకరిని వెదుక్కుందాంలే అని మనం అనుకునేలోగా పరోక్షంగా అంగీకారం తెలియజేసేస్తారు. సన్మానమంటే ఎవరికి చేదు చెప్పండి.
ఇంకా కొంతమంది వుంటారు. వాళ్ళకి ఇలాంటి సన్మానాలు, ప్రచారాలు చేయించుకోవాలని కోరిక బలంగా వుంటుంది. కానీ ఎవరిని, ఎలా అడగాలో తెలీదు. తెలిసినా అడిగితే వాళ్ళు ఏమనుకుంటారోనని సంకోచం. ఎవరి వల్లనైనా తమకు ప్రచారం వస్తుందని అనిపిస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతూ వుంటారు, ఎప్పటికైనా గుర్తించి తమకు సన్మానమో, మరోటో చేసి ప్రచారం కల్పిస్తారనే ఆశతో.
మరికొంతమంది వుంటారు. తమకు ప్రచారం కావాలనుకోండి. మీడియా వాళ్ళను పిలిచి ఏదో ఒక విషయం మీద మాట్లాడేస్తుంటారు. ఈ మధ్య మీడియాలో వచ్చిన పోటీ ధోరణి వీళ్ళకు మరింత ఆలంబన. ఒకవేళ వాళ్ళు రారేమోననిపిస్తే ఏ స్టార్ హోటల్ లోనో విందు కార్యక్రమం, ఇతర ఆకర్షణలు ఏర్పాటు చేసి రప్పిస్తారు. మరి తిన్న విశ్వాసం చూపించాలి కదా అందుకే మర్నాడు మీడియాలో ఈయన మాటలు వచ్చేస్తాయి. అవి మామూలుగా వుంటే జనం ఒకసారి చూస్తారు. వివాదాస్పదంగా వుంటే ఇంక చెప్పనక్కర్లేదు. మరో కొన్ని రోజులు మీడియాకు విందు. ఈయనకు పసందు. దీనివలన కలిసొచ్చేది ఏమిటయ్యా అంటే పైకి కారణాలేమి చెప్పినా ఈయనకు అదో తృప్తి.
వీళ్లలోనే మరో రకం. మీడియాను పోగెయ్యలేకపోయినా చుట్టూ పదిమందిని పోగేసి అక్కడ లేని వాళ్ళ గురించో, ప్రపంచ రాజకీయాల గురించో, చరిత్రలో లేని చారిత్రాత్మక విషయాల గురించో..... ఏదో విషయం గురించి మాట్లాడేస్తూ వుంటారు . ఆ విన్న వాళ్ళంతా ' అబ్బో మీకెన్ని విషయాలు తెలుసండీ ! ' అంటూ ఆశ్చర్యపోతుంటే... అబ్బో ..... ఆ సంతృప్తే వేరు.
కీర్తి కండూతికి ఎన్నో అవతారాలు. అందులో మరో అవతారం అంటే మరో రకం వున్నారు. వీళ్ళు తమను తాము గొప్పవాళ్ళుగా వూహించేసుకుని చుట్టూ వున్నవాళ్లు ఆథములని వాళ్ళను వుద్ధరించడానికే తాము అవతరించామని చెప్పుకుంటూ సంతృప్తి చెందుతూ వుంటారు. వంగి వంగి దణ్ణాలు పెట్టే వాళ్ళకు వందలు వందలు సమర్పించుకుంటారు. వళ్లు వంచి పనిచేసే వాళ్ళను తమకు దణ్ణం పెట్టలేదనే కారణంతోనో, మరో కారణంతోనో దూరం చేసుకుంటారు. తమకు బాజా వాయించేవాళ్ళకు పంచభక్ష్య పరమాన్నాలు..... కష్టసుఖాలన్నిటిలో తోడునీడగా నిలిచే కుటుంబసభ్యులకు పచ్చడి మెతుకులు. బయిట అందరూ నా గొప్పతనానికి అడుగడుగునా మెచ్చుకుంటున్నారు, ఇంట్లో మాత్రం వీసమెత్తు విలువలేదు.....ఇదీ వారి ఫిర్యాదు. బయిట వాళ్లయితే తమ స్వార్థం కోసం తప్పనిసరై మెచ్చుకుంటారని, ఇంట్లో వాళ్ళకు అడుగడుగునా మెచ్చుకునే అవసరం లేదని, వాళ్ళకు వీరి పట్ల బాధ్యత వుంటుందే కానీ స్వార్థం కాదనీ అర్థం కాదు. అర్థం అయినా అది ఒప్పుకునేందుకు అహం అడ్డొస్తుంది. ఎందుకంటే పొగడ్తలనే భ్రమలో బతికేస్తుంటారు కదా !
ఈ కీర్తి కండూతి మహా చెడ్డది. దీనిలో పీకలదాకా మునిగిపోయిన వాళ్ళు స్వజనాన్ని దూరం చేసుకుంటారు. ఉన్నదంతా ఊడ్చుకుపోయాక పరజనం దూరం అయిపోతారు. నిజానికి అందరిలోనూ ఈ కీర్తి కండూతి అంతో ఇంతో అంతర్లీనంగా వుంటుంది. కాకపోతే కొంతమంది బయిట పడతారు. కొంతమంది గుంభనంగా వుంటారు. ఎవరైనా తమ స్వార్థంకోసమో, నిస్వార్థంగానో మనల్ని పొగడ్తలతో ముంచెత్తినపుడు వివేకం వుపయోగిస్తే సమస్య వుండదు.
ఏమైనా ఈ కీర్తి కండూతిని తగిన మోతాదులో వాడాలి. శృతి మించితే వికటించి కళ్ళు మూసుకుపోతాయి.... చెవులు వినిపించవు.... బుద్ధి పనిచేయదు.... విచక్షణ నశిస్తుంది. ఆలోపతీ మందుల కంటే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ చాలా వుంటాయి. అన్నీ ఉడిగాక... సర్వం హరించుకు పోయాక జ్ణానోదయం అయినా ప్రయోజనం లేదు. బెల్లంకోసం వచ్చిన ఈగలు అది ఖాళీ అవగానే ఎగిరిపోతాయి. తమని సదా అంటిపెట్టుకుని మంచిచెడ్డల్లో అండగా నిలిచే తన మనుష్యులు దూరం అవుతారు. చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. మనుష్యుల నైజమే అంత అనుకోండి. తమకందుబాటులో వున్నదాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అంతరిక్షంలో వున్నవాటికోసం అర్రులు చాస్తారు.
మనలోని గొప్పతనం వల్లో, మన ప్రవర్తన వల్లో, మన మంచితనం వల్లో కీర్తి దానంతట అది రావడం ఎంత మంచిదో..... కీర్తిని బలవంతంగా తెచ్చుకోవాలనుకోవడం, కొనుక్కోవాలనుకోవడం అంత చెడ్డది.
కీర్తి హానికరం కాదు. కీర్తి కండూతి మాత్రం అత్యంత ప్రమాదకరమైనది. కీర్తికోసం కాక ఒక ప్రయోజనం కోసం కృషి చేస్తే... వస్తే దానంతట ఆదే వస్తుంది. లేకపోతే ఆత్మ సంతృప్తైనా మిగులుతుంది. కేవలం కీర్తికోసం మాత్రమే కృషి చేస్తే చివరకు అది అపకీర్తినే మిగులుస్తుంది.
మనవి : ఈ వ్యాసంతో బాటు మానవ జీవితాల్లో కనిపించే ఇలాంటి విషయాల గురించి నా అనుభవంలో నాకు కలిగిన భావాలకి అక్షర రూపం తేవాలనే వుద్దేశ్యంతో రాయడం ప్రారంభించాను. మనసులో మెదిలినపుడు కొన్ని విషయాలని రాసి పెట్టుకున్నాను. అయితే వాటికి మెరుగులు దిద్ది పూర్తి చేసి ప్రచురించడం ప్రారంభిద్దామనుకునే లోగా మా ఇంటర్నెట్ కనెక్షన్ లో గత నెల 24 వ తేదీ నుంచి సమస్య వచ్చింది. బి.ఎస్.ఎన్.ఎల్. వారితో ఒక రకంగా యుద్ధం చేశాక, జిఎం వరకూ వెళ్ళాక విజయదశమికి ముందురోజు అంటే సుమారు 20 రోజుల తర్వాత పూర్తి పరిష్కారం దొరికి మామూలుగా పనిచేస్తోంది.
ఈలోపు అనుకోకుండా ఇదే ‘ కీర్తి ‘ అనే విషయం మీద ప్రముఖ రచయిత శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు గారు అంతర్జాల పత్రిక ‘ కౌముది ‘ లో అక్టోబర్ 11 వతేదీన ఓ ఆడియో సహిత వ్యాసం ప్రచురించారు. అద్భుతమైన ఉదాహరణలతో వున్న ఆ మహానుభావుడి వ్యాసం ఇక్కడ చదవండి. గొల్లపూడి గారికి, కౌముది వారికి కృతజ్ణతలతో......
Vol. No. 02 Pub. No. 040
3 comments:
భలే.
మీరు సినిమాపాత కబుర్ల సేకరణలే కాకుండా ఇలాంటి ఒడియాల్లా కరకరలాడే ఒరిజినల్ కంటెంటు రాయాలని కోరేవాళ్ళల్లో నేనొకణ్ణి.
ప్రతీ టపా కాకపోయినా వారనికొకటయినా మీ సొంత వాక్యం రాయండి.
భలే చెప్పారు రావు గారు. చివరి పేరా చాలా నచ్చింది.
అప్పుడప్పుడు నాబ్లాగ్ గురించి నేను ఆలోచించినపుడు "ఇలా బ్లాగులు రాసేసి స్టాట్స్ కౌంటర్ లు పెట్టుకుని చూసుకుంటూ, కామెంట్లు లెక్కెట్టుకొని సంతోషిస్తూ ఉండటం కూడా కీర్తికండూతిలో మరో రకం అని నేను అనుకుంటూంటాను. కానీ ఆ ఎఱుకలో ఉండి అదుపులో ఉంచగలిగినంతకాలం ఈ కీక హానికరం కాదులెమ్మని నాకు నేనే మళ్ళీ సర్ధి చెప్పుకుంటాను.
* కొత్తపాళీ గారూ !
తప్పకుండా ప్రయత్నిస్తాను. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
* వేణు శ్రీకాంత్ గారూ !
కౌంటర్లు పెట్టుకోవడం, కామెంట్లు లెక్కపెట్టుకోవడం కీర్తి కండూతి కింద రాదండీ ! అవి కొలమానాలు, హెచ్చరికలు. మన టపాలను విమర్శిస్తూ రాసిన వారిని ద్వేషించడం, మెచ్చుకున్నవారిని మాత్రమే ఇష్టపడడం లాంటివి కీర్తి కండూతి లక్షణాలనుకుంటాను. ధన్యవాదాలు.
Post a Comment