Thursday, September 8, 2011

వయసును జయించిన ఆశా

1962 వ సంవత్సరంలో  అమరవీరుల సంస్మరణ దినం రోజున మన దేశ రాజధానిలో ఏర్పాటయిన కార్యక్రమానికి రావాల్సిందిగా బొంబాయి ( ఇప్పటి ముంబై ) లోని ఇద్దరు గాయనీమణులకి ఆహ్వానం అందింది. వారి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సరిగా బయిలుదేరేముందు ఒక చిన్న మార్పు జరిగింది. ఇద్దరు కాదు ఒకరే ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారని. దాంతో ఒకరు ఆగిపోయారు. మరొకరు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు సమక్షంలో ప్రముఖకవి ప్రదీప్ రాసిన, సి. రామచంద్ర స్వరపరచిన ' అయ్ మేరె వతన్ కే లోగోం.... ' అనే పాటను పాడి అక్కడ హాజరైన వారినే కాక దేశ ప్రజలందరినీ ఉత్తేజపరిచారు. 

అంత అద్భుతమైన పాటను మరింత అద్భుతంగా పాడిన ఆ గాయని భారత కోకిల లతామంగేష్కర్. ఆమెతో బాటు వెళ్ళకుండా ఆపివేయబడ్డ రెండవ గాయని ఆశాభోస్లే. స్వయానా లత చెల్లెలు. ఎంతవారైనా డబ్బు, కీర్తికి దాసులని ఈ సంఘటన నిరూపిస్తుంది. అలా అక్క నీడలో ఎదుగూ బొదుగూ లేకుండా ఉండడానికి ఆశా ఇష్టపడలేదు. అందుకే ఏటికి ఎదురీదారు. అక్కతో చాలాకాలం విబేధించినా ఆమెపై గౌరవం కొంచెం కూడా సడలలేదు ఆశాలో. అందరూ అడుగడుగునా ఆమె గానాన్ని లతతో పోల్చి చూడడం ఆమెకేమాత్రం ఇష్టముండేది కాదు. అందుకే తనకంటూ ఒక బాణీని ఏర్పరుచుకుంది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. తన స్వరంతో ఎన్నో ప్రయోగాలు చేసింది. 

 మహారాష్ట్రలో సంగీత కుటుంబమైన మంగేష్కర్ కుటుంబంలో జన్మించిన ఆశా పదవ ఏటనే మరాఠీ చిత్రం ద్వారా చిత్రంలో పాట పాడి రంగ ప్రవేశం చేసింది. తర్వాత హిందీలో అడుగుపెట్టి తొలిరోజులలోనే సోలో పాటకు అవకాశం దక్కించుకుంది. అయితే అప్పుడు హిందీ సినిమా లోకానికి, ముఖ్యంగా సంగీత దర్శకులకు లతాయే దిక్కు. ఆవిడ కటాక్షంకోసం ఎదురుచూస్తూ కూర్చునేవారు తప్ప కొత్తవారిని ప్రోత్సహించేవారు కాదు. ఆ ప్రభావం ఆశ పైనా కూడా పడింది. చాలాకాలం పాటలు పాడుతూ వున్నా అవి కేవలం క్లబ్ పాటలో, లత పాడని పాటలో పాడేది. ఆమె గళంలోని ప్రత్యేకతను గుర్తించింది ఓ.పి. నయ్యర్ అయితే ప్రయోగాలు చేయించింది మాత్రం సి. రామచంద్ర. వారిద్దరి సంగీత దర్శకత్వంలో ఆశ ఎన్నో వైవిధ్యభరితమైన పాటలు పాడింది. ఆ విధంగా ఆమె స్వరంలోని ప్రతిభ నిజంగా వెలుగు చూడడానికి మూడు దశాబ్దాలు పట్టింది. అక్కడనుంచి ఆమె గళానికి ఎదురు లేకుండా పోయింది. ప్రముఖ సంగీత దర్శకులందరూ ఆమెతో పాడించారు. 

1966 లో వచ్చిన తీస్రీ మంజిల్ చిత్రం ఆమె జీవితాన్ని మరోమలుపు తిప్పింది. ఆర్. డి. బర్మన్ తో అనుబంధానికి నాంది పలికింది. వాళ్ళిద్దరి కలయికలో ఎన్నో అద్భుతమైన పాటలు పుట్టుకొచ్చాయి. అంతకుముందు చాలాకాలం క్రితమే ఆమె వైవాహిక జీవితం విఫలమయింది. ఆ సంఘటనే ఆమెను కష్టాలలోకి నెట్టింది. కుటుంబాన్ని పోషించుకోవాల్సిన అవసరం ఏర్పడడంతో తనకు తెల్సిన సంగీతాన్నే నమ్ముకుంది. చివరకు ఆ సంగీతమే ఆమెను అందాలాలెక్కించింది. ఆర్. డి. బర్మన్ కి దగ్గర చేసింది. ఫలితంగా మరోసారి ఆమె జీవితంలో పెళ్లి బాజాలు మ్రోగాయి. అయితే ఈ జీవితం కూడా సాఫీగా సాగలేదు. కాలంతో పోటీపడలేక బర్మన్ ఆగిపోతే, యువగాయకులతో పోటీపడుతూ, యువసంగీత దర్శకుల ఆధునిక పోకడలను తన గళంలో నింపుకుంటూ... సాగిపోతున్న ఆమె జైత్రయాత్రను చూసి బర్మన్లో పురుష సహజమైన అసూయలాంటిది బయిల్దేరింది. దాంతో ఆయనతో జీవించి వున్నప్పుడు, ఆయన మరణించాక వారసులతో అనేక కష్టాలను ఎదుర్కొంది. అయినా ధైర్యం సడలలేదు. వయసును జయించిన ఆమె గళం రీమిక్స్ లు, పాప్ ఆల్బంలూ అంటూ డెబ్భై ఆరేళ్ళ వయసులో కూడా అప్రతిహతంగా ముందుకు సాగిపోతోంది.

 గాయని  ఆశాభోస్లే జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తూ..... 
Vol. No. 03 Pub. No. 028

4 comments:

Gomati Dittakavi Jonnalagadda said...

Jab chali tandi hava..Jab uthe kaali Ghata
hum ey jaane wafa tum yaad aye ..
one of my all time favorite song of Ashaji...And all the songs of Ashaji with OP Nayyar are super hits. Thanks for reminding one great singer and equally great human being. God Bless.
Gomati

Vinay Datta said...

She gives life to all the song she renders. All the songs give new enthusiasm to the listeners.

madhuri.

Ramachary Bangaru said...

కోట్లాదిమందిని తన గానామృతంతొ ఓలాండించినవారు వయస్సును మాత్రం జయించడంలొ వింతేముంది. ఆశా గారిని ఈవిధంగా పరిచయం చేసిన మీకు దన్యవాదాలు.

SRRao said...

* గోమతి గారూ !
* మాధురి గారూ !
* రామాచారి గారూ !

ధన్యవాదాలు

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం