Wednesday, July 7, 2010

ప్రేమ విజయం

1931 వ సంవత్సరం సినిమాలకు మాటలొచ్చిన సంవత్సరం. తెలుగు సినిమాలు కూడా ఆవిర్భవించిన సంవత్సరం. అంతవరకూ సాగిన మూకీల కాలంలో ఇంచుమించుగా అన్ని చిత్రాలు రంగస్థల నాటకాల ఆధారంగా తయారైన పౌరాణికాలే ! అలాగే టాకీలొచ్చిన తొలినాళ్ళలో అప్పటి సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబించే సాంఘిక చిత్రాలు దాదాపుగా రాలేదనే చెప్పాలి.  అవి వెలుగు చూడడానికి సుమారు అయిదేళ్ళు పట్టింది. 1936 లో తొలి తెలుగు సాంఘిక చిత్రం ' ప్రేమ విజయం ' విడుదలయింది.

ఇండియన్ మూవీటోన్ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. కృత్తివెంటి నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ప్రేమ విజయం చిత్రం అపజయం పాలు కావడంతో ఆ చిత్రానికి సంబంధించిన చాలా వివరాలు మరుగున పడిపోయాయి. కానీ లభిస్తున్న సమాచారం ప్రకారం ఆ చిత్రానికి ప్రముఖ భావకవులు ' గౌతమీ కోకిల ' వేదుల సత్యనారాయణ శాస్త్రిగారు సాహిత్యం సమకూర్చారని, ప్రభల కృష్ణమూర్తి కథానాయకునిగా నటించారని మాత్రం తెలుస్తోంది. పౌరాణికాలకు అలవాటుపడ్డ అప్పటి ప్రేక్షకులు సమకాలీన వ్యక్తుల ప్రేమను అంగీకరించే స్థాయికి చేరుకోలేకపోవడమే దీనికి కారణం కావచ్చు. ఆ తర్వాత మరో రెండు సంవత్సరాలవరకూ ( 1938 ) సాంఘిక చిత్రాల నిర్మాణం చేసే ధైర్యం ఎవరికీ లేకపోయింది. గూడవల్లి రామబ్రహ్మం గారి ' మాలపిల్ల ' వరకూ ఈ స్తబ్దత కొనసాగింది. అయితే సమకాలీన సమస్యల మీద కూడా చిత్రాలు నిర్మించవచ్చనే ఆలోచనను నిర్మాతలలో కలిగించి తర్వాత కాలంలో సాంఘిక చిత్రాల నిర్మాణానికి ' ప్రేమ విజయం ' చిత్రం బాటలు వేసిందని చెప్పవచ్చు.   

Vol. No. 01 Pub. No. 342
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం