Tuesday, February 1, 2011

జోడు గుర్రాల స్వారీ

విజయా వారి ' మాయాబజారు ' చిత్రం తెలుగు వారి మనస్సులో ఎంతగా నిలిచిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ చిత్రం గురించిన విశేషాలు ఎంత చెప్పుకున్నా ఇంకా ఎన్నో మిగిలిపోతుంటాయి. టీం వర్క్ అనేది సక్రమంగా వుంటే చక్కటి మధుర కావ్యాలు వెలువడతాయనడానికి సజీవ ఉదాహరణ మాయాబజారు.


ఆ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణుల పనితనం చిరకాలం చెప్పుకోదగింది. వారిలో ప్రత్యేకం కళా దర్శకులు మా. గోఖలే, ఛాయాగ్రాహకులు మార్కస్ బార్ట్లే ల ప్రతిభ. గోఖలే గారు అద్భుతమైన సెట్స్ కు రూపకల్పన చేసి అలరిస్తే, బార్ట్లే వెలుగు నీడలను వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు. సినీ అద్భుతాల్లో ఒకటిగా నిలిచిన అందమైన విజయావారి చందమామను సృష్టించింది ఈ జంటే !


ఒకసారి మార్కస్ బార్ట్లే గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఒక విలేఖరి  " మాయాబజారు చిత్రంలో ఘటోత్కచుడు వున్న అడవికి అభిమన్యుడు తల్లితో వచ్చినపుడు చుట్టూరా వున్న అడవంతా మండిపోవడం, దారికి అడ్డంగా గోడ ఏర్పడడం లాంటి మాయలు అద్భుతంగా చిత్రీకరించారు. ఆది మీ గొప్పతనమా ? గోఖలే గారి గొప్పతనమా ? " అని అడిగాడు.

దానికి బార్ట్లే గారు నవ్వుతూ " ఆ దృశ్యాలు అంత అద్భుతంగా రావడానికి నేను, గోఖలే గారు ఇద్దరూ కారణం కాదు. మా జోడు గుర్రాలను స్వారీ చేసిన మహానుభావుడు కె. వి. రెడ్డి గారిది. ఆ చిత్రం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం " అన్నారు.

ఎదిగిన కొద్దీ ఒదిగి వుండడం అంటే అదీ ...................   

Vol. No. 02 Pub. No. 132

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం