Monday, July 18, 2011

ఎస్వీ - యశస్వి

అభినయంలో విలక్షణత
వాచికంలో సరిగమలు 
రూపంలో నిండైన విగ్రహం
హుందాతనం నిండిన హావభావాలు

..... ఇవన్నీతెలుగు ప్రేక్షకులకు కనువిందు చేసిన విశ్వనట చక్రవర్తి  సామర్ల వెంకట రంగారావు స్వంతం.

" ఎస్వీరంగారావు స్థానం భర్తీ చెయ్యాలనుకోవడం దురాశ. అది వృధా ప్రయాస " అనేవారు రావుగోపాలరావు గారు.

నిజమే ! సునాయాసంగా, ప్రవాహంలా పలికే ఆ సంభాషణా చాతుర్యం ఎవరికి వస్తుంది ? ఆ పదాల విరుపు, ఉచ్చారణలో స్పష్టత ఎంతమంది సాధ్యం ? ఏ పాత్ర ధరించినా ఆ పాత్రలో ఇమడగలిగే సామర్థ్యం ఇంకెవరికైనా సాధ్యమా ? ఇంకెవరినైనా ఆ స్థానంలో ఊహించుకోవడం సాహసమే అవుతుంది.

1964 లో జకార్తాలో జరిగిన ఏఫ్రో ఏషియన్ చలన చిత్రోత్సవంలో ' నర్తనశాల ' చిత్రంలో కీచకుడిగా ఆయన నటన అందర్నీ ఆకట్టుకుంది. ఆ పాత్రతో తెలుగు చలనచిత్ర ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశారు రంగారావు గారు. విదేశీ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటుడి బహుమతి పొందిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. ఆంగ్ల చిత్రాల్లో నటించాలనేది ఆయన తీరని కోరిక. విదేశాల్లో ఆయన నటనను గుర్తించినా స్వదేశంలో తగినంత గుర్తింపు రాలేదనే బాధ ఆయనలో వుండేది.

" నేను బ్రతికుండగా ఎవరూ గుర్తించకపోయినా చనిపోయాక మాత్రం తప్పక గుర్తిస్తారు. భావి తరాలు నా సినిమాలు చూసి నేర్చుకోవలసింది ఎంతో వుంది " అనేవారు రంగారావు గారు. అదీ ఆయన ఆత్మవిశ్వాసం.

ఎస్వీయార్ నటన మాత్రమే కాదు.... అప్పుడప్పుడు కవితలు కూడా రాసేవారు. ఆయన రాసిన ఓ కవితాశకలం.......

ఉన్నారు పెద్దలెందరో 
చెప్పలేరు కారణంబింతైనా
మరణంబే వచ్చిన నాడు
కరుణించడు భగవంతుడైనా ...

 విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు గారి వర్థంతి సందర్భంగా నివాళులు ఆర్పిస్తూ........  

ఈ నెల 3 వ తేదీ ఆయన జయంతి సందర్భంగా రాసిన టపా........ 

విశిష్ట నట యశస్వి

 గతంలోని టపాలు......... 



Vol. No. 02 Pub. No. 283

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం