Tuesday, August 30, 2011

పూలరంగడు

 కొంతమంది తమకోసం బ్రతుకుతారు. ఇంకొంతమంది తమవాళ్ళ కోసం బ్రతుకుతారు. కానీ చాలా తక్కువమంది మాత్రం సమాజంకోసం బ్రతుకుతారు. 

అతను రాజకీయనాయకుడు కాదు.... సమాజ సేవ చేస్తున్నానని ఫోటోలు దిగి మీడియాలో ప్రచారం చేసుకోవడానికి. 

అతను పేరు పడ్డ సంఘ సేవకుడు కాదు...... అతనికేమీ ఎన్జీవో లు లేవు. 

పూలు అమ్ముకునే సామాన్యమైన వ్యక్తి. కానీ అతనూ సంఘసేవ చేస్తున్నాడు. ఉద్దేశ్యముండాలి గానీ ఎవరి స్థాయిలో వారికి వీలైన సంఘసేవ చెయ్యొచ్చు అని నిరూపించిన వ్యక్తి పూలరంగడు. 

 అంతకు ముందు ఏమేం చేసినా మేము కాలేజీలో చదువుకునేటప్పటికి పూవుల రంగడుగా మారి మా ఊరికి ప్రధానమైన నాలుగురోడ్ల కూడలి అయిన గడియారస్తంభం సెంటర్లో చిన్న బడ్డీ పెట్టుకున్నాడు. నేను హైస్కూల్లో చదివేటపుడు అప్పటి స్నేహితుడు ఒకని ద్వారా పరిచయమయ్యాడు. అప్పట్లో కాలేజీలో గానీ, బయిటగానీ మేము నిర్వహించే కార్యక్రమాలకు అవసరమైన పూలదండలు గానీ, బొకేలు గానీ రంగడి దగ్గర కొనాల్సిందే ! జేబులో డబ్బులు వున్నాయో లేదో చూసుకోకుండా వెళ్ళినా ' డబ్బులదేముంది గురూ ! ముందు నీక్కావల్సినవి తీసుకెళ్ళు ' అని సంతోషంగా ఇచ్చి పంపేవాడు. బోకేలైతే ఎలాంటి బోకే అయినా ఒకే ధర. ' అదేమిటి రంగా ! దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది కదా ! ' అంటే ' ఫర్వాలేదు గురూ ! నీకే కదా ! ' అనేవాడు. 

మేము త్యాగరాయ గానసభలోనో, మరో సందర్భంలోనో  ప్రముఖులెవరికైనా సన్మానం తలపెట్టి దండలు తీసుకుంటుంటే చివర్లో ఒక దండ ఉచితంగా ఇచ్చేవాడు. ఎందుకంటే ' ఇది పూలరంగడి దండ. నా పేరు చెప్పి వెయ్యండి ' అనేవాడు. నువ్వే వచ్చి వెయ్యి అంటే సిగ్గు పడేవాడు. కొన్ని సందర్భాల్లో బలవంతం చేసి తీసుకొచ్చి అతని చేతనే వేయించేవాళ్ళం. ఊరు వదలి దేశం మీద పడినప్పుడు తరచుగా ఊరికి వెళ్లకపోయినా వెళ్ళినపుడు సెంటర్ కి వెడితే అదే బడ్డీ, అదే ఆప్యాయతతో కూడిన పలకరింపు. వయసు పెరిగి మనిషి ఆకారంలో మార్పు వచ్చిందేమో గానీ, అప్యాయతలో మాత్రం మార్పు లేదు. 

మూడు సంవత్సరాల క్రితం అనుకుంటాను. కలిసినపుడు నా ప్రక్కన వున్న స్నేహితుడు చెప్పాడు... రంగడి సేవా కార్యక్రమం గురించి. అదే మొహమాటంతో ' ఇందులో ఏముంది గురూ ! నాకు చేతనైంది చేస్తున్నాను. అంతే ! పోయేటప్పుడు కట్టుకుపోతామా ! ' అని తేల్చేసాడు. సంస్కారం అనేది మనిషి హోదాలోనో, వేసుకునే బట్టల్లోనో, డబ్బులోనో ఉండదనడానికి మా పూలరంగడే సజీవ ఉదాహరణ. 

చాలా రోజుల తర్వాత నా జ్ఞాపకాల పందిరిని కదిలించి మా పూలరంగడిని గుర్తు చేసిన, అతను చేస్తున్న సేవను వెలుగులోకి తెచ్చిన అరుణ పప్పు గారికి, ఆంధ్రజ్యోతి వారికీ కృతజ్ఞతలతో ............ 

పూలరంగడు చేస్తున్న సంఘసేవ ఏమిటో తెలుసుకోవాలంటే ఈరోజు ఆంధ్రజ్యోతిలోని లింక్.........

 పూలరంగడి ' సంస్కారం '

Vol. No. 03 Pub. No. 019

3 comments:

తృష్ణ said...

పొద్దున్నే పేపర్లో చదివి నేనూ చాలా సంతోషించానండీ. మంచి టపా రాసారు.

Gomati Dittakavi Jonnalagadda said...

poola rangadini maaku parichayam chesi enta manchi pani chesaru. Chinna chinna panullo kooda samskaram, sahridbhavam choopagalagatam goppa kada...!!!! dhanyavaadaalu sira garu.

mee sishya paramanuvu.

SRRao said...

* తృష్ణ గారూ !

పేపర్లో చూడగానే చాలా ఆనందం వేసింది. చదువుకున్నామనే వాళ్ళలో చాలామందికి లేని సంస్కారం అతనిలో వుండేది. అందుకే అతను మాకు నచ్చేవాడు. అందుకే మీ అందరికీ కూడా పరిచయం చెయ్యాలనిపించింది. ధన్యవాదాలు.

* గోమతి గారూ !

చాలా సంతోషం. కానీ రంగడితో పోలిస్తే నేను చాలా చిన్నవాణ్ణి. అంత విశాల హృదయం, సంస్కారం నాకు ఇంకా రాలేదేమో ! శిష్య పరమాణువు అనడం ఎందుకో ఇబ్బందిగా వుంది. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం