Friday, September 9, 2011

ప్రజాకవి ' గొడవ '

సత్యాహింసల 
  యేబదేండ్ల కృషి 
క్షణంలో 
  అయిపోయెను మసి

బాపూజీ బ్రతికిన యప్పటి 
సత్యహింసల దుప్పటి 
బొంకుల బొంతగా మారెను 
ఘనతలు శాంతము దీరెను 

ఉదయం కానే కాదనుకోవడం నిరాశ 
ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ 
ఈ చీకటి వుండదు 
సూర్యుడు తప్పక ఉదయిస్తాడు  

మాయలోకము మాయజనుల 
మనసులో గల మాటయొకటి
పైకి నుడివెడి పలుకు ఒకటి 
చేయదలచిన చేష్ట యొకటి 


      అవనిపై జరుగేటి అవకతవకలు జూచి 
      ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు 

పరుల కష్టముజూచి కరగిపోవును గుండె 
మాయమోసము జూచి మండిపోవును ఒళ్ళు 
పతిత మానవుజూచి చితికిపోవును మనసు 
       ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు

అవకతవకలు నేను సవరింపలేనపుడు
" పరుల కష్టాలతో పనియేమి మాక " నెడు
అన్యులను గనియైన హాయిగా మనలేను 
       ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు


 ........... ఇదీ కాళోజి ' గొడవ ' . ఆయనదెప్పుడూ వ్యవస్థతో  గొడవ పడే తత్వమే  ! 
 ఆయన జీవితమే ఉద్యమం. ఉద్యమమే ఆయన ఊపిరిగా జీవించాడు. 

అవినీతి, అన్యాయం పెచ్చుమీరినప్పుడు
దౌర్జన్యం, దుర్మార్గం హద్దు మీరినప్పుడు
మానవత్వం మృగ్యమైనప్పుడు
మనిషి మనిషిగా జీవించలేనప్పుడు

ఆయన కెరటమై నిలువెత్తు పొంగాడు
ఆయన ఉద్యమమై ఉవ్వెత్తున లేచాడు
కలాన్ని ఖడ్గంగా చేసాడు
ఫల్గుణ శక్తితో విజృంభించాడు

తెలంగాణా వైతాళికుడు కాళోజి
మాటలలో, చేతలలో, వేషభాషలలో
మూర్తీభవించిన తెలంగాణా కాళోజి

నేను ప్రపంచ పౌరుడినన్న  కాళోజికి
తెలంగాణా అంటే అంతులేని అభిమానం
రవీంద్రునిలా అది దురభిప్రాయం కాదు

తన భాష, తన ప్రాంతం, తన ప్రజలు
అభివృద్ధి చెందాలనేది ఆయన ఆశయం
అందుకోసమే ఉద్యమించాడు

" ఇప్పటి కవులందరూ సూత్ర పారాయణ వరకే...
 నా, మా, మన అనే దశలను పూర్తి చేసినపుడే కవి పరిపూర్ణుడవుతాడు. ఇక్కడ నా..  అంటే నేను. మా.. అంటే
తన భార్యాపిల్లలు అని. మన.. అంటే మనందరం అని అర్థం. ఈ స్థాయిలో కవిత్వం రాసినప్పుడే అది ముందడుగు అవుతుంది. ఈ క్రమంలో నేను ' నా ' దాటి ' మా ' దగ్గరనే వున్న. అలాగే ఇప్పుడున్న కవులందరూ అక్కడే ఆగారు. కానీ ప్రభుత్వానికి నేరుగా వ్యతిరేకంగా రాసింది గరిమెళ్ళ సత్యనారాయణ ఒక్కడే ! అట్లాంటి కవులు ఇంకా రావాలే ! " అనేవారు కాళోజి.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ప్రముఖకవి దాశరథితో బాటు కాళోజి కూడా పాల్గొన్నారు. కాళోజీ రచించిన ' నా గొడవ ' కావ్యం మొదటి మూడు ప్రచురణలకు దాశరథి పీఠికలు రాసారు.

" కాళోజీ ఇరవదవ శతాబ్దంలో తెలంగాణా ప్రప్రథమ ప్రజాకవి. కాళోజీ అనగా కల్లలకూ, కపటాలకూ లాలూచీ పడని జీవితం అని అర్థం. అతని గేయాలకు గానీ, అతనికి గానీ అర్థం చెప్పవలసిన అవసరమే లేదు. అసలు అవే అర్థంకాని ఈ సమాజపు మహొద్గ్రంథానికి విపుల టిప్పణి వంటివి " అన్నారు దాశరథి మొదటి ప్రచురణలో. 

' నా గొడవ ' మొదటి ప్రచురణ ఆవిష్కరణ సందర్భంలో మహకవి శ్రీశ్రీ మాట్లాడుతూ ...

" కాళొజీ నిఖిలాంధ్ర కవి. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివినవారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ " అని ప్రస్తుతించారు. 

ప్రజా ఉద్యమాలకోసం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే కాళోజీ జీవించారు.

ప్రజాకవి కాళన్న జయంతి సందర్భంగా నివాళులు  అర్పిస్తూ......



Vol. No. 03 Pub. No. 029

3 comments:

Raamu said...

bagundi andi

vivek said...

Jai Telangana...Jai Kaloji...:)...

SRRao said...

* రాము గారూ !
* వివేక్ గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం