Saturday, February 12, 2011

' కంచు కంఠం ' సూరిబాబు

 కంచులా మ్రోగే కంఠస్వరంతో, కఠినంగా అనిపించే పద్యాలను పామరులకు సైతం అర్థమయ్యేలాగా సుస్పష్టమైన ఉచ్చారణతో పాడి అటు రంగస్థలాన్ని, ఇటు తెలుగు చిత్ర రంగాన్ని సుసంపన్నం చేసిన నటుడు పువ్వుల సూరిబాబు.

పువ్వు పుట్టగానే పరిమళించిందట. అలా సూరిబాబు ఆరేళ్ళ వయసులోనే బొబ్బిలి యుద్ధం నాటకంలో చిన రంగారావు పాత్ర పోషించాడు. దాంతో నాటకాల మీద మోజు బయిల్దేరింది. ఆది ఆయనతో బాటు పెరిగి పెద్దదై చదువును వదిలిపెట్టేలా చేసింది. అంతేకాదు... స్వగ్రామం కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా బొమ్ములూరు గ్రామం వదలి పోయేలా చేసింది. అక్కడనుంచి పారిపోయిన సూరిబాబు ఎక్కడో వున్న గద్వాల్ లో తేలాడు. అక్కడ వున్న గద్వాల్ సంస్థానం వారి నాటక సమాజంలో జేరాడు. రామదాసు నాటకంలో రాముడు, కృష్ణలీలలులో బాలకృష్ణుడు లాంటి వేషాలు వేసాడు. కొంతకాలానికి అక్కడనుంచి గుంటూరు వచ్చి దంటు వెంకట కృష్ణయ్య గారి సమాజంలో జేరాడు. అప్పట్లో ప్రముఖ నటుడు కొప్పరపు సుబ్బారావు గారి శిష్యరికం చేసి సుశిక్షుతుడైన నటుడిగా తయారయ్యారు సూరిబాబు.

అనంతరం గుడివాడలో స్వంతంగా నాటక సమాజాన్ని నెలకొల్పి అత్యున్నత సాంకేతిక విలువలతో నాటకాలు ప్రదర్శించారు. అయితే నష్టాలు రావడంతో దాన్ని మూసేసి 1936 లో తెనాలి జేరుకున్నారు.  అక్కడ కూడా అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆ సమయంలోనే ద్రౌపదీ వస్త్రాపహరణం తో చిత్రసీమలో ప్రవేశించారు. మాలపిల్ల చిత్రంలో ఆయన పాడిన 'కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ....' పాట వాడ వాడలా మార్మోగింది. చాలా చిత్రాల్లో నటించడమే కాక తన పాటలు, పద్యాలు తానే పాడుకున్నారు. అంతేకాదు పాటలను, ముఖ్యంగా పద్యాలను స్వరపరచడానికి సంగీత దర్శకులు సూరిబాబు గారి సహకారం తీసుకునేవారు. అలా మహాకవి కాళిదాసు చిత్రంలోని మాణిక్య వీణాం....... శ్లోకం స్వరకల్పనలో ఈయన హస్తం కూడా వుంది.

సూరిబాబు గారు తన భార్య రాజేశ్వరి గారి పేరు మీద రాజరాజేశ్వరి నాట్య మండలిని స్థాపించి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ముఖ్యంగా కొప్పరపు సుబ్బారావు గారు రచించిన ' తారాశశాంకం ' నాటకం వారికి ఎంతో పేరు తెచ్చింది. ఆయన రంగస్థలం మీద రామదాసు, రాముడు, చినరంగారావు, ధర్మారాయుడు, రంగారావు, గజేంద్రుడు, తక్షకుడు, కశ్యపుడు, నారదుడు, కంసుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విప్రనారాయణుడు, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, రారాజు, సుబుద్ధి లాంటి ఎన్నో వైవిధ్యమున్న పాత్రలు పోషించారు.

ఆయన 1915 ఫిబ్రవరి 22 న జన్మించి  1968 ఫిబ్రవరి 12 న అస్తమించారు. రెండూ ఒకే నెలలో రావడం యాదృచ్చికం. ఈరోజు ( ఫిబ్రవరి 12 ) పువ్వుల సూరిబాబు వర్థంతి సందర్భంగా కళా నీరాజనాలు అర్పిస్తూ...

 

Vol. No. 02 Pub. No. 142

7 comments:

కంది శంకరయ్య said...

ఉదయాన్నే సూరిబాబు నోట చక్కని పద్యాన్ని వినిపించారు. ధన్యవాదాలు.

SNKR said...

కంచుకంఠం. మైక్ కూడా అవసరముండేది కాదేమో అనిపిస్తుంది. గొంతుమీద పూర్తి అదుపు కలిగిన గాయకుడు.

SRRao said...

* శంకరయ్య గారూ !
* శంకర్ గారూ !

ధన్యవాదాలు

Suryanarayana said...

SURIBABU ABHIMAANINI NAENU. AAYANA PADYAALU PAATALU SAEKARIMCHI PETTUKOAVAALANI NAA KORIKA. CHAKKANI VYAASAM.

SRRao said...

సూర్యనారాయణ గారూ !
ధన్యవాదాలు. సూరిబాబుగారి పాటలు కొన్ని ఈ క్రింది లింకులలో దొరుకుతున్నాయి. ప్రయత్నించండి.

http://www.hummaa.com/music/artist/P+Suribabu/10501/songs/

http://www.manoramic.com/

shri said...

ఈ నాటి శ్రోతలకూ , చదువరులకూ సూరిబాబు గారి లాంటి
మహాకళాకారులని పరిచయం చేస్తున్నమీ పత్రికకు,మీకు
ఎన్నిధన్యవాదాలు తెలిపినా తక్కువే..పద్యం పాడటంలోని
మాధుర్యం సూరిబాబుగారు,రఘురామయ్య గార్ల వల్ల బోధ పడింది...

శ్రీదేవి

SRRao said...

శ్రీదేవి గారూ !
ధన్యవాదాలు

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం