Friday, October 8, 2010

ఓ ఆచూకీ కథ

 ఇప్పుడు ఈ ఇంటర్నెట్ కాలంలో సోషల్ సైట్ల ద్వారా, ఇతర మార్గాల ద్వారా, ఇదిగో ఇలా బ్లాగుల ద్వారా కూడా ఎప్పుడో విడిపోయిన, దూరమైన కుటుంబ సభ్యుల, స్నేహితుల, బంధువుల ఆచూకీలు తెలియడం జరుగుతోందని తరచుగా వింటున్నాం. అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా విడిపోయిన వ్యక్తుల్ని మా ఛానల్ కలిపిందని కనీసం ఓ వారం పాటు ఊదరగోట్టడం మనందరికీ తెలుసు. ఇదంతా సాంకేతిక పురోగతి పుణ్యం.
 కానీ ఉత్తరాల కాలంలో అదీ రవాణా వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని కాలంలో ఇలా విడిపోయిన వాళ్ళ ఆచూకీ దొరకడమంటే దాదాపు అసాధ్యంగా ఉండేది. వార్తా పత్రికలు, రేడియో లాంటివి వున్నా ఈ విషయంలో వాటి ఉపయోగం చాలా తక్కువే !
అలాంటిది 1938 వ సంవత్సరంలో ఓ సినిమా ద్వారా పారిపోయిన కొడుకు ఆచూకీ కనుగొనగలిగారు ఓ తల్లిదండ్రులు. ఆ విశేషాలు.....

అప్పటి మద్రాసులోని జార్జ్ టౌన్ లోని రోడ్ మీద రోహిణి పిక్చర్స్ వారి ' గృహలక్ష్మి ' చిత్రం షూటింగ్ జరుగుతోంది. అప్పట్లో మద్రాసులో ట్రాం బళ్ళు  ఉండేవి. దర్శకులు హెచ్. ఎం. రెడ్డి గారు కన్నాంబ పై ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఆమె ట్రాం బండి తో బాటు ఏడుస్తూ పరుగెత్తే సన్నివేశం ఆది. చుట్టూరా జనాలు. సహజత్వం కోసం దర్శకులు ఆ జనాల మధ్యలోనే కన్నాంబను పరుగెత్తమన్నారు.
జనాలకు సూచనలు చేస్తూ రెడ్డి గారు ' మీరెవ్వరూ కెమెరా వంక చూడొద్దు. అలా ఎవరైనా చూసారో ల్యాబ్ కెళ్ళాక నెగెటివ్ లో వారి ముఖం మీద సూదితో ఒక ఏసిడ్ చుక్క వేస్తాను. వారి ముఖం సినిమాలో కనిపించకుండా పోతుంది. జాగ్రత్త ' అని హెచ్చరించారు. దాంతో అందరూ భయపడి కెమెరా వంక చూడక పోయినా అక్కడ ఓ తివాచీలు అమ్మే దుకాణం దగ్గర స్టూల్ మీద కూర్చున్న ఓ కుర్రాడు మాత్రం కెమెరా నే తదేకంగా చూడసాగాడు.
తర్వాత ఆ చిత్రం విడుదల అయ్యాక కడప లో ఆ చిత్రం చూస్తున్న ఒకాయన ఆ సన్నివేశం చూస్తూ ఆ కుర్రాడు తన కొడుకుగా గుర్తించాడు. అప్పటికి సంవత్సరం క్రితం స్కూల్ ఫైనల్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో భయపడి ఆ అబ్బాయి ఇల్లు వదిలిపెట్టి మద్రాస్ పారిపోయాడు. హెచ్. ఎం. రెడ్డి గారి ' గృహలక్ష్మి ' పుణ్యమాని అతని ఆచూకీ దొరికింది. ఆ తండ్రి ఆనందంతో మద్రాస్ వెళ్ళి తివాచీ దుకాణంలో పనిచేస్తున్న కొడుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. 
అదీ ఓ ఆచూకీ కథ. తెలుగు సినిమా ఆవిర్భవించిన దశకంలోనే సినిమా వల్ల ఒనగూడిన సాంఘిక ప్రయోజనం.

Vol. No. 02 Pub. No. 034

5 comments:

రాణి said...

very interesting.

కంది శంకరయ్య said...

ఆసక్తికరమైన విషయం. ధన్యవాదాలు.

kusuma said...

కన్న కొడుకును తండ్రితో కలిపిన "గృహ లక్ష్మి"కి ధన్యవాదాలు !

రామా రావు, దాసరి మున్నగు వారి చిత్రాల ప్రభావంతో విడిపోయిన సంసారాలు ( అత్తా కోడళ్ళూ, తల్లీ కొడుకులూ, తల్లి దండ్రులూ) మళ్ళీ కలిశారు.
ఈ అంశంతో విపులంగా వ్యాసాలను మీ కలం నుండి ఆశిస్తూన్నాము.

ఆ.సౌమ్య said...

excellent, very interesting!

SRRao said...

* రాణి గారూ !
* శంకరయ్య గారూ !
* కుసుమ గారూ !
* సౌమ్య గారూ !
అందరికీ ధన్యవాదాలు. @ కుసుమ గారూ ! అలాంటి ఉదంతాలు నేను కూడా విన్నానండీ ! అయితే సరైన వివరాలు లేవు. అయినా సేకరించడానికి ప్రయత్నిస్తాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం