నా జీవితంలోకి మేఘాలు వచ్చింది వర్షాన్ని మోసుకొచ్చేందుకో, తుఫానుకు సూచిక గానో కాదు. నా సంధ్యా సమయ ఆకాశంలో వర్ణాలు నింపడానికే అవి వచ్చాయి !
నా ఆశావాదానికి నాదైన వాదన వుంది. ఒకదారి మూసుకుపోతే మరోదారి తెరుచుకుంటుంది...లేదా నేనే మరో దారి ఏర్పాటు చేసుకోగలను.
మన ప్రతిమ మట్టిలో కలసి శిదిలమైపోవడం... దేముడు సృష్టించిన మట్టి గొప్పదనాన్ని నిరూపించడానికే !
మనలోని ఉన్నతమైన వినయమే మనల్ని ఉన్నత శిఖరాలవైపు నడిపిస్తుంది..
బెంగాలీ సాహిత్యాన్ని, సంగీతాన్ని ఒక అద్భుతమైన మలుపుతిప్పిన మహనీయుడు గురుదేవుడు రవీంద్రనాథ్ టాగోర్ కలం నుంచి జాలువారిన కొన్ని ఆణిముత్యాలు అవి.
అతి సున్నితమైన, అందమైన, తాజాదనం నిండిన పద్యాలతో కూడిన ' గీతాంజలి ' సృష్టికర్త రవీంద్రుడు.
యూరప్ నుంచి కాక ఇతర దేశాల నుంచి తొలిసారి నోబెల్ పురస్కారం అందుకున్న వ్యక్తీ రవీంద్రుడే !
ఒకటిన్నర శతాబ్దం క్రితం కలకత్తాలో సంపన్న కుటుంబంలో జన్మించిన రవీంద్రనాథ్ టాగోర్ ఎనిమదవ ఏటనే రచనలు చెయ్యడం ప్రారంభించారు. పదహారవ యేట ' భానుసింగో ' అనే కలం పేరుతో రాసిన కవిత్వం ప్రచురితమయింది. బ్రిటిష్ పాలనను వ్యతిరేకించి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. అమృత్ సర్ లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్మార్గానికి నిరసనగా బ్రిటిష్ ప్రభుత్వం 1915 లో ప్రకటించిన నైట్ హుడ్ బిరుదుని తిరస్కరించారు.
ప్రాక్పశ్చిమ సిద్ధాంతాలను మిళితం చేసే ఆలోచనతో ఒక ప్రయోగాత్మక పాఠశాల ప్రారంభించిన ఆయన 1921 లో దానిని విశ్వభారతి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేసారు.
కవిగా, నవలాకారుడిగా, లఘుకథల రచయితగా, వ్యాసకర్తగా, నాటకకర్తగా, ప్రయోక్తగా, విద్యావేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా, పండితుడిగా, అంతర్జాతీయవేత్తగా, చిత్రకారుడిగా, సంస్కృతీ పరిరక్షకుడిగా, ఉపన్యాసకారుడిగా, సంగీతకర్తగా, గీతరచయితగా, గాయకుడిగా, కళాకారుడిగా....... ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా మన్ననలు అందుకున్నారు రవీంద్రనాథ్ టాగోర్.
రవీంద్రుని గీతం ' జనగణమన ' భారత జాతీయ గీతంగా ఎన్నుకోవడంతో బాటు ఆయన మరో గీతం ' అమర్ సోనార్ బంగ్లా ' బంగ్లాదేశ్ జాతీయగీతంగా ఎన్నుకోబడడం ఆయన రచనలకు లభించిన అరుదైన గౌరవం.
ఇంతటి అద్భుతమైన మేధావిని కన్న భరతమాతకు శతసహస్ర వందనాలు.
రవీంద్రనాథ్ టాగోర్ 150 వ జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ భారత్ బంగ్లాదేశ్ లు సంయుక్తంగా జయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ రోజు ( మే 7 వ తేదీ ) ఆ ఉత్సవాలను మనదేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభిస్తారు. బంగ్లాదేశ్ తరఫున ఆ దేశ ప్రణాళికా శాఖ మంత్రి ఏకేకంద్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ దేశంలో జరిగే ఉత్సవాలకు మన దేశ ప్రతినిధిగా ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా రవీంద్ర కవీంద్రునికి స్మృత్యంజలి ....
No comments:
Post a Comment