Saturday, July 16, 2011

మర్యాదంటే......

 కొంతమంది ఎంత ఎదిగినా ఒదిగే వుంటారు. మరికొందరు ఏమాత్రం ఎదగకపోయినా మిడిసి పడుతూనే వుంటారు. వినయ విధేయతలు, మర్యాద మన్ననలు జన్మతః రావాలి. కృత్రిమంగా తెచ్చుకునేవి కావు. అందుకే అంటారు... ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని, అన్నీ వున్న ఆకు అణిగి వుంటుందని.

మన చుట్టూ వుండే చాలామందిలో మొదటి తరగతికి చెందినవారే ఎక్కువగా
కనిపిస్తారు. వాళ్ళకి తమకున్న అర్హతలేమిటో తమకి తెలియక పోయినా ఎదుటివారు వారు మాత్రం వారికి మనుష్యుల్లా కనబడరు. ఈ సమాజంలో తామే ఉన్నతులమని, మిగిలిన వాళ్ళందరూ అధములని వారి భావన. తాము లేకపోతే ఏ పనీ జరుగదని, ఇంకెవ్వరికీ ఆ పనులు చెయ్యడం చేతకాదని వారి విశ్వాసం. అందుకే వారికి తమ చుట్టూ వున్న వారికి కనీస విలువ, మర్యాదలు ఇవ్వాలనే విచక్షణ వుండదు. కానీ ఉన్నత వ్యక్తిత్వం కల వారు ఎంతటి ఉన్నత పదవిలో వున్నా మర్యాద మన్ననలు మరచిపోరు. వారి వలన ఆ పదవీకే గౌరవం వస్తుంది. అలాంటి వారిలో అగ్రగణ్యుడు అమెరికాకు 16 వ అధ్యక్షునిగా పనిచేసిన అబ్రహం లింకన్. ఆయన మర్యాద మన్ననల గురించి తెలిపే ఓ సంఘటన..........

అబ్రహాం లింకన్ అధ్యక్షునిగా పనిచేస్తున్న కాలంలో ఓసారి పురవీధుల్లో గుర్రపు బగ్గీలో వెడుతున్నారు. ఆయన వెంట ఆయన మిత్రుడోకరు కూడా వున్నారు. కొంతదూరం వెళ్ళిన తర్వాత దారిలో వారికొక ముసలి నీగ్రో ఎదురయ్యాడు. మాసిపోయి, చినిగిపోయిన దుస్తులతో శరీరమంతా దుమ్ముకొట్టుకుపోయి దీనంగా వున్నాడు. అధ్యక్షుణ్ణి చూడగానే ఆ నీగ్రో వినయంగా తన చిరిగిన టోపీని తల మీదనుంచి తీసి అభివాదం చేశాడు. వెంటనే లింకన్ ఆ బగ్గీలోనే లేచి నిలబడి తన టోపీ తీసి ఆ నీగ్రోకు ప్రత్యభివాదం చేశాడు. 

ఇది లింకన్ మిత్రునికి ఆశ్చర్యం కలిగించింది. " అదేమిటి లింకన్. నువ్వు ఈ దేశాధ్యక్షుడివి. ఒక నీగ్రో ముసలి వాడికి నువ్వు అభివాదం చెయ్యడమేమిటి ? " అని అడిగాడు. 

దానికి అబ్రహాం లింకన్ " మర్యాద, మన్ననలో నాకంటే ఎవరూ ఎక్కువ కాకూడదని నా సిద్ధాంతం. ఇప్పుడు ఆ నీగ్రోకు నేను ప్రత్యభివాదం చెయ్యకపోతే నాకంటే అతనే మర్యాదస్తుడు, సంస్కారవంతుడు అవుతాడు. ఒక సామాన్య వ్యక్తి దేశాధ్యక్షుని కంటే గొప్ప సంస్కారవంతుడు అనిపించుకుంటే ఇంక ఆ పదవికేమి గౌరవం వుంటుంది ? ... ఆ దేశానికేమీ గౌరవం వుంటుంది ? అందుకే అలా చేశాను " అన్నారట. 

ఈ స్థానంలో ఒక్కసారి మన నాయకులను ఊహించండి.

Vol. No. 02 Pub. No. 281

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం