Saturday, August 13, 2011

' అదిరే 'లంగి

కాకినాడలో రామదాసు గారు ఒకప్పుడు పేరుపొందిన హరిదాసు. ఆయనకు సంగీత పరికరాల దుకాణం కూడా ఉండేది. 

అదే కాకినాడలో వున్న యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అనే సంస్థ తెలుగు రంగస్థలానికి, చిత్ర రంగానికీ ఎందఱో కళాకారుల్ని అందించింది. వాళ్ళు అప్పట్లో ఒకసారి ' రఘుదేవ రాజకీయం ' అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ నాటకం చూడడానికి వెడుతూ రామదాసు గారు తన కుమారుడ్ని కూడా వెంట తీసుకెళ్ళారు. అప్పటివరకూ నాటకం అంటే ఎరుగని ఆ అబ్బాయి ఆ ప్రదర్శన చూసి అబ్బురపడిపోయాడు. అతనిలో వున్న కళాకారుడు బయిటకొచ్చాడు. అతనికి కూడా వారిలాగ నటించాలనే కోరిక కలిగింది. కానీ అతనికి తెలుసు.... తండ్రి సుతారమూ ఒప్పుకోడని. ఆ భయంతో కొంతకాలం ఊరుకున్నా ఎంతోకాలం ఆగలేకపోయాడు. అదే యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్  ' బృహన్నల ' అనే నాటకం ప్రదర్శించే ప్రయత్నాల్లో వున్నారని తెలిసింది. అంతే ! వాళ్ళ దగ్గర వాలిపోయాడు. వాళ్ళను బతిమిలాడాడు. ఎలాగో ఆ నాటకంలోని  ఓ బృంద నృత్యంలో స్థానం సంపాదించాడు. హుషారుగా ఆ నృత్యం చేసి మహదానందం పొందాడు. 

 కోరికైతే తీరింది గానీ ఒళ్ళు హూనం అయింది. నాటకం పూర్తయి ఆలస్యంగా ఇంటికి వెళ్ళిన అతనికి తండ్రి బడితె పూజ చేసి తిట్ల పురాణం చదివాడు. నాటకమాడడం మనలాంటి మర్యాదస్తుల పనికాదని, ఆ పని చేసి పరువు తీసాడని, ఇక ఎవరూ పిల్లనివ్వరని.... నానారకాల తిట్లు తిట్టారు. ఇంత జరిగినా అప్పటికే నటన తలకెక్కిన అతనికి ఇవేమీ వినిపించలేదు. వాళ్ళను, వీళ్ళను పట్టుకుని నాటకాల్లో వేషాలు వేసి పేరు తెచ్చుకున్నాడు. అలాగే వచ్చీ రాని ఇంగ్లీష్ లో బొంబాయి, కలకత్తాలలో ఉండే చలనచిత్ర నిర్మాతలకు, దర్శకులకు తనకవకాశం ఇవ్వమని అదేపనిగా ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. చివరికి ఒక నాటకాల మిత్రుని సాయంతో కలకత్తా బయిలుదేరాడు. అక్కడ ఏ వేషం వెయ్యమంటే ఆ వేషం వెయ్యడానికి, అందుకుగాను డబ్భయి అయిదు రూపాయిలు పారితోషికంగా తీసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలాగే ఆ చిత్రంలో వసుదేవుడు, రజకుడు లాంటి చాలా చిన్న చిన్న పాత్రలు ధరించాడు. 

 ఆ చిత్రం 1935 లో తయారైన ' శ్రీకృష్ణ తులాభారం '. ఆ చిత్రం ద్వారా చిత్రసీమలో ప్రవేశించి ఆ తర్వాత ఊహించని ఎత్తులకు ఎదిగిన నటుడు రేలంగి వెంకట్రామయ్య. 

 " వెనుకటి రోజుల్లో పెళ్ళిళ్ళలో అందరి భోజనాలు అయ్యాక భజింత్రీ వాళ్ళకీ, పల్లకీ వాళ్ళకీ, దీపాలు మోసే వాళ్ళకీ ఆ మూల వడ్డించండర్రా ! అనేవారు. నాటకాల్లో హాస్య నటుడి పరిస్థితి కూడా అదే ! కానీ మా వెంకట్రామయ్య చిత్రరంగంలో అడుగుపెట్టాక అప్పటివరకూ అన్ని రసాలకు ఎంత విలువుందో ఒక్క హాస్య రసానికి అంత విలువ తీసుకొచ్చాడు " అనేవారు పుత్రోత్సాహంతో రేలంగి తండ్రి రామదాసు గారు. 


 హాస్యాన్ని అందలాలెక్కించి అందరి చేత ' అదిరే ' అనిపించుకున్న రేలంగి వెంకట్రామయ్య జయంతి సందర్భంగా ఆయన్ని, ఆయన నటననీ  స్మరించుకుంటూ......  





రేలంగి గురించి గతంలో రాసిన టపాలు......



Vol. No. 02 Pub. No. 318

4 comments:

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

శ్రీరేలంగి గురించి మీ రచన నిజంగా అదిరేలాగుంది ! ముఖ్యంగా రేలంగి గొంతునుంచి వచ్చిన
"వినవే బాల" పాటను వినిపిస్తూ చూపించి నందుకు ధన్యవాదాలు.

SRRao said...

అప్పారావు గారూ !
ధన్యవాదాలు.

ఆ.సౌమ్య said...

నిజమే, అదిరేలంగే!

SRRao said...

సౌమ్య గారూ !

ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం