Wednesday, October 13, 2010

అందరూ దిగ్దంతులే !

 ఓసారి రవీంద్రభారతిలో పండితసభ జరుగుతోంది. అందులో గిడుగు సీతాపతి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, వేదుల సత్యనారాయణ గారు లాంటి పెద్దలంతా పాల్గొన్నారు. భాషావాదం పైన వాడిగా, వేడిగా  చర్చ జరుగుతోంది.

' ఏ వస్తువైనా సరే ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా ధనవంతులకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో ధరలో ఉంటేనే బాగుంటుంది. అలాగే విద్వాంసులకోసం పండిత భాష అనేది వున్నా కూడా సామాన్యులకు కోసం సరళమైన భాష ఉండాలి. అప్పుడే భాషలోని పరిమళం అందరికీ అందుతుంది. '

....... అని పెద్దలందరూ సుదీర్ఘ చర్చ తర్వాత తీర్మానించారు. ఈ చర్చ మొత్తాన్ని ఆ వేదిక మీదే కూర్చున్న దేవులపల్లి వారు మౌనంగా గమనిస్తున్నారు. వేదుల వారికి అనుమానం వచ్చింది. భాషావాదం పైన ఇంత ఘాటుగా చర్చ జరుగుతుంటే అందులో పాల్గోవటం మానేసి కృష్ణశాస్త్రి గారు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారేమిటా అని.  అదే విషయం ఆయన్ని అడిగారు.

" వారంతా దిగ్దంతులు. వారితో మనమేం మాట్లాడగలం చెప్పండి " అని చమత్కరించారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.

...... ఆ సభలో పాల్గొన్న పెద్దల్లో చాలామంది  ఢెబ్భైవ పడిలో పడ్డవారే !                                   
Vol. No. 02 Pub. No. 036

3 comments:

కొత్త పాళీ said...

దిగ్దంతులు - దిగంబరుళ్ళాగా అన్నమాట. గొప్ప చమత్కారం

Vinay Datta said...

దిగ్దంతులు...what does it mean?

SRRao said...

@కొత్తపాళి గారూ !
ధన్యవాదాలు

@ మాదురి గారూ !
' దిగ్దంతులు ' అనేది కృష్ణశాస్త్రి గారు దంతములు లేని వారు అనే అర్థంలో చమత్కరించారు. పైన కొత్తపాళీ గారు నేరుగా కాకుండా ఉదాహరణతో చెప్పారు. ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం