Friday, July 30, 2010

జరీ అంచు తెల్లచీర

 జరీ అంచు తెల్లచీర, సామాన్యులకది అందని పండే ! అందులోను విశాలాక్షి లాంటి దిగువ మధ్య తరగతి అమ్మాయిలకైతే మరీను. ఎప్పుడో పదేళ్ళ క్రితం తనకు ఆరేళ్ళప్పుడు   సినిమా హాల్లో చూసింది, జరీ అంచు తెల్లచీరని. అప్పట్నుంచి ఆమె కలల్లో తళుక్కుమని ఆ చీర మెరవడం ప్రారంభమైంది.  ఆ కోరిక ఆమెతో బాటు పెరిగి పెద్దదయింది. అడిగితే నాన్న " చూద్దాంలే " అంటాడు. అమ్మ కష్టాలన్నీ ఏకరువు పెట్టి ఎలాగూ పెళ్లి చెయ్యాలి కదా అప్పుడు కొనుక్కోవచ్చులే అని ముగిస్తుంది.

.........................................................................................

"  ఎవ్వర్నీ ఏమీ అడగను " 
అని ఎన్నోసార్లు నిశ్చయించుకుంది విశాలాక్షి. 
ఫలానాది కావాలని ఎవర్నడిగినా వాళ్ళకుండే బాధలన్నీ వెళ్ళబుచ్చక తప్పదు.
వాళ్ళలా చెపుతుంటే ఇంకా బాధగా వుంటుంది విశాలాక్షికి. 

..........................................................................................

ఆడపిల్లకు పెళ్లి అవసరం దేనికి ?

..........................................................................................

కట్టుకుందికి గుడ్డముక్కా ! రెండు పూటలా ఇంత తిండీ, వీటికోసం ఆడపిల్ల పెళ్లి చేసుకోక తప్పదు.
తప్పదా !
-- తప్పకపోయినా సరే ! ముష్టయినా ఎత్తి బతుకుతాను గానీ పెళ్లి మాత్రం చేసుకోను.
పెళ్ళాడకపోతే నువ్వు ముష్టి ఎత్తవలసి వుంటుంది. నీకు డబ్బూ లేదు  ; చదువూ లేదు 
---- హావు న్నిజం !! 
ఈమెకి పాటయినా రాదు. ఈమె గుడ్డిదయినా కాదు. ఈమేకి శక్తయినా లేదు, మరి, లోకానికి దయన్నది లేదు.

.........................................................................................

ఆన్నయ్య ఫ్రెండ్ కనకారావు. వాడంటే విశాలాక్షికి చిరాకు. పిల్లను పెళ్లాడితే బాగుంటుందని తల్లి ఆశ.

........................................................................................

----- కనకారావునా నే పెళ్ళాడేది !!

.........................................................................................

ఇది విశాలాక్షి అభిప్రాయం.

........................................................................................

ఒక్క తెల్ల చీర .... నేతదే..... నూలుదే...... కానీ..... జరీ అంచుది ! 

........................................................................................

అది కూడా కొనుక్కోలేని, అన్నాతమ్ముడు చదువుకోవడానికి మంచి దీపం, పడుకోవడానికి మంచి మంచం, నాన్నకి అగ్గిపెట్టెలు  కొనుక్కోలేని తమ దీన పరిస్థితికి విశాలాక్షికి ఏడుపు వస్తోంది.

ఆరోజు విశాలాక్షి తండ్రి చీర కొనడానికి బజారుకెడదాం అన్నప్పుడు సహజంగానైతే ఎగిరి గెంతాలి విశాలాక్షి. కానీ ఆమెకు ఆస్పత్రి, రోగాలు గుర్తుకు వచ్చాయి.

.........................................................................................

.... ఈ రోజు సాయంకాలం ----
గోడవైపు తిరిగి కంటినీరు పెట్టడానికి కారణం అవన్నీ జ్ఞప్తికి రావడం కాదు.
ఇంకోటి కూడా వుంది.
అది ఉండబట్టే అవన్నీ స్పురణకు వచ్చాయి. 
అది......
రక్తం !
బజారుకి వెళ్దామన్న మనిషి బజార్లో ఇవ్వబోయేది డబ్బుకాదు. నెత్తురు.
అతని ముఖం చూస్తేనే తెలుస్తుందా విషయం.
రక్తం ధారపోస్తేనేగానీ తీరని కోరికలు నా కక్కరలేదు. 

.........................................................................................
 
.... అనుకుంది విశాలాక్షి. ఆమె చీర వద్దన్నా తండ్రి వినలేదు. బయిల్డేరదీసాడు.

........................................................................................

అతని దగ్గరున్నది పన్నెండు కాబోలు అంతకంటే ఎక్కువ మాత్రం కాదు. 
ఏ దుకాణంలో అడిగినా, కావలసిన, చీర కనీసపు ఖరీదు ఇరవై. 
షాపులు ఎక్కేరు, దిగేరు. 
అందులోను ఆఖరి షాపువాడు !
మరొక కనకారావు !
ఆ షాపు మొఖం చూస్తేనే వెళ్లాలనిపించలేదు. 
"  ఒద్దు నాన్నా ! అది గొప్ప షాపు " 
"  ఇంతదూరం వచ్చేం కదా ! పోయి చూద్దాం రా " 
షాపు వాడేకాదు కనకారావు, వాడి నౌఖర్లందరూ కూడా కనకారావులే !  

..........................................................................................

.... షాపు వాడి పలకరింపులో, మాటల్లో వెటకారం స్పష్టంగా కనిపించింది విశాలాక్షికి. చాలా ఇబ్బందిగా ఫీలయ్యింది.

.........................................................................................

...... ఇంతలో వాడు చీరలమేటిలోంచి పైకి.   
జరీ ! జరీ ! జరీ అంచు తెల్లచీర  
తాచుపాముని చూసినట్లు జడుసుకుంది విశాలాక్షి.
దూరంగా, దూరంగా, ఈ విషాన్ని దూరంగా తీసేయండి. 
"  ఎంతండీ ?  "
"  ఇరవై రెండు "
అతను జంకి జంకి, భయపడి భయపడి,
"  కొంచెం.....కొంచెం అయినా....తగ్గదంటారా ? "  అనేసరికి
"  ఇదేం శుక్రవారం సంత కాదు బేరాలాడ్డానికి "  అనే మాటలతో కొట్టాడు వాడు .   

..........................................................................................

 .... తండ్రి తక్కువ ఖరీదులో చూపించమన్నప్పుడు షాపులో వాళ్ళు కనీసం వెటకారంగానైనా నవ్వలేదు.

........................................................................................

"  నేవద్దంటే ఎందుకు విన్నావు కాదు నాయినా ! "

" అంత ఖరీదుంటాయనుకోలేదే "

నెత్తురే ఖరీదుగా ఇచ్చినా దొరకని వస్తువులు !

..........................................................................................
 
.... విశాలాక్షి నిరాశతో కొట్టుకుపోతోంది. ఏడుపు వస్తోంది.

..........................................................................................

అన్నయ్యకి ఫిజిక్స్ పాఠం అర్థం కాదు. తమ్ముడికి పదమూడో ఎక్కం చస్తే రాదు. అమ్మకి నిద్దర పట్టడం అనేది వుండదు. నాన్న అగ్గికోసం వెతుకుతూనే ఉంటాడు. చిన్నతమ్ముడు ఏడవక తప్పదు. ఈ వెలగలేని దీపం ఎంతోసేపు వెలగదు. 
---- నే నేడ్వను,
అనుకున్న విశాలాక్షికి మరింక ఆగకుండా ఏడుపు వస్తోంది.

.........................................................................................

ఇది మెరుపులేని మబ్బు. ఇది తెరిపిలేని ముసురు. ఇది ఎంతకీ తగ్గని ఎండ. ఇది ఎప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి. ఇది గ్రీష్మం. ఇది శిశిరం. ఇది దగ్ధం చేసే దవాలనం. ఇది చుక్కల్ని రాల్చేసే నైరాశ్యం.----

ఒక్కటి ! ఒక్కటే సుమండీ ! ఒక్క జరీ అంచు తెల్లచీర !!

..........................................................................................

..... మధ్య తరగతి మిథ్యా ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్న సగటు ఆడపిల్ల మనస్తత్వం ఇది. అందరికీ కలలుంటాయి. కొందరికి అవి తీర్చుకునే అవకాశం, అదృష్టం వుంటాయి. కానీ మన సమాజంలో చాలామంది పరిస్థితి తమ కలల్ని నిజం చేసుకునే దారి లేక, వాటికోసం కన్నవారిని ఇబ్బంది పెట్టలేక నలిగిపోవడమే !

ఈ సత్యాన్ని ఆవిష్కరించిన ఈ ' జరీ అంచు తెల్లచీర ' రచయిత రావిశాస్త్రి గారు.  ఆయన జన్మదినం సందర్భంగా ఈ కథాపరిచయం.   

Vol. No. 01 Pub. No. 358

2 comments:

మాలా కుమార్ said...

పరిచయం బాగుందండి .

SRRao said...

మాలాకుమార్ గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం