
అందరికీ మామ చందమామ అయితే తెలుగు ప్రేక్షక శ్రోతలకు మాత్రం మామ అంటే కె. వి. మహదేవన్. ఎన్నో వైవిధ్యభరితమైన గీతాలకు జీవం పోసిన మహదేవన్ చలనచిత్ర రంగ ప్రవేశం నల్లేరు మీద బండి నడక కాలేదు. ఆయన ఈ స్థాయికి చేరడానికి ఎంతో కృషి వుంది. మరెంతో పట్టుదల వుంది. ఆయనవి రెడీమేడ్ బాణీలు కాదు. టైలర్ మేడ్ బాణీలు. టైలర్లు రచయిత, దర్శకుడు అయితే మామ కుట్టు ( కూర్పు ) యంత్రం మాత్రమే ! ఆయన బాణీలు అంతలా సాహిత్యంలో ఒదిగిపోతాయి. సన్నివేశంలో.... సందర్భంలో అమరిపోతాయి. అందుకే తెలుగు వారి గుండెల్లో మామ సజీవంగా ఇప్పటికీ నిలిచిపోయారు.
1918 లో కేరళ రాష్ట్రంలో జన్మించిన మహదేవన్ తాత, తండ్రి గార్లు తిరువాన్కూర్ సంస్థానంలో భాగవతార్లుగా ఉండేవారు. ఆ వాసన మామకు అంటింది. లలిత కళల మీద ఆసక్తి పెరిగింది. ఫలితంగా సెకండ్ ఫారం తోనే చదువు అటకెక్కింది. పద్నాలుగవయేట ఆయన్ని మద్రాస్ బండెక్కించింది.
మద్రాస్ వస్తూనే ఆయన బాలగంధర్వ గానసభ అనే సంస్థలో చేరారు. అక్కడ నాటకాల్లో ఎక్కువగా స్త్రీ వేషాలు వేసేవారు. అప్పటికే అక్కడ సుమారు 150 మంది వరకూ పిల్లలు ఉండేవారు. ఒకసారి వారంతా కలసి ఓ నాటక ప్రదర్శన కోసం కాంచీపురం వెళ్ళారు. అక్కడ ప్రదర్శన సమయంలో అనుకోకుండా ఏదో వివాదం చెలరేగింది. ఆది పెద్ద గొడవకు దారి తీసింది. పిల్లలందరూ భయపడి పారిపోయారు. మహదేవన్ గారు మిగిలిపోయారు. తిరిగి మద్రాస్ వెళ్ళడానికి డబ్బులు లేవు. ఏం చెయ్యాలో పాలుపోలేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది ఆయనకు.... తన చొక్కాకు మూడు బంగారు బొత్తాములు వున్నాయని. వాటిని అమ్ముకుని మద్రాస్ చేరుకున్నారు. అలా ప్రారంభమైన ఆయన మద్రాస్ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ఎన్నెన్నో అవతారాలు ఎత్తారు.
ఆ క్రమంలో ఓ తమిళ చిత్ర నిర్మాణ సంస్థలో నెల జీతానికి చేరారు. వాళ్ళు తాము తీస్తున్న ఓ చిత్రంలో ఆయనకు ఓ సన్నివేశంలో కథానాయకుడి వెనుక విగ్రహంలా నిలబడే వేషం ఇచ్చారు. కాళ్ళు చేతులు కదపకూడదు. కనీసం రెప్ప కూడా వేయకూడదు. షూటింగ్ ప్రారంభమైంది. మహదేవన్ నిజమైన శిల్పంలా నిలబడ్డారు. కదలడం లేదు. మెదలడం లేదు. అలా వుంటే చేప్పుకోవడానికేముంది. ఇంతలో ఓ ఈగ వచ్చి ఆయన ముఖం మీద వాలింది. దురద పెడుతోంది. అయినా కదలడానికి వీలులేదు. చిత్రీకరణ జరుగుతోంది. చాలాసేపు ఓర్చుకున్నారు మహదేవన్. ఇంక ఆయన వల్ల కాలేదు. ఒక్కసారి ముఖం అటూ ఇటూ కదిపారు. ఈగ పారిపోయింది.... మహదేవన్ గారి ఉద్యోగం ఊడిపోయింది.
మన మనస్సుల్లో మామగా తిష్ట వేసేంత స్థాయికి రావడం ఆయనకు నల్లేరు మీద బండి నడక కాలేదు. ఇలాంటి ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు. ఎంతో కృషి, పట్టుదల ఆయన్ని ఈ స్థాయికి చేర్చాయి. భౌతికంగా ఆయన ఇప్పుడు లేకపోయినా ఆయన సంగీతం రూపంలో మన హృదయాల్లో ఇప్పటికీ సజీవంగానే వున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలు తన బాణీలతో మనల్ని అలరించి ఇక స్వర్గ లోకంలో తన సంగీతామృతాన్ని పంచడానికి 2001 జూలై 21 న వెళ్ళిపోయారు.
స్వరబ్రహ్మ మామ కె. వి. మహదేవన్ వర్థంతి సందర్భంగా ఆయనకు స్వరనీరాజనాలు అర్పిస్తూ.......
మామ జన్మదినం సందర్భంగా గతంలో రాసిన టపా, ఆయన గీతాలలో కొన్నిటిని పరిచయం చేసిన కదంబం మీకోసం .........
మామ పుట్టినరోజు
మనవి : బ్లాగర్ లో రోజుకోక్కొక్కటి చొప్పున మాయమై పోతున్నాయి. మొన్న తెలుగు బొత్తాము మాయమైపోయింది. ఇప్పుడు మిగిలిన వాటిలో చాలా వరకూ మాయమైపోయాయి. కనిపించేవి కొన్ని పనిచెయ్యడం లేదు. కారణం ఏమిటో తెలీదు. మామ గురించి ముందే రాసి భద్రపరచి, షెడ్యూల్ చేసిపెట్టిన టపా మాయమైపోయి శీర్షిక మాత్రం మిగిలింది. ఈరోజు చూస్తే శీర్షిక మాత్రమే ప్రచురించబడింది. ఇది నా ఒక్కడి సమస్యే కాదనుకుంటాను. ఏమైనా ఇప్పటివరకూ నా బ్లాగు సందర్శించిన వీక్షకులకు కలిగిన అసౌకర్యానికి క్షంతవ్యుడిని. అందుకే మళ్ళీ రాసి ప్రచురిస్తున్నాను. ఇది వేరే చోట భద్ర పరుచుకోకపోవడం వలన ముందు రాసింది గుర్తు తెచ్చుకుంటూ రాయవలసి వచ్చింది. ఇప్పుడు ఈ టపా పాత ఎడిటర్ లో రాసాను.
Vol. No. 02 Pub. No. 286
2 comments:
very nice collection of songs sir, ఏ పాట ఇష్టమో చెప్పలేకుండా ఉంది .... అంత mesmarising మ్యూజిక్ వారిది... నాకు అత్యంత ఇష్టమైనది మాత్రం "మూగమనసులు" లోని 'ముద్దబంతి పూవులో' అనే సాంగ్.. అంటే అదొక్కటే అని కాదు ఇంకా చాల ఉన్నాయి .. tq for sharing sir..
పల్లవి గారూ !
ధన్యవాదాలు
Post a Comment