Friday, November 6, 2009

ఆఖరి దశ

మహాభారత యుద్ధ కాలం :

కాశీ
నగరంలో గంగా నది ఒడ్డున కూర్చున్న దేవదత్తుడిని చారుదత్తుడు అడుగుతాడు " సుయోధన మహారాజు కూలిపోయాట్ట. తెలీదా ? " అని. పాండవుల, శ్రీకృష్ణుడి అరాచకాల గురించి చర్చించాక ధర్మానికి, చివరగా మహా ప్రపంచానికే అంత్య కాలం సమీపించిందని నిర్ణయించేసారు ఇద్దరూ .

గౌతమ
బుద్ధుడి కాలం :


"
ఎవడీ శంకరుడు ? ఎక్కణ్ణించి ఊడిపడ్డాడు ? " అని అడిగాడు ఉపాలి అనే బౌద్ధ భిక్షువు. " మంట పుట్టడం మళయాళ దేశంలో పుట్టింది " అంటూ వివరించాడు ఆనందుడు. " ఇంతకాలం తథాగతుడికి తలలొగ్గిన బ్రాహ్మణాధములు మంత్ర తంత్రాలతో తలెత్తుతున్నారన్నమాట " అన్నాడు ఉపాలి. ఆఖరుగా మనం, మన ధర్మపద్ధతి, మన భిక్షువులు లేనినాడు ప్రపంచం చివరి దశకు వచ్చినట్లేనని తీర్మానించారు.

మొఘలు
కాలం :


తాజ్
మహల్ దగ్గర కూర్చున్న రహిమాన్ తో హుస్సేన్ ఖాన్ అన్నాడు రంగజేబు పాదుషా చనిపోయారని. ఇంకేముంది. రాజ్యం కోసం షాజాదాలందరూ కొట్టుకుచస్తారని, కాఫిర్లింక తమని బతకనీయరని ఆందోళన చెందారు. మొఘలు సామ్రాజ్యానికి ఆఖరు రోజులొస్తే మహా ప్రపంచానికే ఆఖరు రోజులోచ్చాయని లెక్క వేసారు.

1947
ఆగష్టు 17 తారీకు :


దేశమంతా
స్వాతంత్ర్యోత్సవాన్ని జరుపుకుంటోంది. " చార్లెస్ ! ఈనాడింత కోలాహలం చేస్తున్న జనమంతా కొద్దికాలంలో గోరీల్లోనూ, శ్మశానాల్లోను ఉంటారు. చూసుకో ! " అన్నాడు రిచర్డ్. దేశమంతటా అల్లర్లు చెలరేగాయని, రష్యన్లు, అమెరికన్లు, జర్మన్లు ఒకటేమిటి ప్రపంచమంతా కొట్టుకుచస్తున్నారని ప్రపంచానికే ఆఖరి దశ సమీపించినట్లేనని నిర్ధారించేశారు.

* * * * * *

ప్రపంచం సాగుతూనే ఉంది. ఇన్ని వేల సంవత్సరాలనుంచీ, ఇన్ని యుగాలనుంచీ ......

ఇదీ ' రావిశాస్త్రి ' గారి " ఆఖరి దశ " కథ సారాంశం. మానవ నైజాన్ని ఇంతకంటే స్పష్టంగా వర్ణించడం సాధ్యం కాదేమో ! మనతోటే లోకం ఉందని, మనం లేకపొతే సృష్టి ఆగిపోతుందనే అహం ఎంత అర్థరహితమో ఈ కథ వివరిస్తుంది. ఎవరికోసం కాలం ఆగదు. ప్రపంచం సాగుతూనే ఉంటుంది. కథలో విషయం ఎంత అవసరమో కథనం కూడా అంతే అవసరం. రావిశాస్త్రి గారి రచనలే దీనికి తార్కాణాలు. రావిశాస్త్రి గారి కథల్లోంచి ఏరుకున్న ఆణిముత్యమీ కథ.

6 comments:

భావన said...

బాగుందండి. బలే ఇచ్చారు నేనసలు కధ అనుకోలేదు, చదువుతూ వెళుతున్నా.. చివరాకరికి 'రావిశాస్త్రి గారి కధ' అంటే ఓ అనుకున్నా అప్పుడు. బాగుంది పరిచయం.

SRRao said...

భావన గారూ !
మీకీ పరిచయం నచ్చినందుకు కృతజ్ఞతలు.

మాలతి said...

బాగుందండీ పరిచయం సూక్ష్మంగా. నాక్కడా ఇది కథ అనిపించలేదు. కాఫీ తాగుతూ ఏవో కొన్ని సామ్యాలు ఎత్తి చూపుతున్నట్టుంది. అయినా రావిశాస్త్రిగారి భాషమూలంగా బాగుందనిపిస్తుంది.

SRRao said...

మాలతి గారూ !
ధన్యవాదాలు

కొత్త పాళీ said...

ఇట్లాంటి వాటిని కథలు అనలేం. కానీ ఆకట్టుకుంటాయి, మనకి అంతకు ముందు తోచని ఏదో సత్యాన్ని ఆవిష్కరిస్తూంటాయి. ఫ్రెంచి రచయిత అనటోల్ ఫ్రాన్స్ గారి కథ ఒకటుంది (నిజంగా కథే!) ప్రొక్యురేటర్ ఆఫ్ జూడియా అని. అది గుర్తొచ్చింది పైన రావుగారు ఉదహరించిన వాక్యాలు చదువుతుంటే.

SRRao said...

కొత్తపాళీ గారూ !
ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం