Thursday, July 1, 2010

రిలాక్ ' సింగ్ '

మిల్కాసింగ్ - ఫ్లయింగ్ సింగ్ 

దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో తల్లిదండ్రుల ఊచకోత కళ్ళారా చూసి భయంతో ప్రాణాలను అరచేత పెట్టుకుని తాను పుట్టిన పాకిస్తాన్ నుంచి భారత్ వైపు పరుగెత్తుకుంటూ రావడంతో ఆయన పరుగు జీవితం ప్రారంభమైంది.


ఆ పరుగే తర్వాత ఆయన వృత్తి అయింది. భారత అథ్లెటిక్ చరిత్రను తిరగరాసింది. ప్రపంచ అథ్లెటిక్ పోటీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన క్రీడాకారుడు మిల్కాసింగ్.

1958 లో కటక్ లో జరిగిన జాతీయ క్రీడల్లో మిల్కాసింగ్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అందులో 200 మీటర్ల, 400 మీటర్ల రికార్డు సృష్టించాడు. అదే సంవత్సరం అదే విభాగాల్లో టోక్యో ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. అదే సంవత్సరం కార్డిఫ్ లో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం దక్కించుకున్నాడు.

రెండు సంవత్సరాల తర్వాత 1960 లో జరిగిన రోమ్ ఒలింపిక్స్ లో అద్భుతమైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించి విజయకేతనాన్ని ఎగురవేశారు.  అద్భుతమైన ప్రతిభ కనబరిచినా చివరి క్షణంలో తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ప్రథమ స్థానాన్ని కోల్పోవలసి వచ్చింది. తాను మరీ వేగంగా పరుగెడుతున్నానని భావించిన మిల్కాసింగ్ ఒక్క క్షణం రిలాక్స్ అవడం దీనికి కారణం. అయినా ఫోటో ఫినిష్ ఫలితం రావడం విశేషం. 44.8 సెకండ్లు ప్రథమ స్థానం కాగా మిల్కాసింగ్ 45.6 సెకండ్లలో పూర్తి చేసి నాలుగో స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 38 సంవత్సరాల వరకూ ఆ రికార్డుని ఏ భారత అథ్లెట్ అధిగమించలేదు.

మిల్కాసింగ్ ' రిలాక్సింగ్ ' గురించి ఆయనే చెప్పిన ఓ జోకు .........

మిల్కాసింగ్ కు అప్పట్లో ఇంగ్లీష్ అంతగా రాదు. 1960 ఒలింపిక్స్ లో పోటీ పూర్తయ్యాక ఆయాసం తీర్చుకోవడానికి నేలపైన పడుకుండి పోయాడు. అతనితో ఇంటర్వ్యూ చెయ్యడానికి ఒక మహిళా జర్నలిస్ట్ వచ్చింది. తనదే తొలి ఇంటర్వ్యూ కావాలని ఆమె ఆత్రుత. హడావిడిగా ప్రశ్నలడగడం మొదలు పెట్టింది. అసలే ఇంగ్లీష్. ఆపై ఖంగారు. మన సింగ్ గారికేమో ఆయాసం. ఆవిడ ప్రశ్నలు వేస్తోంది. అతనికి అర్థం కావడం లేదు. సమాధానాలు లేకపోవడంతో ఆవిడ ప్రశ్నలాపి,
' మిస్టర్ ! ఆర్ యూ రిలాక్సింగ్ ! ' అనడిగింది. 
ఈ ప్రశ్న మాత్రం మిల్కాసింగ్ కి అర్థమైనట్లనిపించింది.  దీనికైనా సమాధానం చెప్పకపోతే బాగోదనుకున్నాడేమో వెంటనే లేచి కూర్చుని
' నో ! నో ! ఐయాం మిల్కాసింగ్ ! ' అన్నాడు హుషారుగా !

Vol. No. 01 Pub. No. 335

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం