Thursday, December 3, 2009

నిజాయితీ విలువ


ఎడమ ఫోటోలో ఉన్నది ప్రముఖ రచయిత భమిడిపాటి కామేశ్వర రావు గారు . కుడిప్రక్క ఫోటోలో ఉన్నది ఆయన కుమారుడు , మరో ప్రముఖ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ .

చదువుకునే రోజులు పోయి చదువు' కొనే ' రోజులు వచ్చాయని అడ్మిషన్ రోజుల్లో తల్లిదండ్రులందరూ వాపోవడం పరిపాటే ! అయినా తమ పిల్లలకు సీట్ కోసం అన్ని రకాల దారుల్లో ప్రయత్నం మానరు. తమ పిల్లల ప్రతిభను పెంచే కంటే వాళ్లకు ఎలాగో అలా డిగ్రీ సంపాదించడమే లక్ష్యంగా ఉన్న ఈ రోజుల్లో ఈ రచయితల ఉదంతం వింతగా ఉండొచ్చు. విలువలు కాస్తో, కూస్తో మిగిలున్న ఆ రోజుల్లో ఇలాంటివి మామూలే !

రాధాకృష్ణ గారు డిగ్రీ పూర్తిచేశాక ఇంజనీరింగ్ చదవాలనే కోరికతో ఎలాగో కష్టపడి ఇంజనీరింగ్ సీట్ సంపాదించారు. ఆ విషయం కామేశ్వర రావు గారికి తెలియదు. కానీ ఎలాగో ఆయనకు ఈ సమాచారం చేరింది. వెంటనే ఆయన ఆ కాలేజీకి వెళ్లి మెరిట్ లో రాని తన కుమారుడికి ఆ సీట్ ఇవ్వవద్దని, అర్హత గల మరో విద్యార్థికి ఇవ్వమని ఆ సీట్ రద్దు చేయించారట ! ఈ రోజుల్లో ఇలా ప్రవర్తించే తల్లిదండ్రులున్నారంటారా ?

ఈ సందర్భంలో ఒక విషయం. 1972-73 సంవత్సరాల్లో ప్రత్యేక ఆంధ్రోద్యమం ఉధృతంగా సాగింది. అప్పటికి నేను ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో ఉన్నాను. నా గ్రూప్ బి. పి. సి. ఇప్పటిలా ప్రతి సంవత్సరం కాకుండా రెండు సంవత్సరాలకు కలిపి పరీక్షలుండేవి. మొదటి సంవత్సరం మొదటి శ్రేణిలో సాగిన మా చదువు ఆర్నెల్ల ఉద్యమం ఉద్యమం పుణ్యమాని కొండెక్కింది. కంపార్ట్మెంట్ లో పాసైన నాకు మెడిసిన్ కి వెళ్ళే అవకాశం పోయింది. అప్పటికి ఎంసెట్ లు వగైరా లేవులెండి ! పోనీ బి.ఎస్సీ. లో చేరుదామనుకున్నాను. అడ్మిషన్లకు ఇంటర్వూలు జరుగుతున్నాయి. ప్రిన్సిపాల్ మా నాన్నగారిని అడిగారు (ఆయన ఆ కాలేజీలోనే సీనియర్ లెక్చరర్. పైగా ఆ అడ్మిషన్ కమిటిలో సభ్యులు ) మీ వాణ్ని బి.ఎస్సీ . లో కాకుండా బి.కాం. లో ఎందుకు చేరుస్తున్నారు ? అని. ఆ కమిటీలో ఉన్న మిగిలిన లెక్చరర్ లందరికీ నా సంగతి తెలుసు. వాళ్లు కూడా ఉద్యమ ప్రభావం వలన ఈ పరిస్థితి వచ్చింది కానీ లేకపోతే మీ వాడి ఫలితాలు బాగానే ఉండేవి అన్నారు. మా నాన్నగారు మాత్రం కారణమేదైనా వాడికొచ్చిన మార్కులకి మెరిట్ లో బి.ఎస్సీ. సీట్ ఇవ్వలేం కదా ! మెరిట్ లిస్టు ప్రకారం బి. కాం. లోనే ఇవ్వగలం !! అందుకని వాడికి బి.కాం. లోనే సీట్ ఇవ్వండి అని నాకు ఏమాత్రం ఆసక్తి లేని బీకాం లోనే చేర్చారు. దాంతో సాహిత్యం, నాటకం, సాంస్కృతిక కార్యక్రమాల వైపు నా దృష్టి మళ్ళింది. అలా చదువులని త్యాగం చేసిన ప్రత్యేక ఆంధ్రోద్యమాన్ని నాయకులు నిర్వీర్యం చేసేసారు. అప్పట్లో మాకు భవిష్యత్తు గురించిన ఆలోచించే శక్తి లేదు. అదే ఆ నాయకులకు పెట్టుబడి అయింది. ఏదేమైనా ఆ ఉద్యమం నాకు లోకాన్ని తెలియజేసింది. లేకపోతే నూతిలో కప్పలాగా ఉండిపోయేవాడినేమో !

Vol. No. 01 Pub. No. 124

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం