Wednesday, October 21, 2009

నవయుగ వైతాళికుడు




ప్రబంధ సాహిత్య వరవడిలో నడుస్తున్న తెలుగు కవిత్వాన్ని భావకవితా బాట పట్టించి నవయుగానికి నాంది పలికిన మహాకవి శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. ఆయన మీద, ఆయన రచనల మీద ప్రముఖుల అభిప్రాయాలు కొన్ని........


* మహాకవి శ్రీశ్రీ - ఈనాటి యువతరం మీద సినిమా తారల ప్రభావం ఎంత ఉంటున్నదో ఆ రోజుల్లో మాలాంటి వాళ్ళమీద కృష్ణశాస్త్రి సమ్మోహన శక్తి అంతగానో, మరింతగానో వుండేది. నేను కృష్ణశాస్త్రి కవితాశైలినే అనుకరించేవాడిని. కానీ, మా నారాయణబాబు కృష్ణశాస్త్రి సింహం జూలునుకూడా అనుసరించి, దాన్ని రోజూ సంపెంగ నూనెతో సంరంక్షించుకునేవాడు. నాకెప్పుడూ పద్యం మీద ఉన్న శ్రద్ధ జుట్టు మీద ఉండేదికాదు. " మా అక్కే ! జుత్తుకి చవుర్రాసుకొదు " అని నాగురించి కూడా కన్యాశుల్కం లోని గిరీశం అని ఉండవచ్చును.
* కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ - శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిని నేను చిన్నప్పటినుండి ఎరుగుదును. మే మన్నదమ్ములుగా ఉండెడివారము. ఆయన 'అబ్బ' అన్న పద్యము వ్రాసెను. నాటినుండి ఆయన యన్నచో నాకు గొప్ప అభిప్రాయము కలిగినది. తరువాత " పల్లకి " యన్న పద్యము నన్నాకర్షించినది.
తరువాత తెలుగులో నాయన ఠాగూరు వంటి వాడనిపించినది. కవిత్వము చెప్పలేనుగానీ ఆకృతిచేత సుమిత్రానందపంత్ అనుకొంటిని.
మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో శ్రీ కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నా యభిప్రాయమే కాదు. ఆ కవులను జాగ్రత్తగా చదివిన వారి యభిప్రాయము కూడాను.
* శ్రీ నాభి జగన్నాధరావు - రాజకీయనాయకులు గాంధీజీ సందేశమును ఎన్ని రీతుల వ్యక్తము చేసినను శ్రీ కృష్ణశాస్త్రివలె గాంధీజీ జేవితముయొక్క మూల సూత్రము గ్రహించినవారు లేరనుట సాహసమేమోగాని, " కమ్మగా బ్రతికితే, గాందీ యుగం ! మనిషి కడుపునిండా తింటే గాంధీ మతం " అని అంత గొప్పగా ఇంకెవరనగలరు.  

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం