Wednesday, November 11, 2009

తెలుగు దొరకు పద్య నివాళి

బ్లాగు మిత్రులకు ఆచార్య ఫణీంద్ర గారు పరిచితులే ! నిన్న తెలుగు భాషోద్ధారకుడు చార్లెస్ బ్రౌన్ జన్మదినాన్ని పురస్కరించుకుని నేను అందించిన తెలుగు ' బ్రౌణ్యం ' వ్యాసానికి తమ స్పందన తెలియజేస్తూ వారు పంపిన పద్యాలను మీ కోసం అందిస్తున్నాను.


క్షీణావస్థను డోలికాయ గతియౌ శీర్ణాంధ్ర సాహిత్యమున్
ప్రాణమ్మూదియు కావ బూనితివి శ్రీ " బ్రౌణ్యాఖ్య " ! ఆంధ్రావనిన్
వీణాపాణికి సేవ జేసి, ఘనతన్ విశ్వాంతరాళమ్ములో
కోణాలన్నిట వ్యాప్తి జేసితివి - మా కొండంత దీపానివో !

ఎక్కడి వాడవయ్య ? అసలేమిటి బంధము నీకు తెల్గుకున్ ?
ఇక్కడికేగుదెంచితివి - ఇచ్చితి జన్మ మరొక్కమారు - మా
తిక్కన పెద్దనాది ఘన ధీయుతులౌ కవి పుంగవాళికిన్ !
ఎక్కడొ మూల దాగిన కవీంద్రుడు వేమన సత్యశోధుకున్ !

తెలుగు సాహిత్యమునకు నీ సలిపినట్టి
సేవ, స్మరణీయమై కూర్చె చిరము యశము !
తెలుగు భాషయే జీవించి వెలుగు వరకు
తీర్చలేడు నీ ఋణము మా తెలుగు వాడు !

రచన : ఆచార్య ఫణీంద్ర

2 comments:

రమణ said...

ఫణీంద్ర గారూ, రావు గారూ మీరు అభినందనీయులు. మన తెలుగు కి ఎనలేని సేవ చేసినటువంటి మహనీయుడిని స్మరించుకోవటం మన విధి.

SRRao said...

వెంకట రమణ గారూ !
ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం