Tuesday, December 15, 2009

అమరజీవి ఆత్మఘోష


అఖిలాంధ్ర ప్రజలకు అభివాదాలు !

అన్నట్లు
అఖిలాంధ్ర, సమైక్యాంధ్ర అనొచ్చా ? ఏమో ! ఏమంటే ఏ తంటానో కదా ! అయినా నేను ఆత్మనే కదా ! ఏమన్నా ఫర్వాలేదు. నన్నేమీ చెయ్యలేరు కదా !
ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు అడుగలేను. ఆంధ్ర దేశ పరిస్థితి నాకు ఎప్పటికప్పుడు తెలుస్తోంది.

ఏమని
చెప్పను నా బాధ ? తెలుగు ప్రజలు పరాయి భాష పాలకుల చేతిలో అవమానింపబడుతున్నారని అప్పట్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. అసఫ్ జాహీలు, నిజాం నవాబుల కాలంలో తెలుగు భాషకు, తెలుగు వారికి జరిగే పరాభవాలు తట్టుకోలేక తెలంగాణా ప్రాంతంలో విముక్తి కోసం ఉద్యమాలు చేశారు. 1937 లో కుదిరిన ' శ్రీబాగ్ ' ఒప్పందం ప్రకారం మరుసటి సంవత్సరమే ఆంధ్ర రాష్ట్రం వస్తుందనుకుంటే రాజధానిగా మద్రాస్ నగరాన్ని కోరుకోవడంతో వాయిదా పడింది. నిజానికి రాజధాని రాష్ట్రానికి మధ్యన ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మరి మద్రాస్ ( అదే ఇప్పుడు చెన్నై అంటున్నారట కదా ! ) తమిళనాడు రాష్ట్రానికి మధ్యలో ఉందా ! లేదే !

సరే
... 1947 లో భాషా రాష్ట్రాల సమస్యను పరిష్కరించడానికి వేసిన థార్ కమీషన్ భాషల పరంగా విభజించడం కుదరదని చెప్పేసింది. నీలం సంజీవరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికవడంతో 1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్ర మహా సభ నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి హాజరుకావద్దని సభ్యులందర్నీ ఆదేశించడం, 21 మంది కాంగ్రెస్, స్వతంత్ర సభ్యుల సంతకాలతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వాయిదా వెయ్యాలని విజ్ఞాపన ప్రధాని నెహ్రు గారికి అందజెయ్యడం చేసాడు. ఇది నెహ్రుకు బాగా అనుకూలించింది. మీరు విడదియ్యమంటున్నారు కానీ వాళ్ళేమో విడదియ్యోద్దంటున్నారు. ముందు మీలో మీరు తేల్చుకుని ఏకాభిప్రాయానికి రండి అని చెప్పి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వాయిదా వేసి తమాషా చూస్తూ ఉండిపోయాడు. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పులేదనుకుంటాను.
దీంతో అసంతృప్తికి లోనైన స్వామి సీతారాం 36 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి వినోభాభావే జోక్యంతో విరమించాడు. నేను ఊరుకోలేకపోయాను. ఇంకా ఎన్నాళ్ళు తాత్సారం చేసి తమాషా చూస్తారు అని బాధతో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాను. మొదట్లో ఎవ్వరూ సరిగా పట్టించుకోలేదు. అప్పట్లో ఇన్నేసి ఎడిషన్లున్న వార్తాపత్రికలు లేవు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. లైవ్ టెలికాస్ట్లు లేవు. అందుకని నిరాహార దీక్ష మొదలు పెట్టగానే అరెస్టు చెయ్యడానికి, ఆస్పత్రిలో పడేసి సెలైన్లు పెట్టెయ్యడానికి అప్పుడు అవకాశం లేకపోయింది. ఇప్పుడనిపిస్తోంది ఈ రోజుల్లో పుట్టి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉంటే బాగుండేదేమోనని ! ప్చ్ ! ఏం చేస్తాం ? తొందరపడి ప్రచార సాధనాలు అంతగా అభివృద్ది చెందని రోజుల్లో పుట్టేసానే ! ఆంధ్ర దేశమంతా నా పరిస్థితి పూర్తిగా తెలియడానికి 50 రోజులు పట్టింది. అప్పటికి నా పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకోండి. నేను నీరసించాను. ఉద్యమం బలపడింది. నాకు ఆ నిరాహార దీక్ష నుంచి విముక్తి కలగడానికి మరో ఎనిమిది రోజులు పట్టింది. అంటే ప్రత్యేక రాష్ట్రమిచ్చేసి దీక్ష విరమింప జేసారనుకుంటున్నారా ? అబ్బే ! నాలోని జీవుడు ఎగిరిపోయాడు. తర్వాత నెహ్రు మద్రాస్ లేకుండానే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించాడు. ఏం చేస్తాం దక్కిందే మహాభాగ్యమని తెలుగువారు సర్దుకున్నారు.

నిజాం
నవాబు పరిపాలనలో హైదరాబాద్ రాష్ట్రం చీకటిలో మ్రగ్గి పోయింది. నిజాం బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉంటే, జాగీర్దార్లు- భూకామందులు నిజాంకు బంటులుగా ఉండి సామాన్య ప్రజల్ని వెట్టి చాకిరితో పీడించుకుని తిన్నారు. ప్లేగు. కలరా మొదలైన వ్యాధులు ప్రబలితే పట్టించుకునే నాథుడే లేడు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొన్న తెలంగాణావాసులు నుండి విముక్తితో ఊపిరి పీల్చుకున్నారు. తర తరాలుగా తెలుగుకు పట్టిన దురవస్థను జీర్ణించుకోలేక తెలుగు వాళ్లందరమూ కలిసి ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. సహజంగానే మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి లాంటి వాళ్లు వ్యతిరేకించినా, బూర్గుల రామకృష్ణారావు లాంటి కొంతమంది రాజకీయ ప్రయోజనాలకోసం తర్వాత సమర్థించడంతో దేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఏర్పాటయిందని తెలిసి చాలా ఆనందపడ్డాను. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం ఇరు ప్రాంతాల మధ్యా ద్వేషాలను రగిలించడం, అవి తీరాక ఉద్యమాలను చల్లార్చడం లాంటి చర్యలతో ప్రజల అమాయకత్వాన్ని, ఆవేశాన్ని ఉపయోగించుకున్నారని తెలిసి చాలా బాధపడ్డాను. బతికుంటే వారి నుంచి ప్రజల్ని విముక్తి చెయ్యడానికి మళ్ళీ సత్యాగ్రహం చేపట్టేవాడినేమో ! ఏం చేస్తాం ! ఆ అవకాశం లేదుగా !
గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలనే మాట వినబడుతోంది. అప్పుడప్పుడూ అసమ్మతి వాదం తెర మీదకు రావడం మామూలే కదా అనుకున్నాను. కానీ క్రిందటి నెలలో నా విగ్రహాల మీద దాడి జరగడంతో ఉద్యమం ప్రారంభమయిందని తెలిసింది. నా సత్యాగ్రహబాటను కూడా అనుసరిస్తున్నారని తెలిసింది. అయితే తర్వాత గానీ తెలియలేదు నిరాహార దీక్ష చెయ్యడం ఈ రోజుల్లో ఇంత సుళువని. దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించగానే ప్రజలు తిరగబడడం చూస్తే ప్రజల్లో మార్పు వచ్చిందని అర్థమయింది. కానీ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఆదిస్థానం చేసిన ప్రకటన చూస్తే నాకు నెహ్రు రాజకీయమే గుర్తుకు వచ్చింది. పాలకులు మాత్రం మారలేదు. ప్రస్తుతం ఇరు ప్రాంతాల వారిని బలాబలాలు తేల్చుకోమన్నట్లే అనిపిస్తోంది. దాన్ని నాయకులు బాగానే ఉపయోగించుకుంటున్నట్లున్నారు. ఏమైనా 1969 ఉద్యమ ద్రోహాన్ని తెలంగాణా అమాయక ప్రజలు మరిచిపోయినా, ఆంధ్ర ప్రాంత ప్రజలు బాగా గుర్తు పెట్టుకుని 1972 నాటి ప్రత్యేకాంధ్ర నినాదాన్ని సమైక్యాంధ్ర నినాదంగా మార్చేశారు. నా చెవులకింపుగా ఉంది.

అయితే
కొంతమంది తెలంగాణా నాయకులు చేస్తున్న వాదనలే కొరుకుడు పడడంలేదు. మాటి మాటికీ ఆంధ్రవాళ్లు, ఆంధ్రవాళ్లు అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన, నివసిస్తున్న వారందరూ ఆంధ్రా వాళ్ళే కదా ! అసలు తెలంగాణా అన్నా, ఆంధ్రా అన్నా అర్థం దాదాపుగా ఒకటేనని మా రోజుల్లో అనుకునేవాళ్ళమే ! ఈ మథ్య భాషలో అర్థాలేమైనా మారిపోయాయా ? ఎవరైనా నా సందేహం తీరిస్తే బాగుండును. మరో విషయం. రాష్ట్రమన్నాక రాజధాని అవసరం. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నపుడు రాయలసీమ, కోస్తాంధ్ర వాసులు అప్పుడు రాజధానిగా ఉన్న మద్రాస్ నగరాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఆ నగరం తెలుగు వారికి చెందుతుందని ఎన్ని దృష్టాంతాలు చూపించినా దక్కించుకోలేకపోయారు. విశాలాంధ్ర ఏర్పడ్డాక అందరి ఆమోదంతో కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్ మార్చారు కదా ! ఒక రాజధాని... అది రాష్ట్రానిదైనా, దేశానిదైనా ప్రజలందరి భాగస్వామ్యంతోనే కదా అభివృద్ది చెందేది. అలా కాకుండా కొంతమంది వ్యాపారాలు, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టారు తప్ప హైదరాబాద్ అభివృద్ధిలో ఆంధ్రా వాళ్ల పాత్ర ఏమీ లేదంటారే ! అంటే వాళ్ల దృష్టిలో కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, నాయకులు తప్ప సామాన్యులు మనుష్యులు కాదా ! వాళ్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కట్టిన పన్నుల్లో కొంత భాగంతోనే కదా రాజధాని అభివృద్ది జరిగేది. అందుకని దాంట్లో రాష్ట్ర ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుంది కదా ! ఏమో నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఆ వ్యాపార వేత్తలు వగైరాలు కట్టే పన్నుల శాతం కంటే సామాన్య ప్రజలు కట్టే పన్నుల శాతమే ఎక్కువగా ఉంటుందేమో ! ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సమస్య రాజధాని చుట్టూ తిరుగుతున్నట్లనిపిస్తోంది. అసలే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ది చెందుతోంది. అన్నదమ్ముల మధ్య పరిష్కారంగా హైదరాబాద్ అభివృద్ది ఖర్చుని వాటాలేస్తే హైదరాబాద్ నగరం తమ రాజధానిగా ఉంచుకున్నవాళ్లు విడిపోయిన వాళ్లకు చెల్లించాల్సిన వాటా మాట ! ఆ... ఇదో పెద్ద విషయమా.... ఉన్నారుగా.... అమాయక ప్రజలు. వాళ్ల జీవితాలు తాకట్టు పెట్టేస్తారు ! ఇలాంటి సందర్భాల్లో నాయకులకు పండగేగా ! ప్రజలకు దండగ గానీ ! మా కాలంలో కంటే ఈ కాలంలో ప్రజలకు కొంత తెలివి వచ్చినట్లు అనిపిస్తోంది. చూద్దాం. వాళ్లు నాయకుల మెడలు వంచి తామంటే భయపడేటట్లు చేస్తారో , నాయకులే ప్రజల్ని ఎప్పటిలాగే వెర్రి గొర్రెల్ని చేస్తారో ! ఏమైనా ఈ నష్టాన్ని భరించాల్సింది సామాన్య ప్రజలే కానీ నాయకులూ కాదు వారిని వెనకనుండి నడిపిస్తున్న వ్యాపార, పారిశ్రామిక వేత్తలూ కాదు.

అప్పుడే... అమరజీవి పొట్టి శ్రీరాములు అమరరహే ! అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. పాలబిందేలు వస్తున్నాయి. నా విగ్రహాలకు అభిషేకాలు చెయ్యడానికి కాబోలు. ప్చ్ ! ఎప్పుడు, ఎందుకు, ఎవరు మా విగ్రహాలు పగలగోడతారో, ....పూజిస్తారో బ్రహ్మ దేవుడికైనా అర్థమవుతుందా ! ఆయనకెందుకు అర్థమవుతుందిలే ! ఆయన అసలు తనకు గుడులు, విగ్రహాలు లేకుండా జాగ్రత్త పడ్డాడుగా ! ఉన్నా విష్ణు మహేశ్వరుల చాటున దాక్కుంటాడు. ' దేముడికేం ! హాయిగా ఉన్నాడు. ఈ మానవుడే... కాదు కాదు....విగ్రహాలే బాధలు పడుతున్నాయి '. అన్నట్లు మీకు చెప్పలేదు కదా ! ఈ రోజుతో నా ప్రాణ త్యాగానికి 57 సంవత్సరాలు నిండుతున్నాయి. అందుకే మిమ్మల్ని ఒకసారి పలుకరిద్దామని వచ్చా ! సెలవు.

Vol. No. 01 Pub. No.138

4 comments:

Saahitya Abhimaani said...

బాగా వ్రాశారు రావుగారూ. కొద్ది నెలల క్రితం వరకు కూడ శ్రీరాములుగారు ఎవరో తెలియని ఈ రాజకీయ నాయకులు, ఇప్పుడు ఆయన ఫొటోలు సంపాయించి దండలు వెయ్యటం చూస్తుంటే, వీళ్ళు ఎంత అవకాశవాదులో అనిపిస్తోంది. నెల్లూరు జిల్లాకు శ్రీరాములు గారి పేరు పెట్టటానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. కడప జిల్లాకు మాత్రం వారాల్లో పేరు మార్చటం జరిగింది. ప్రతి సంవత్సరం శ్రీరాములుగారి జయంతి ఎప్పుడో కూడ తెలియని పెద్దమనుష్యులు ఈ రోజున ఆయన పేరు గొంతెత్తి పలుకుతున్నారు, వారి రాజకీయ స్వార్థం కోసం. నిజమే మరి శ్రీరాములుగారు బాధ పడ్డాడంటే పడడూ మరి.

SRRao said...

శివ గారూ !
ధన్యవాదాలు

vishnu Sharma said...

Actually its very conflicting argument, anyway nice to know about good leader like Sriramulu.
From the begining india is suffering with leaders, we dont change leaders and even we are not ready to vote nd think about it. But how we can chagne the other minds.

Keep posting..
Thanks.
Vishnu.

SRRao said...

* విష్ణుశర్మ గారూ !
నిజం ఎప్పుడూ వివాదాస్పదమే కదండీ ! మీరన్నట్లు ఎవరి మైండ్ ను మార్చలేము కానీ నాయకులను మార్చే శక్తి మన చేతిలో వుంది. కాకపోతే సరైన నాయకులు దొరకడం లేదు. లేదా గుర్తించడం కష్టంగా వుంది. అయితే ఇది మొదటినుండి లేదండీ ! శ్రీరాములు లాంటి చిత్తశుద్ధిగల నాయకులు అప్పట్లో చాలామందే వుండేవారు. అందుకే ఇప్పటికీ వాళ్ళని స్మరించుకుంటున్నాం. మనలాంటి వాళ్ళమైనా అప్పుడప్పుడు ఇలా చెప్పకుంటూ / చెబుతూ వుంటే ఎప్పటికైనా మంచివారు దొరకడం... ఎన్నుకోవడం సాధ్యమేమో !
ఆలోచింపజేసే వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం