Tuesday, February 8, 2011

నవ్వులరాజు 'బాబు'

*******************************************************************************************


నిజం చెప్పాలంటే.... నా గతాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను ! నా దృష్టిలో గతాన్ని మరచిపోయిన మనుషులు..... చితిమీద చేర్చబడిన శవాల లాంటివారు. ఇలా ఎందుకంటున్నానంటే... గతంలో నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలే ముందు జీవితానికి దారి చూపిస్తాయి... 

*********************************************************************************************

నరసాపురంలో పుట్టి, మండపేటలో పెరిగి, రాజమండ్రిలో కళాకారుడిగా ఎదిగి, మద్రాస్ చేరి సినిమాల్లో హాస్య నటుడిగా స్థిరపడి అఖిలాంద్ర ప్రేక్షకుల్ని రాజబాబుగా అలరించిన  పుణ్యమూర్తుల అప్పలరాజు చెప్పిన మాటలవి.

ఆయనకు తొలి ప్రేక్షకులు రాజమండ్రి రిక్షా కార్మికులు. ఆయన మిమిక్రీని చూసి ఆనందించి.. ఆభినందించిన వారిని ఆయన జీవితాంతం గుర్తు పెట్టుకున్నారు. తనను కష్టాల్లో ఆదుకున్న మిత్రులను, సినిమాల్లో వేషాల కోసం తన ఫోటోలు తీసి పెట్టిన బాబు ఫోటో స్టూడియో వారిని కూడా అనునిత్యం తలచుకునే సంస్కారవంతుడు రాజబాబు. 1960 లో మద్రాసులో అడుగుపెట్టిన రాజబాబు మిమిక్రీ చేస్తూ, ట్యూషన్లు చెప్పుకుంటూ సినిమాల్లో వేషాలకోసం ప్రయత్నాలు సాగించారు. ఆ ప్రయత్నంలో ఆయన కొన్ని రోజులు కటిక ఉపవాసాలు కూడా చేసారు. ఆ సమయంలో మంచినీళ్ళు ఇచ్చి ఆదుకున్న ప్రముఖ నటి. నర్తకి రాజసులోచన ఇంటి వాచ్ మాన్ ను కూడా చివరిదాకా తల్చుకున్నారంటే..... వేషాలు దొరికాక కృతజ్ఞత చెప్పడానికి అతన్ని వెదుక్కుంటూ వెళ్ళారంటే...... ఆయన గొప్పతనమేమిటో అర్థం చేసుకోవచ్చు.

ఆయన చెప్పిన ట్యూషన్లే ఆయనకు సినిమాల్లో అవకాశాలు కల్పించాయి. అప్పట్లో నటుడు, దర్శకుడు అయిన అడ్డాల నారాయణరావు గారి పిల్లలకు పాఠాలు చెప్పిన రాజబాబుకు ఆయన తాను తీసిన ' సమాజం ' చిత్రంలో అవకాశం ఇచ్చారు. అదే రాజబాబు సినీ ప్రస్థానంలో తొలి అడుగు. రావికొండలరావు, డా. గరికపాటి రాజారావు గార్ల ప్రోత్సాహంతో రంగస్థలం మీద కూడా తనని తాను నిరూపించుకున్నారు.

అడపాదడపా చిన్న చిన్న వేషాలు వేసినా జగపతి వారి ' అంతస్తులు ' చిత్రం ఆయన నటనా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ఆయన తిరిగి చూడలేదు. బిజీ అయిపోయారు. ఒక దశలో రోజుకు రెండు, మూడు షిఫ్ట్ లు పనిచేసిన సందర్భాలు కూడా వున్నాయి. హాస్య నటుడిగానే కాక కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. అందర్నీ నవ్వించి ఆనందపరచిన రాజబాబు పబ్లిక్ ట్రస్ట్ ఏర్పరిచి ప్రతీ పుట్టిన రోజున ఒక ప్రముఖుణ్ణి సన్మానించి మూడురోజులపాటు నాటక ప్రదర్శనలను నిర్వహించేవారు. ఈ కార్యక్రమంలో తొలిసారిగా తన నట జీవితానికి ప్రేరణ అయిన అప్పటి హాస్య నటుడు బాలకృష్ణ గారిని సన్మానించారు. కేవలం బాలకృష్ణ గారి నటన కోసం రాజబాబు ' పాతాళభైరవి ' చిత్రాన్ని తొంభైసార్లు చూసారట.

మనిషి బ్రతికి వుండగా గొప్పవాడు అనిపించుకోవడం కాదు.... చచ్చిపోయిన తర్వాత... గొప్పగా బ్రతకాలి 
..............అంటుండే రాజబాబు అంతటి గొప్ప పేరు సంపాదించి 1983 వ సంవత్సరం ఫిబ్రవరి  7 వ తేదీన అకాల మృత్యువు పాలయ్యారు.    

ఆ నవ్వులరాజుని మరోసారి స్మరించుకుంటూ ................



రాజబాబు గారి మీద గతంలో రాసిన టపా ఇక్కడ ...............

http://sirakadambam.blogspot.com/2010/02/blog-post_3640.html

Vol. No. 02 Pub. No. 138

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం